
సమ్మె చేస్తున్న సినీ కార్మికులు
18 రోజులుగా కొనసాగుతున్న సమ్మె
విఫలమవుతున్న చర్చలు
పిల్లల ఫీజులు, ఇళ్ల అద్దెలు చెల్లించలేక అష్టకష్టాలు
బంజారాహిల్స్: వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు చేస్తున్న సమ్మె 18వ రోజుకు చేరింది. ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ మధ్య చర్చలు సఫలం కాకపోవడంతో వేలాది మంది కార్మికులు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. షూటింగ్‌లు జరగకపోవడంతో పూట గడవడంలేదు. ఇంటి అద్దెలు చెల్లించే పరిస్థితి లేకుండాపోయింది. అప్పు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్థితి దాపురించిందని కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
30 శాతం వేతనాలు పెంచాలంటూ..
నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి సినీ కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాల్సి ఉంటుంది. గత జూన్ 30న ఈ గడువు ముగిసింది. జూలై 1 నుంచి పెంచిన 30 శాతం వేతనాలతో సినీ కార్మికులకు వేతనాలు ఇవ్వాల్సి ఉంది. వేతనాల పెంపునకు ఫిలిం ఛాంబర్ వెనుకడుగు వేసింది. తమకు మూడు నెలల గడువు కావాలంటూ కోరింది. నెల గడవకముందే తాము 15 శాతం వేతనాలు పెంచుతామని అది కూడా మూడు విడతలుగా పెంచుతామని ఫైటర్లు, డ్యాన్సర్లు, టెక్నీషియన్లకు మాత్రం పెంచేది లేదంటూ మెలిక పెట్టింది.
దీంతో ఫిలిం ఫెడరేషన్ నాయకులు సాధ్యం కాని షరతులకు ఒప్పుకోలేదు. ఫలితంగా రెండు వారాల నుంచి సినీ పెద్దలకు కార్మిక యూనియన్ నాయకులకు చర్చలు జరుగుతున్నా అవి ఫలప్రదం కావడం లేదు. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ఇంటి అద్దెలు కట్టాలంటూ కొందరు, పిల్లల ఫీజులు చెల్లించలేక ఇంకొందరు.. ఇలా సినీ కార్మిక లోకం కన్నీరు పెడుతోంది. గత మూడు రోజుల నుంచి కొందరు సినీ పెద్దలు ఫిలిం ఫెడరేషన్ నాయకులతో మాట్లాడినా ఉపయోగం లేకుండా పోయింది. ఫిలిం ఫెడరేషన్ అనుబంధంగా ఉన్న జూనియర్ ఆర్టిస్ట్‌లు, లైట్‌మెన్లు, ప్రొడక్షన్ అసిస్టెంట్లు, మేకప్ ఆర్టిస్ట్‌లు, డ్రైవర్లు.. తదితర కార్మికులంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అద్దె ఇల్లు ఖాళీ చేయాలంటున్నారు
షూటింగ్‌లు ఉంటేనే ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు చెల్లించగలుగుతాం. ఇప్పుడు ఇంటి అద్దె కూడా కట్టలేక చాలా మంది కార్మికులు చేతులెత్తేశారు. ఇప్పటికై నా సినీ పెద్దలు మా విషయంలో పెద్ద మనసుతో ఆలోచించి మా డిమాండ్లు నెరవేర్చాలి. – లలిత, ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్
అన్నీ కొర్రీలే
మా డిమాండ్లు నెరవేర్చడంలో కొర్రీలు పెడుతున్నారు. ఆదివారం ప్రభుత్వ సెలవుల్లో ఫుల్ కాల్షీట్లు ఇస్తారు. ఇవి ఇచ్చేది లేదంటూ పెద్దలు చెబుతున్నారు. ఇదెక్కడి అన్యాయం. మా కార్మికుల విషయానికి వచ్చేసరికి ఎందుకింత పట్టుదలగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. - చంద్రకళ, జనరల్ సెక్రటరీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్