Sakshi News home page

రవాణా కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి

Published Wed, Jun 21 2023 1:24 AM

- - Sakshi

ములుగు: ములుగు జిల్లా ఏర్పడి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇన్ని రోజులు వాహన రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ల విషయంలో ఇప్పటి వరకు ఉమ్మడి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మీదనే ఆధార పడాల్సి వచ్చింది. వాహనదారులకు ఆ కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. జిల్లాకు ప్రత్యేక కోడ్‌ టీఎస్‌ 37ను కేటాయిస్తూ రాష్ట్ర రవాణా శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లా కేంద్రంలో కార్యాలయ ఏర్పాటుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇందులో భాగంగా రంగరావుపల్లి సమీపంలోని లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ ఆవరణలో భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. రంగులు అద్ది ముస్తాబు చేశారు. భవనం ముందున్న సుమారు రెండెకరాల ఖాళీ స్థలంలో మట్టిపోసి రోలర్‌తో చదును చేశారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పనులు పూర్తి అయిన తరువాత రాష్ట్ర రవాణా శాఖ, కలెక్టర్‌ ఆదేశాలతో ఈ నెల చివరి వారంలో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు.

స్థానికులకు ఉపాధి
రవాణా శాఖ కార్యాలయ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి. ఇప్పటికే లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ చుట్టపక్కల అద్దె గదులను వ్యాపారులు వెతుకుతున్నారు. సరైన భవనాలు లేని పక్షంలో డబ్బాలను ఏర్పాటు చేసుకొని ఆన్‌లైన్‌ చేసేందుకు చదువుకున్న యువత మొగ్గు చూపుతున్నారు.

భూపాలపల్లి నుంచి సిబ్బంది కేటాయింప
ములుగు జిల్లాలో ఏర్పాటు కానున్న ఆర్టీఓ కార్యాలయానికి ఇప్పటి వరకు మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా శ్రీనివాస్‌ మాత్రమే పూర్తి బాధ్యతల్లో ఉన్నారు. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న విద్యావంతులు, కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియ పూర్తి కాలేదు. తాత్కాలికంగా ప్రస్తుతం భూపాలపల్లిలో నిర్వహిస్తున్న రవాణా శాఖ కార్యాలయం నుంచి సిబ్బందిని కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా బండారుపల్లి సమీపంలో రవాణా శాఖకు కలెక్టర్‌ రెండు ఎకరాల భూమిని కేటాయించారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. భవన నిర్మాణ పనులు పూర్తి అయ్యేంత వరకు తాత్కాలిక భవనంలో కొనసాగనున్నాయి.

తగ్గనున్న దూరభారం.. పెరగనున్న ఆదాయం
జిల్లాలోని చిట్టచివరిగా ఉన్న మంగపేట, వాజేడు, వెంకటాపురం(కె), కన్నాయిగూడెం మండలాల వాహనదారులు వాహనాల రిజిస్ట్రేషన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు భూపాలపల్లికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. జిల్లాకు ప్రత్యేక రవాణా శాఖ కార్యాలయం కేటాయించడంతో సుమారు 150 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి ఉపయోగకరంగా మారనుంది. దూరభారం భారీగా తగ్గనుంది. సుధీర్ఘ ప్రయాణం చేయలేక చాలా మంది ఇప్పటి వరకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోలేని వారంతా ప్రస్తుతం జిల్లా కేంద్రానికి వచ్చి తీసుకోవచ్చు. కార్యాలయం ప్రారంభమైతే వాహనాదారులు లైసెన్స్‌ల కోసం క్యూ కట్టనున్నారు. ఇదే సమయంలో స్లాట్‌ బుకింగ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు వచ్చే ఆదాయం భారీగా పెరుగనుంది. జిల్లా కేంద్రంలో కార్యాలయం ఏర్పాటు అవుతుందని తెలిసి వాహనదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం..
జిల్లా కేంద్రంలో కార్యాలయం ఏర్పాటుకు ఆదేశాలు వచ్చాయి. జిల్లాకు టీఎస్‌ 37 కోడ్‌ను కేటాయించారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పనులు మిగిలి ఉన్నాయి. రెండు లేదా మూడు రోజుల్లో సామగ్రి వస్తుంది. పనులు పూర్తి అయ్యాక ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్యాలయాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అధికారిక భవనం పూర్తి అయ్యేంత వరకు తాత్కాలికంగా లిటిల్‌ ఫ్లవర్‌ హై స్కూల్‌ పక్కన అద్దె భవనంలో కార్యాలయాన్ని కొనసాగిస్తాం.
– శ్రీనివాస్‌, జిల్లా రవాణా శాఖ అధికారి

Advertisement

What’s your opinion

Advertisement