ఉత్తరాంధ్రపై టాలీవుడ్‌ స్టార్స్‌ ఫోకస్‌ | Sakshi
Sakshi News home page

మొన్నటిదాక తెలంగాణ..ఇప్పుడు ఉత్తరాంధ్ర.. ‘యాస’పై స్టార్స్‌ ఫోకస్‌

Published Sat, Feb 24 2024 12:32 PM

Tollywood Upcoming Movies Based On Uttarandhra Slang - Sakshi

టాలీవుడ్‌లో ఒకప్పుడు రాయలసీమ నేపథ్యంగా సాగే సినిమాలు ఎక్కువ వచ్చేవి. హీరోలు కూడా రాయలసీమ యాసలోనే మాట్లాడేవాళ్లు. ఆ తర్వాత తెలంగాణ నేపథ్య కథలు వెండితెరపై సందడి చేశాయి. కేవలం విలన్లకు, కమెడియన్లకు మాత్రమే వాడే తెలంగాణ యాసను.. హీరో పాత్రతో మాట్లాడించి హిట్‌ కొట్టారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్‌ హీరోలతో పాటు నాని, వరుణ్‌ తేజ్‌, రామ్‌ పోతినేని, నాగచైతన్య లాంటి యంగ్‌ స్టార్స్‌ సైతం తెలంగాణ యాసలో డైలాగ్స్‌ చెప్పి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్‌ స్టార్స్‌ అంతా ఉత్తరాంధ్ర బాషపై  మక్కువ చూపుతున్నారు. టాలీవుడ్‌లో ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం. 

ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్‌ డ్రామా
మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం కథ ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగుతుంది. ఓ ఆటను ప్రధానంగా చేసుకొని బలమైన భావోద్వేగాలతో ఈ సినిమాను తీర్చిదిద్దబోతున్నాడట బుచ్చిబాబు. ఇందులో హీరోతో పాటు అన్ని మిగతా పాత్రధారులంతా ఉత్తరాంధ్ర యాసలోనే మాట్లాడతారట. ఉత్తరాంధ్ర యాసను అనర్గళంగా మాట్లాడే నటీనటులను వెతికే పనిలో మేకర్స్‌ బిజీగా ఉన్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర యాస కోసం రామ్‌ చరణ్‌ శిక్షణ తీసుకుంటున్నారట. ఈ మూవీలో ఆయన లుక్‌ చాలా రస్టిక్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

ఉత్తరాంధ్ర జాలరి ప్రేమ కథ
నాగచైతన్య, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం తండేల్‌. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇది ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రం. ఇందులో హీరోహీరోయిన్లు ఇద్దరు ఉత్తరాంధ్ర యాసలోనే మాట్లాడతారు.ఇటీవలే వచ్చిన గ్లింప్స్‌లో  నాగచైతన్య ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్‌ అందర్నీ ఆకట్టుకుంది.

‘మట్కా’ఆడనున్న వరుణ్‌ తేజ్‌
మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పలాస ఫేం కరుణ కుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘మట్కా’.  పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పూర్తిగా ఉత్తరాంధ్ర నేపథ్యంలోనే సాగనుంది. మట్కా అనేది ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఆడే ఒక జూదం.1958-1982 మధ్య దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని నిజ సంఘటనల ఆధారంగా మట్కా స్టోరీ రాసుకున్నాడు కరుణ కుమార్‌. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా స్టోరీ సాగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో వరుణ్‌ నాలుగు భిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నారు.  

 ఉత్తరాంధ్ర యాసలో అనుష్క మాటలు
అనుష్క, క్రిష్‌ జాగర్లమూడి కాంబినేషన్‌లో ఓ లేడి ఓరియెంటెండ్‌ ఫిల్మ్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ‘వేదం’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రెండో చిత్రమిది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఓ ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు జరిగిన అన్యాయంపై  ఓ యువతి ఎలాంటి పోరాటం చేసిందనే పాయింట్‌తో ఈ కథను రాసుకున్నాడట క్రిష్‌. ఇందులో అనుష్క ఉత్తరాంధ్రకు చెందిన యువతిగా కనిపించబోతున్నారట. ఇవి మాత్రమే కాదు.. తెలుగులో మరిన్ని చిత్రాలు ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్నాయి. 

- పోడూరి నాగ ఆంజనేయులు

Advertisement
 
Advertisement
 
Advertisement