చిత్రం భళారే రీళ్ల చిత్రం | World Day for Audiovisual Heritage: A Special Feature on Film Reels | Sakshi
Sakshi News home page

చిత్రం భళారే రీళ్ల చిత్రం

Oct 27 2026 4:33 AM | Updated on Oct 27 2026 4:33 AM

World Day for Audiovisual Heritage: A Special Feature on Film Reels

ఆట, పాట, మాట కలగలిసిన వెండితెర వెలుగే సినిమా. ఎన్ని ప్రత్యామ్నాయాలు వచ్చినా వినోదపు పూలతోటలో అత్యుత్తమ సుమగంధం సినిమాకే చెల్లు. సినిమా ద్వారా మనందరికీ వినోదపు జల్లులను పంచడంలో ప్రధాన  భూమిక వహించేది రీళ్లు. ఆ సినిమాలను రీళ్ల రూపంలో నిక్షిప్తం చేయడం ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు, సాంకేతిక కారణాలు... వీటన్నింటినీ దాటి పదేపదే ప్రదర్శించి వందరోజులు తర్వాత కూడా చిత్రాన్ని చెక్కుచెదరకుండా ఉంచుతుందంటే ఫిల్మ్‌ ఎంత గొప్ప టెక్నాలజీనో కదా! నేడు ప్రపంచ ఆడియోవిజువల్‌ వారసత్వ దినోత్సవం. ఈ సందర్భంగా సినిమా రీళ్లపై ప్రత్యేక కథనం..

కాలం గడిచే కొద్దీ పాడైపోతున్న ఫిల్మ్‌ రీళ్లలోనే మిగిలిపోతే? అందులోని దృశ్యాలు, శబ్దాలు శాశ్వతంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంటే? వాటిని తిరిగి తెరపైకి తీసుకురావడం సాధ్యమేనా? అంటే సాధ్యమే... భారతీయ సినిమా అంటే ‘శివ’ చిత్రానికి ముందు ఆ తర్వాత అంటారు. ఈ మూవీ 4కెలో  పునరుజ్జీవం తెచ్చుకుని ఇటీవల ప్రేక్షకులను మరోసారి పలకరించింది. 

ఏడేళ్ల కష్టం శివ
మనిషికి గుండె ఎంత ముఖ్యమో సినిమాకి ఒరిజిన ల్‌ నెగెటివ్‌ అంతే ముఖ్యం. ప్రేక్షకుల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా చోటు సంపాదించుకున్న చిత్రం ‘శివ’. కానీ ఆ సినిమాని ఇప్పటి తరానికి అందించే డిజిటలైజేషన్‌ ప్రక్రియలో వచ్చిన అతిపెద్ద అడ్డంకి సినిమా రీళ్లు దెబ్బతినడం. ఒరిజినల్‌ నెగెటివ్‌ బాగా దెబ్బతిని అతుక్కుపోయిన స్థితిలో ఉండటంతో వాటిని నేరుగా స్కాన్‌ చేయలేని పరిస్థితి ఎదురైంది. దీంతో అల్ట్రాసోనిక్‌ క్లీనింగ్‌ ప్రక్రియను నాలుగైదుసార్లు నిర్వహించి స్కానింగ్‌కు అనువుగా మార్చారు. 4కే స్కానింగ్‌ పూర్తయిన తర్వాత కూడా పని పూర్తికాలేదు.

దుమ్ము, గీతలు, దెబ్బతిన్న ఫ్రేమ్‌లను ఒక్కొక్కటిగా సరిచేయడానికి మరో ఎనిమిది నుంచి పది నెలలు పట్టింది. ఇంతలో అసలు సౌండ్‌ నెగెటివ్‌లలోని రెండు రీళ్లు పూర్తీగా దెబ్బతిన్నాయి. దీంతో చిత్ర బృందం పాత ప్రింట్లను భద్రపరిచిన ఎగ్జిబిటర్లను సంప్రదించింది. దాదాపు 20 మందిని  ఎగ్జిబిటర్లను సంప్రదించిన తర్వాత ఆ రెండు రీళ్లు లభించాయి. ఇలా మొత్తంపైన ‘శివ’ సినిమా రీళ్లని 4కే వెర్షన్‌లోకి మార్చి విడుదల వరకు తీసుకురావడానికి దాదాపు ఏడేళ్లు పట్టింది. 

డిజిటల్‌ ఉన్నా.. ఫిల్మ్‌ ఎందుకు?
ఇప్పుడు డిజిటల్‌ కెమెరాలు విస్తృతంగా అందుబాటులో ఉన్నప్పటికీ కొందరు దర్శకులు ఫిల్మ్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. ‘ఫిల్మ్‌పై చిత్రీకరించడం, దాన్ని ఎడిటింగ్‌ ప్రక్రియలో ఉపయోగించడం పట్ల తనకు ప్రత్యేక అనుబంధం ఉంది’ అంటూ దర్శకుడు స్టీవెన్  స్పీల్‌బర్గ్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. ఫిల్మ్‌ అందించే చిత్ర నాణ్యత, పెద్ద తెరపై కలిగించే దృశ్యానుభూతికి తాను అధిక ప్రా ధాన్యం ఇస్తానని డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ నోలన్  చె΄్పారు. ఆయన తెరకెక్కించిన ‘ది ఒడిస్సీ’ మూవీ పూర్తిగా ఐమ్యాక్స్‌ ఫిల్మ్‌ కెమెరాలతో చిత్రీకరించారు. ఒక సినిమాను కాపాడటం అంటే పాత సాంకేతికతను కాపాడటం మాత్రమే కాదు.. చలనచిత్ర సంస్కృతిని, కళాకారుల శ్రమను, ప్రేక్షకుల జ్ఞాపకాలను భావితరాలకు అందించడం కూడా! అంటూ ‘శివ’ సినిమా పునరుద్ధరణ విషయం మనకు చెబుతుంది. –శ్రావణ్‌ జయ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement