అనుకున్న తేదీ ఒకటి.. అయినది వేరొకటి.. లేట్‌గా అయినా లేటెస్ట్‌గా

Upcoming Telugu Movies Release Dates after Postponement - Sakshi

కొన్ని సినిమాలు లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తుంటాయి. రిలీజ్‌లు కాస్త ఆలస్యమైనా ఫర్వాలేదు కానీ క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడకపోవడమే ఈ వాయిదాలకు ఓ కారణం. మరో కారణం ఒకేసారి ఎక్కువ చిత్రాలు విడుదలైతే, థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడటం. కారణాలేమైనా అనుకున్న తేదీ ఒకటి..  అయినది వేరొకటి అన్నట్లుగా ఇటీవల పలు చిత్రాల విడుదల వాయిదా పడింది. ఒకటికి మించి ఎక్కువసార్లు వాయిదా పడిన సినిమాలు ఉన్నాయి. ఆ చిత్రాలు, వాటి కొత్త విడుదల తేదీల గురించి తెలుసుకుందాం.  

► వేసవికి రావాల్సిన ‘భోళా శంకర్‌’ ఆగస్టుకు షిఫ్ట్‌ అయ్యాడు. చిరంజీవి టైటిల్‌ రోల్‌ చేస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్‌’. ఈ సినిమాను ముందు ఏప్రిల్‌ 14న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఆగస్టు 11కు రిలీజ్‌ను వాయిదా వేశారు. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా నటిస్తున్నారు. అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది.

► ఈ ఏడాది సంక్రాంతికి ‘ఆదిపురుష్‌’ చిత్రం సిల్వర్‌ స్క్రీన్‌పైకి రావాల్సింది. కానీ మెరుగైన వీఎఫ్‌ఎక్స్‌ కోసం జూన్‌ 16కు వాయిదా వేశారు. ఈ మైథలాజికల్‌ ఫిల్మ్‌లో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీసనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ దత్తా, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. టి. సిరీస్‌ భూషణ్‌ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్‌ రౌత్, ప్రసాద్‌ సుతారియా, రెట్రోఫిల్స్‌ రాజేష్‌ నాయర్, యూవీ క్రియేషన్స్‌ వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ఈ చిత్రం నుంచి ‘జై శ్రీరామ్‌..’ అనే తొలి పాటను విడుదల చేశారు. అజయ్‌–అతుల్‌ సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

► మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా పేర్కొన్నారు. ఫైనల్‌గా జనవరి 13న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.   

► విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2022 క్రిస్మస్‌ సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. ఆ తర్వాత ఫిబ్రవరిలో రిలీజ్‌ చేస్తారనే టాక్‌ తెరపైకి వచ్చింది. కానీ ‘ఖుషి’ సినిమాను సెప్టెంబరు1న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

► నిఖిల్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘స్పై’. ఎడిటర్‌ గ్యారీ బీహెచ్‌ దర్శకత్వలో రాజశేఖర్‌ రెడ్డి, చరణ్‌ రాజ్‌ నిర్మించారు. ఈ చిత్రాన్ని 2022 దసరాకు విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు మేకర్స్‌. కానీ రిలీజ్‌ 2023 సమ్మర్‌కు వాయిదా పడింది. అయితే ఈ వేసవికి ‘స్పై’ రాలేదు. ఫైనల్‌గా
జూన్‌ 29న విడుదల కానుంది.

► బెల్లంకొండ గణేశ్‌ హీరోగా నటించిన ‘నేను స్టూడెంట్‌ సర్‌’ 2022 డిసెంబరులో రిలీజ్‌ కావాలి. కానీ రాలేదు. ఆ తర్వాత ఫిబ్రవరి, మార్చిలో రిలీజ్‌ చేయాలనుకున్నారు మేకర్స్‌. కానీ వీలుపడలేదు. తాజాగా జూన్‌ 2న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో ‘నాంది’ సతీష్‌ వర్మ నిర్మించిన చిత్రం ఇది.    

► దగ్గుబాటి అభిరామ్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘అహింస’. తేజ దర్శకత్వంలో పి. కిరణ్‌ నిర్మిస్తున్నారు. గతంలో రెండుమూడు సార్లు ఈ సినిమా రిలీజ్‌ వాయిదా పడింది. రీసెంట్‌గా ఈ సినిమాను ఏప్రిల్‌ 7న విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ ప్రయత్నాలు చేసినప్పటికీ మరోమారు వాయిదా పడి, జూన్‌ 2న రిలీజ్‌కు రెడీ అవుతోంది.

డేట్‌ ఫిక్స్‌ కాని చిత్రాలు
► వైష్ణవ్‌ తేజ్, శ్రీలీల జంటగా ఎన్‌. శ్రీకాంత్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆదికేశవ’. ఈ సినిమాను ఏప్రిల్‌ 29న రిలీజ్‌ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ ఓ సందర్భంలో వెల్లడించింది. అయితే జూలైలో విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది.

► అనుష్కా శెట్టి, నవీన్‌ పొలిశెట్టి లీడ్‌ రోల్స్‌లో నటించిన చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. పి. మహేశ్‌ బాబు దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ సమ్మర్‌లో రిలీజ్‌ చేస్తున్నట్లు యూనిట్‌ ప్రకటించింది. కానీ రిలీజ్‌ కాలేదు.

► ‘డీజే టిల్లు’కి సీక్వెల్‌గా సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘డీజే టిల్లు స్క్వైర్‌’ సెట్స్‌పై ఉంది. ఈ సినిమాను ఈ ఏడాది మార్చిలో రిలీజ్‌ చేస్తున్నట్లుగా యూనిట్‌ ప్రకటించింది. అయితే ఆగస్టు లేదా సెప్టెంబరులో రిలీజ్‌ అయ్యేందుకు రెడీ కానున్నట్లు టాక్‌. మల్లిక్‌రామ్‌ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌.  

► శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘సామజవరగమన’ ఈ నెల 18న రిలీజ్‌  కావాల్సింది. కానీ వాయిదా పడింది. రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించారు. రెబా మౌనిక హీరోయిన్‌గా ఈ సినిమాను అనిల్‌ సుంకర సమర్పణలో రాజేష్‌ దండా నిర్మించారు.

► తేజా సజ్జా, అమృతా అయ్యర్‌ జంటగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హను– మాన్‌’. ఈ సినిమాను మే 12న రిలీజ్‌ చేయాలను కున్నారు. కానీ వాయిదా పడింది. చైతన్య సమర్పణలో కె. నిరంజన్‌రెడ్డి నిర్మించిన చిత్రం ఇది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top