గుండెపోటుతో ప్రముఖ హీరో భార్య మృతి.. దిగ్భ్రాంతి చెందిన సీఎం

Vijay Raghavendra Wife Spandana Passes Away - Sakshi

కన్నడ ప్రముఖ నటుడు,సింగర్‌ విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన మరణించారు. కుటుంబంతో కలిసి బ్యాంకాక్‌కు విహారయాత్రకు వెళ్లిన స్పందన  అక్కడ  గుండెపోటుతో మరణించారు. ఆమె  ఆకస్మిక మరణ వార్తతో కుటుంబ సభ్యులతో పాటు శాండల్‌వుడ్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. కన్నడ దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ కుటుంబానికి విజయ్‌ రాఘవేంద్ర దగ్గర బంధువు. 2021లో పునీత్‌ కూడా గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు వారి కుటుంబం నుంచి స్పందన మరణించడం చాలా బాధాకరమైన సంఘటననే చెప్పవచ్చు.

(ఇదీ చదవండి: కీర్తి చెల్లిగా చేస్తే.. ఈమె తల్లి చిరుకు హీరోయిన్‌గా చేసింది!)

ఈ నెలలో ఈ జంట తమ 16వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్న తరుణంలో ఈ విషాదం చోటు చేసుకుంది.  2007లో విజయ్ రాఘవేంద్రను ప్రేమించి ఆమె పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు శౌర్య అనే కుమారుడు ఉన్నాడు. విజయ రాఘవేంద్ర, స్పందన జంటకు శాండల్‌వుడ్‌లో భారీ ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆమె ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. తన భర్త సినిమాలకు స్పందననే నిర్మాతగా ఉండి పలు సినిమాలను కూడా నిర్మించింది. తుళు కుటుంబానికి చెందిన స్పందన మాజీ పోలీసు అధికారి శివరామ్ కుమార్తె.  

2017లో విడుదలైన రవిచంద్రన్ చిత్రం అపూర్వలో కూడా ఆమె అతిధి పాత్ర పోషించింది. స్పందన భౌతికకాయం రేపటిలోగా బెంగళూరుకు తీసుకురానున్నట్లు సమాచారం. శాండల్‌వుడ్‌లో పాపులర్ యాక్టర్ అయిన స్పందన భర్త విజయ్ రాఘవేంద్ర నటించిన 'చిన్నారి ముఠా' సినిమాతో జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. అక్కడి పరిశ్రమలో ఆయన సుమారు 50 సినిమాలకు పైగా నటించగా 20కు పైగా పాటలు పాడారు. ప్రస్తుతం పలు టీవీ షోలలో ప్రసారం అవుతున్న డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌లకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

దిగ్భ్రాంతికి గురి చేసింది: కర్ణాటక ముఖ్యమంత్రి
ప్రముఖ కన్నడ నటుడు విజయ రాఘవేంద్ర భార్య స్పందన అకాల మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. స్పందనను కోల్పోయిన విజయ రాఘవేంద్ర, బికె శివరామ్‌ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top