
బాలీవుడ్ కపుల్స్ ఐశ్వర్యరాయ్(Aishwarya Rai), అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan)ల దెబ్బతో యూట్యూబ్ దిగొచ్చింది. యూట్యూబ్‌లో తమ అనుమతి లేకుండా ఫోటోలు ఉపయోగిస్తున్నారని వాటిని తొలగించాలని కొద్దిరోజుల క్రితం ఢిల్లీ హైకోర్టును వారు ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోర్టు నుంచి వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినప్పటికీ యూట్యూబ్‌లో ఆ వీడియోలు ఉండటంతో ఐశ్వర్య దంపతులు ఆగ్రహించారు. మరోసారి కోర్టుకు వెళ్లారు. యూట్యూబ్‌పై రూ. 4 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. దీంతో ఆ సంస్థ దిగొచ్చింది.
ఐశ్వర్య దంపతులు రూ.4కోట్ల దావా వేయడంతో ఆ వీడియోలను యూట్యూబ్ తొలగించింది. సుమారు 250కి పైగా వీడియో లింక్‌లను తొలగించడంతో పాటు ఆ ఛానల్స్‌ను బ్లాక్ చేసింది. ఇప్పటికే ఆ వీడియోలకు సుమారు 20 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం ఆశ్చర్యం కలిగించే అంశమని చెప్పవచ్చు. ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత సినీ సెలబ్రిటీలకు ఇలాంటి చిక్కులు ఎక్కువ అవుతున్నాయి. రీసెంట్‌గా అక్కినేని నాగార్జున కూడా తన ఫోటోలు, వీడియోలు అనుమతి లేకుండానే కొన్ని సంస్థలు తమ వ్యాపారా ప్రకటనలకు ఉపయోగిస్తున్నట్లు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఐశ్వర్యరాయ్ అనుమతి లేకుండా ఆమె ఫొటోలు, వీడియోలను ఏఐ టెక్నాలజీ ఉపయోగించడంతో వారు అభ్యంతరం తెలిపారు. ఆమె పేరు, గౌరవం, ప్రతిష్ఠ ను దెబ్బతీసేలా ఇలాంటి వీడియోలు ఏంటి అంటూ కోర్టు పేర్కొంది. ఐశ్వర్యను దెబ్బతీసేలా ఉన్న యూఆర్‌ఎల్‌లను తొలగించి బ్లాక్ చేయాలని గూగుల్, యూట్యూబ్‌తో సహా ఇతర ప్లాట్‌ఫార్మ్‌లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 72 గంటల్లోపు ఎలాంటి వీడియోలు కనిపించకూడదని హెచ్చిరించింది. ఈ క్రమంలోనే యూట్యూబ్, గూగుల్ చర్యలు చేపట్టింది.