తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హిట్ అయిన కథలకు కొనసాగింపుగా పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4...
ఇలా పలు భాగాలుగా సినిమా తీయడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. మరికొందరు దర్శక–నిర్మాతలు హిట్ అయిన సినిమాని ఫ్రాంచైజీలుగా తెరకెక్కిస్తున్నారు. సీక్వెల్ మూవీస్‌పై అటు ప్రేక్షకుల్లో ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ ఫుల్ క్రేజ్ ఉంటోంది. దీంతో సీక్వెల్స్ చేయడానికి దర్శక–నిర్మాతలు, హీరోలు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఇప్పటికే పలు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరికొన్ని ప్రీ ప్రోడక్షన్‌లో ఉన్నాయి.
అయితే ఇక్కడ చర్చించదగ్గ మరో విషయం ఏంటంటే... కొన్ని హిట్ సినిమాల సీక్వెల్స్‌లో భాగంగా రెండో భాగం ఉంటుందని మేకర్స్ ప్రకటించినప్పటికీ షూటింగ్ పట్టాలెక్కలేదు. ఈ లిస్ట్‌లో ఎన్టీఆర్: దేవర 2, కల్యాణ్ రామ్: బింబిసార 2, కిరణ్ అబ్బవరం: క 2, తేజ సజ్జా: జాంబీ రెడ్డి 2, సాయిదుర్గా తేజ్ : విరూపాక్ష 2 వంటి విజయవంతమైన సినిమాలున్నాయి.
అయితే రామ్ హీరోగా నటించిన ‘స్కంద’, విరాట్ కర్ణ కథానాయకుడిగా నటించిన ‘పెదకాపు’ వంటి సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. అయినప్పటికీ ఈ చిత్రాల సీక్వెల్స్ ఉంటాయని యూనిట్ ప్రకటించినప్పటికీ ఆ తర్వాత వాటి ఊసే లేదు. మరి... పైన పేర్కొన్న సినిమాల సీక్వెల్స్ ఉన్నట్లా? లేనట్లా? అనే సందిగ్ధం సినీ ప్రేక్షకుల్లో నెలకొంది. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం...
ఎన్టీఆర్: దేవర
‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘దేవర’ పార్ట్ 1’. ఈ మూవీ ద్వారా దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అయిన సంగతి తెలిసిందే. సైఫ్ అలీఖాన్, ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, అజయ్, మురళీ శర్మ, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించారు.
‘దేవర: పార్ట్ 1’ 2024 సెప్టెంబరు 27న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి, సూపర్ హిట్‌గా నిలిచింది. హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. లాస్ ఏంజెల్స్‌లోని ఈజిప్షియన్ థియేటర్‌లో ప్రీమియర్ అయిన తొలి భారతీయ సినిమాగానూ ఈ మూవీ అరుదైన ఘనత సాధించింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘దేవర: పార్ట్ 2’ ఉంటుందని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘దేవర: పార్ట్ 1’ తర్వాత హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘వార్ 2’ సినిమా ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు ఎన్టీఆర్.
ఆ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీలో నటిస్తున్నారు. దీంతో ‘దేవర: పార్ట్ 2’ కోసం చాలా రోజులు వేచి చూసిన డైరెక్టర్ కొరటాల శివ తాజాగా బాలకృష్ణ హీరోగా ‘ఎన్‌బీకే 112’ సినిమాని ప్రకటించారు. ‘డ్రాగన్’ మూవీ తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. దీంతో ‘దేవర: పార్ట్ 2’ ఉంటుందా? లేదా అనే చర్చ జరుగుతోంది.
రామ్: స్కంద
రామ్ పోతినేని హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘స్కంద’. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. శ్రీకాంత్, దగ్గుబాటి రాజా, ప్రిన్స్, శరత్ లోహితశ్వ, అజయ్ పుర్కార్, గౌతమి, ఇంద్రజ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 2023 సెప్టెంబరు 28న విడుదల అయింది. ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేశారు.
పక్కా మాస్ యాక్షన్‌గా బోయపాటి మార్క్ నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాకి రెండో భాగం ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి విదితమే. అయితే ‘స్కంద’ విడుదలై దాదాపు మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఈ మూవీపై ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ గ్యాప్‌లో ‘డబుల్ ఇస్మార్ట్’, ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ వంటి సినిమాలు చేశారు రామ్. ఇక బోయపాటి శ్రీను కూడా బాలకృష్ణ హీరోగా ‘అఖండ 2’ సినిమాని తెరకెక్కించారు. మరి ‘స్కంద 2’ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా? లేదా అన్నది వేచి చూడాలి.
కల్యాణ్ రామ్: బింబిసార
నందమూరి కల్యాణ్ రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘బింబిసార’. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అన్నది ట్యాగ్ లైన్. ఈ మూవీ ద్వారా మల్లిడి వశిష్ఠ దర్శకుడిగా పరిచయమయ్యారు. సంయుక్త, కేథరిన్ హీరోయిన్లుగా, తనికెళ్ల భరణి, శ్రీనివాస రెడ్డి, ప్రకాష్‌రాజ్, అయ్యప్ప పి. శర్మ, భరత్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్ రామ్, హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా 2022 ఆగస్టు 5న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీకి వచ్చిన ప్రేక్షకాదరణతో ‘బింబిసార 2’ని ప్రకటించింది చిత్రబృందం.
అయితే ‘బింబిసార’ సినిమా విడుదలై నాలుగేళ్లు అవుతున్నా ‘బింబిసార 2’ పై ఎలాంటి అధికారిక అప్‌డేట్ లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘బింబిసార’ మూవీ తర్వాత ‘అమిగోస్, డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్, అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ వంటి సినిమాలు చేశారు కల్యాణ్ రామ్. ప్రస్తుతం వెంకటేశ్‌తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారాయన. ‘బింబిసార’ తర్వాత చిరంజీవి హీరోగా ‘విశ్వంభర’ చిత్రం తెరకెక్కించారు వశిష్ఠ. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారీ దర్శకుడు. అయితే ‘బింబిసార 2’కి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ ఇప్పటివరకూ రాలేదు. దీంతో ఈ మూవీపైనా ఇండస్ట్రీలో సందిగ్ధం నెలకొంది.
కిరణ్ అబ్బవరం: క
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన హిట్ చిత్రాల్లో ‘క’ మూవీ ఒకటి. దర్శక ద్వయం సుజీత్, సందీప్ ఈ మూవీ తెరకెక్కించారు. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో అన్నపూర్ణ, అజయ్, శరణ్య ప్రదీప్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టై¯Œ మెంట్స్, కేఏ ప్రోడక్షన్స్‌పై చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా 2024 అక్టోబరు 31న విడుదలై, ఘనవిజయం సాధించింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘క 2’ ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఆడియన్స్ ముందుకొచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ‘క 2’ పై ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ గ్యాప్‌లో ‘దిల్ రూబా, కె ర్యాంప్, చెన్నై లవ్‌స్టోరీ’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు కిరణ్ అబ్బవరం. మరి ‘క 2’ సినిమా ఉందా? లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
తేజ సజ్జా: జాంబీ రెడ్డి
బాలనటుడిగా పలు సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు తేజ సజ్జా. సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ‘ఓ బేబీ’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన తేజ సజ్జా ‘జాంబీ రెడ్డి’ మూవీ ద్వారా హీరోగా మారారు. ‘అ!’, ‘కల్కి’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ వర్మ రూపొందించిన ఈ సినిమాలో ఆనంది, దక్ష నగార్కర్, హరితేజ, రఘుబాబు, ఆర్జే హేమంత్, కిరీటి, జబర్దస్త్ శ్రీను, వినయ్ వర్మ, అన్నపూర్ణ, హర్షవర్ధన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. రాజశేఖర్ వర్మ నిర్మించిన ఈ మూవీ 2021 ఫిబ్రవరి 5న విడుదలైంది.
తెలుగులో తొలి జాంబీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్తగా అనిపించడంతో హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘జాంబీ రెడ్డి 2’ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు కూడా. అయితే ‘జాంబీ రెడ్డి’ రిలీజై ఐదున్నరేళ్లు దాటినప్పటికీ ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ గ్యాప్‌లో తేజ సజ్జా ‘ఇష్క్, అద్భుతం, హనుమాన్, మిరాయ్’ వంటి సినిమాలు చేశారు. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ‘హనుమాన్’కి సీక్వెల్‌గా రిషబ్ శెట్టితో ‘జై హనుమాన్’ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోనూ తేజ సజ్జా నటిస్తున్నారు. అదే విధంగా ‘మిరాయ్’ సినిమాకి సీక్వెల్‌గా ‘మిరాయ్: జైత్ర’ రూపొందుతుందని తేజ సజ్జా పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ‘జాంబీ రెడ్డి 2’ పై తాజా అప్‌డేట్ మాత్రం లేదు.
సాయిదుర్గా తేజ్ : విరూపాక్ష అప్‌డేట్ మాత్రం లేదు.
సాయిదుర్గా తేజ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీ ‘విరూపాక్ష’. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్‌గా నటించారు. బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్, సునీల్, రవి కృష్ణ, సోనియా సింగ్, అభినవ్ గోమటం, అజయ్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మించారు.
పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం 2023 ఏప్రిల్ 21న విడుదలై ఘనవిజయం సాధించింది. సాయిదుర్గా తేజ్ కెరీర్‌లో వంద కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా ఈ మూవీ రికార్డు సాధించింది. ఈ మూవీ రిలీజై మూడేళ్లు దాటినప్పటికీ ‘విరూపాక్ష’ సీక్వెల్‌పై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు మేకర్స్. ఈ గ్యాప్‌లో ‘బ్రో, సంబరాల యేటిగట్టు’ వంటి సినిమాలు చేశారు సాయిదుర్గా తేజ్. ‘సంబరాల యేటిగట్టు’ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో ఉంది. ఈ మూవీ విడుదల తర్వాత అయినా ‘విరూపాక్ష’ అప్‌డేట్ వస్తుందా? లేదా అన్నది వేచి చూడాలి.
విరాట్ కర్ణ: పెదకాపు
విరాట్ కర్ణ హీరోగా పరిచయమైన చిత్రం ‘పెదకాపు 1’. ‘కొత్త బంగారు లోకం’ మూవీ ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్. రావు రమేశ్, తనికెళ్ల భరణి, అనసూయ భరద్వాజ్, బ్రిగడ సాగా, వికాస్, రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్ర పోషించడం విశేషం.
మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2023 సెప్టెంబరు 29న విడుదలైంది. 1983 నేపథ్యంలో ఉన్న కుల వివక్ష నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘పెదకాపు 2’ ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మూవీ రిలీజై మూడేళ్లు కావస్తున్నప్పటికీ ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఈ గ్యాప్‌లో విరాట్ కర్ణ ‘నాగబంధం’ వంటి పాన్ ఇండియన్ మూవీ చేశారు. ఈ చిత్రానికి కూడా సీక్వెల్ ఉంటుందని చిత్ర దర్శకుడు అభిషేక్ నామా ప్రకటించారు. మరి ‘పెదకాపు 2’ ఉంటుందా? లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
పైన పేర్కొన్న సినిమాలే కాదు... ‘మంగళవారం’ మూవీతో పాటు మరికొన్ని చిత్రాల సీక్వెల్స్ కూడా ప్రకటించినప్పటికీ సెట్స్‌పైకి వెళ్లలేదు.
– డేరంగుల జగన్ మోహన్


