
టాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ ఎంత గుర్తింపు తెచ్చుకున్నా సరే కొందరు చిన్న నటుల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. అవకాశాలు రాకపోతే రోజు కూడా గడవదు. అలాంటిది ఏదైనా రోగమొచ్చి మంచం పడితే అంతే సంగతులు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే 'వెంకీ' సినిమాలో హీరో రవితేజ ఫ్రెండ్‌గా నటించి ఆకట్టుకున్న కమెడియన్ రామచంద్ర ఇప్పుడు మంచం పైనుంచి కదల్లేని స్థితిలో ఉన్నాడు. పక్షవాతానికి గురయ్యాడు. ఇంతకీ అసలేమైంది?
కమెడియన్ రామచంద్ర అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ చూస్తే గుర్తుపడతారు. జూ. ఎన్టీఆర్ హీరోగా నటించిన 'నిన్ను చూడాలని' సినిమాతో ఇతడు నటుడిగా మారాడు. తర్వాత ఆనందం, సొంతం, వెంకీ, కింగ్, దుబాయి శీను, లౌక్యం తదితర చిత్రాల్లో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓవరాల్ కెరీర్‌లో 100కి పైగా చిత్రాల్లో నటించాడు. అలాంటిది ఇప్పుడు ఇతడి ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మారింది.
(ఇదీ చదవండి: అనుపమ 'పరదా' సినిమా రివ్యూ)
తను పక్షవాతానికి గురైనట్లు తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ వీడియోలో మాట్లాడిన రామచంద్ర.. '15 రోజుల క్రితం ఓ డెమో షూట్ కోసం వెళ్లాను. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాళ్లు లాగేసినట్లు అనిపించాయి. దీంతో డాక్టర్ దగ్గరకెళ్లి పరీక్షలు చేయించుకుంటే బ్రెయిన్‌లో రెండు క్లాట్స్ ఉన్నట్లు తెలిసింది. దీంతో నా ఎడమ చేయి, కాలు పడిపోయాయి. ప్రస్తుతం మందులు వాడుతున్నాను. కనీసం రెండు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు. నా గురించి మొత్తం నా సోదరుడే చూసుకుంటున్నాడు. రెండు నెలల పాటు ఉద్యోగానికి సెలవు కూడా పెట్టేశాడు' అని తన పరిస్థితి గురించి వివరించాడు.
తన తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారని, తన తమ్ముడే బాగోగులు చూసుకుంటున్నాడని రామచంద్ర చెప్పాడు. తోటి ఆర్టిస్టులకు తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించాలని, వాళ్ల ద్వారా ఇండస్ట్రీలోని ప్రముఖులకు ఈ విషయం చేరుతుందనే ఆశతో ఉన్నాడని అన్నాడు. ఇప్పటికైతే టాలీవుడ్ నుంచి ఎవరూ తనకు ఫోన్ చేసి ఎలా ఉందని అడగలేదని తెలిపాడు. అయితే రామచంద్ర పరిస్థితి చూసిన సినీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన వైద్య పరంగా ఎవరైనా సినీ ప్రముఖులు సాయం చేయాలని కోరుతున్నారు.
(ఇదీ చదవండి: సినీ కార్మికులు రోడ్డున పడ్డారు)