
టాలీవుడ్ నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులంతా కలిసి ప్రస్తుతం టాలీవుడ్లో తలెత్తిన సమస్యను ఆయనకు వివరించారు. ఫిల్మ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రతినిధులంతా కలిసి షూటింగ్స్ ఆకస్మాత్తుగా ఆపడం సరికాదని చిరుకు వివరించారు. నిర్మాతల వర్షన్ విన్న మెగాస్టార్.. సినీ కార్మికుల ఫెడరేషన్ వాదనలు కూడా తెలుసుకుని మాట్లాడాతానని చెప్పారని నిర్మాత సి కళ్యాణ్ అన్నారు. ఈ సమావేశంలో యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులైన అల్లు అరవింద్, సుప్రియ యార్లగడ్డ, మైత్రీ రవి, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, కె.ఎల్. నారాయణ పాల్గొన్నారు.
నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ..' నిర్మాతలం అందరం చిరంజీవిని కలిసి మా సమస్యను వివరించాం. ఫిల్మ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రతినిధులంతా కలిసి షూటింగ్స్ సడన్గా ఆపడం భావ్యం కాదని చెప్పాం. అటు వైపు కార్మికుల వర్షన్ కూడా తెలుసుకుంటానని చిరంజీవి మాతో చెప్పారు. రెండు, మూడు రోజులు చూస్తాను. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోతే నేను జోక్యం చేసుకుంటానని చిరంజీవి హామీ ఇచ్చారు.' అని అన్నారు.
కాగా.. తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్-2022లో చివరిసారిగా వేతనాలు సవరించారు. మూడేళ్ల వ్యవధిలో 30 శాతం వేతన పెంపు ఒప్పందం ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే ప్రస్తుతం సినీ పరిశ్రమ ఆర్థిక నష్టాల్లో నడుస్తున్న నేపథ్యంలో నిర్మాతలు.. ఈ పెంపును అంగీకరించడానికి నిరాకరించారు. దీంతో టాలీవుడ్‌లో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.