రవితేజగారు హిట్టవుతుందన్నారు

Vishnu Vishal talks about FIR - Sakshi

‘‘నా కెరీర్‌లో ‘రాక్షసన్‌’ కంటే ముందు కూడా మంచి హిట్స్‌ ఉన్నాయి. కానీ నా మార్కెట్‌ను పెంచిన చిత్రం ‘రాక్షసన్‌’. ఈ సినిమా తర్వాత నాకు పెద్ద నిర్మాతలు, దర్శకుల నుంచి మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ కొన్ని కారణాలతో ఆ సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇలా ఎందుకు జరుగుతోంది? అనే కోపంతోనే నిర్మాతనయ్యాను’’ అని విష్ణువిశాల్‌ అన్నారు. విష్ణు విశాల్‌ హీరోగా నటించి, నిర్మించిన తమిళ చిత్రం ‘ఎఫ్‌ఐఆర్‌’. మను ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో  ఈ నెల 11న విడుదల కానుంది. హీరో రవితేజ సమర్పణలో అభిషేక్‌ నామా ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా విష్ణు విశాల్‌ చెప్పిన విశేషాలు.

► ముందు మను ఆనంద్‌ ఓ యాక్షన్‌ స్టోరీ చెప్పారు. వేరే కథ ఉందా? అని అడిగితే ‘ఎఫ్‌ఐఆర్‌’ సినిమా లైన్‌ చెప్పారు. నేను ఈ లైన్‌కి ఓకే చెప్పడంతో ఆయన ఆశ్యర్యపోయారు. ఎందుకంటే ఇలాంటి ఓ సున్నితమైన కథను నేను ఒప్పుకుంటానని ఆయన ఊహించలేదు. ఈ సినిమాను నా స్నేహితుడు ఒకరు నిర్మించాల్సింది కానీ పరిస్థితుల కారణంగా నేనే నిర్మాతగా మారాల్సి వచ్చింది. నేను ఎప్పుడు కులాలు, మతాలు అని చూడను. ఈ సినిమాలో ఏ మతాన్ని, ఎవ్వర్నీ తక్కువగా చూపించలేదు. మతం కంటే మాన వత్వం గొప్పది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.

► నా భార్య జ్వాల (బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల) ఫ్రెండ్‌ ఒకరు రవితేజ దగ్గర వర్క్‌ చేస్తున్నారు. అలా ‘ఎఫ్‌ఐఆర్‌’ సినిమా గురించి రవితేజతో మాట్లాడటం జరిగింది. ఈ సినిమా రఫ్‌ కట్‌ చూసిన రవితేజగారు తప్పకుండా హిట్‌ అవుతుందన్నారు. ‘మీలా నేను కమర్షియల్‌ సినిమాలు చేయాలనుకుంటున్నాను’ అని నేను రవితేజతో అంటే.. ‘ నేను నీలా కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలు చేయాలనుకుంటున్నాను’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top