
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష (Bigg Boss Agnipariksha)కు వేలాదిమంది అప్లై చేశారు. వారిలో ట్రాన్స్‌జెండర్ అంకితనాయుడు ఒకరు. పలు రౌండ్లలో ముందుకు వెళ్లిన ఆమె అగ్నిపరీక్ష స్టేజీపై మాత్రం కనిపించలేదు. అందుకు గల కారణాన్ని, తన జర్నీని తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. అంకిత నాయుడు మాట్లాడుతూ.. చిన్నప్పుడు ఇంట్లో ఎవరూ లేనప్పుడు చీరకట్టుకుని, బొట్టు పెట్టుకుని గాజులు వేసుకునేదాన్ని.
అక్కల పెళ్లయ్యాకే..
18 ఏళ్ల వయసు వచ్చేసరికి నేను అమ్మాయిలా మారాలని నిర్ణయించుకున్నాను. ఇద్దరు అక్కల పెళ్లయ్యే వరకు ఆగి ఆ తర్వాతే అమ్మాయిగా మారాను. ఈ మధ్య నాకు బిగ్‌బాస్ షోలో ఛాన్స్ వచ్చింది. బిగ్‌బాస్ షో చాలా పెద్ద ప్లాట్‌ఫామ్. అలాంటి ప్లాట్‌ఫామ్‌కు నేను సెలక్ట్ అయ్యానని తెలిసి సంతోషపడ్డాను. నాకు మొదటి నుంచీ ఈ షో అంటే ఇష్టం!
భిక్షాటన చేశా.. తర్వాత..
అయితే గతంలో నేను భిక్షాటన చేశాను, వేశ్యగా మారాను, షాప్ ఓపెనింగ్స్‌కు వెళ్లాను. ఇవన్నీ దాటుకుని వచ్చాను. ఇప్పుడు బిగ్‌బాస్‌లో ఛాన్స్ వస్తే అక్కడ నన్ను నేను నిరూపించుకోవచ్చనుకున్నాను. నేను వెళ్లి నా కమ్యూనిటీకి ఆదర్శంగా నిలవాలనుకున్నాను. గతంలో బిగ్‌బాస్ (Bigg Boss Reality Show)కు వెళ్లిన ప్రియాంక సింగ్.. చాలామందికి డ్రీమ్‌గర్ల్ అయిపోయారు. తను నాకు రోల్‌మోడల్.
స్టేజీపైకి వెళ్లకుండానే..
ఈ సీజన్‌లో నాకు ఆఫర్ వచ్చింది. కానీ, నా కమ్యూనిటీ వాళ్లు నన్ను వెనక్కు లాగేశారు. అగ్నిపరీక్ష షోలో శ్రీముఖి నన్ను స్టేజీపైకి రమ్మని ఆహ్వానించింది. ఓ పాట కూడా ప్లే చేశారు. ఇంతలో వెళ్లకుండానే ఆపేశారు. మా కమ్యూనిటీ వాళ్లు.. బిగ్‌బాస్ టీమ్‌కు నేను వేశ్యగా పనిచేసినప్పటి వీడియోలు పంపారు. దాంతో వాళ్లు నన్ను తీసుకోవడానికి ఇష్టపడలేదు. దీనివల్ల మీకే కాదు, షోకి సైతం నెగెటివిటీ వస్తుందన్నారు. వాళ్ల ఆలోచనప్రకారం వాళ్లు కరెక్టే!
ఎప్పుడో జరిగినదాన్ని..
మా కమ్యూనిటీ వాళ్లే ఇలా చేయడం నాకు నచ్చలేదు. ఎప్పుడో జరిగినదాన్ని ఇప్పుడు తీసి చూపించడం నచ్చలేదు. మా వర్గాన్ని ముందుకు తీసుకెళ్తాం అని బీరాలు పలికే లీడర్స్.. నేను సెలక్ట్ అయితే ఎందుకు జీర్ణించుకోలేకపోయారు? పైగా అదే లీడర్ అక్కడ సెలక్ట్ అయ్యారన్న ప్రచారం జరిగింది. కానీ, ఆమె ఎంపికవలేదు. మా వాళ్లు నన్ను నెగిటివ్ చేసి ఇంకెప్పుడూ బిగ్‌బాస్‌కు వెళ్లకుండా చేశారు అని అంకిత నాయుడు చెప్పుకొచ్చింది.
చదవండి: సీక్రెట్‌గా వీడియో షూట్.. కోపంతో ఊగిపోయిన దీపికా పదుకొణె