Yo Yo Honey Singh: గృహహింస ఆరోపణలను ఖండించిన సింగర్

Yo Yo Honey Singh: ప్రముఖ బాలీవుడ్ సింగర్ యోయో హనీసింగ్ తనను టార్చర్ పెట్టాడంటూ అతడి భార్య షాలిని గృహహింస ఆరోపణలు చేసిన విషయం విదితమే. అతడికి వేరే మహిళలతో అక్రమ సంబంధం ఉందని, అదేంటని నిలదీస్తే తనపైకి మందు బాటిల్ విసిరాడని ఆమె తీవ్రంగా ఆరోపించింది. తాజాగా ఈ ఆరోపణలను తోసిపుచ్చాడు హనీసింగ్.
'నా భార్య షాలిని తల్వార్ నాపై, నా కుటుంబంపై మోపిన అసత్య, హానికరమైన ఆరోపణలు విని నేను చాలా బాధపడ్డాను, ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను. ఆమె చెప్పేవి చాలా అసహ్యంగా ఉన్నాయి. గతంలో నా మ్యూజిక్ మీద, ఆరోగ్యం మీద ఎన్నో రూమర్లు వచ్చినప్పటికీ వాటిపై నేనెప్పుడూ స్పందించలేదు. నాపై వ్యతిరేక ప్రచారం జరిగినా ఎలాంటి ప్రెస్‌నోట్ జారీ చేయలేదు. కానీ ఈసారి మౌనంగా ఉండటం కరెక్ట్ కాదనిపిస్తోంది. ఎందుకంటే నాకు ఎంతగానో అండగా నిలబడ్డ నా వృద్ధ తల్లిదండ్రులు, చెల్లె మీద ఆమె నీచమైన ఆరోపణలు చేస్తోంది. ఇవి మా పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయి'
'నేను ఇండస్ట్రీలో ఉండి 15 ఏళ్లు పైనే అవుతోంది. ఈ జర్నీలో దేశవ్యాప్తంగా ఉన్న పలువురు కళాకారులు, సంగీతకారులతో కలిసి పని చేశాను. నా భార్యతో ఎలా ఉంటాననేది అందరికీ తెలుసు. ఎందుకంటే షూటింగ్‌లు, ఈవెంట్లకు ఆమెను కూడా వెంటపెట్టుకుని వెళ్లేవాడిని. ఆమె చేసిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా. నాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. త్వరలోనే నిజం బయటపడుతుందని ఆశిస్తున్నా. అప్పటివరకు నా గురించి, నా కుటుంబం గురించి ఎలాంటి నిర్ధారణకు రావొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నా' అని పోస్ట్ పెట్టాడు.
— Yo Yo Honey Singh (@asliyoyo) August 6, 2021