
‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’కి స్టాండింగ్ ఒవేషన్
ఫ్రెంచ్ నటుడు థియో నవర్రోపై నిషేధం
ఫ్రాన్స్‌లో 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జోరుగా సాగుతోంది. రెడ్ కార్పెట్‌పై అందాల తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈ నెల 13న ప్రారంభమైన ఈ చిత్రోత్సవాలు ఈ నెల 24 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రోత్సవాల రెండో రోజున హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ సందడి హైలైట్‌గా నిలిచింది. ‘టాప్‌గన్: మేవరిక్’ సినిమా ప్రీమియర్ కోసం 2022లో జరిగిన 75వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు టామ్ క్రూజ్.
మళ్లీ మూడేళ్ల తర్వాత 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ ప్రీమియర్ సందర్భంగా టామ్ క్రూజ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సినిమా దర్శకుడు క్రిస్టోఫర్ మెక్‌క్వారీ, ఇతర నటీనటులు సందడి చేశారు. ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ ప్రీమియర్‌కు వీక్షకుల నుంచి ఐదు నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ దక్కింది.
‘‘ముప్పై సంవత్సరాలుగా ‘మిషన్ ఇంపాజిబుల్’ ఫ్రాంచైజీతో మిమ్మల్ని (ప్రేక్షకులను ఉద్దేశించి) ఎంటర్‌టైనర్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. కాన్స్‌లాంటి ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో పాల్గొంటానని, నా లైఫ్‌లో ఇలాంటి సెలబ్రేషన్స్ ఉంటాయని నా చిన్నతనంలో నేను ఊహించలేదు. సుధీర్ఘకాలంగా ఇండస్ట్రీలో ఉన్న నేను ఈ సినిమాకు ఓ నిర్మాతగా ఉండటం సంతోషాన్నిచ్చింది’’ అని టామ్ క్రూజ్ చె΄్పారు. ఇక ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ ఇండియాలో ఈ నెల 17న తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదల కానుంది. విదేశాల్లో మే 23న విడుదలవుతుంది.
ఫ్రెంచ్ యాక్టర్‌పై నిషేధం... ఫ్రెంచ్ క్రైమ్ డ్రామా ఫిల్మ్ ‘డోస్సిసిర్ 137’ను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఈ చిత్రదర్శకుడు డొమినిక్ మోల్, ప్రధాన తారాగణం లియోడ్రక్కర్, జోనాథన్ టర్న్‌బుల్ తదితరులు రెడ్ కార్పెట్‌పై నడిచారు. అయితే సపోర్టింగ్ రోల్ చేసిన థియో నవర్రో ముస్సీ కనిపించలేదు. లైంగిక వేధింపుల కారణంగా థియో నవర్రోపై కాన్స్ నిర్వాహకులు నిషేధం విధించారని వార్తలు ఉన్నాయి.