
టాలీవుడ్ దర్శక,నిర్మాత సత్యారెడ్డి హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.ప్రపంచ శాంతి సందేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో 'కింగ్ బుద్ధ' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా పోస్టర్ లాంచ్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గ్రాండ్‌గా జరిగింది.
ఈ ఈవెంట్‌కు మూడుసార్లు కెడర్ పార్క్ మేయర్‌గా పనిచేసిన మ్యాట్ పోవెల్ చీఫ్ గెస్ట్‌గా హాజరై, 'కింగ్ బుద్ధ' పోస్టర్‌ను అధికారికంగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.., ‘గౌతమ బుద్ధుడు ప్రపంచ శాంతి కోసం అమితమైన కృషి చేశారు. ఒక టాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి ఈ సినిమాను టాలీవుడ్ లేదా బాలీవుడ్‌లో తీసి హాలీవుడ్‌లో డబ్బింగ్ చేయకుండా, డైరెక్ట్‌గా హాలీవుడ్‌లోనే నిర్మించడం చాలా సంతోషకరం. తెలుగు సంతతికి చెందిన వ్యక్తిగా భారీ బడ్జెట్‌తో హాలీవుడ్‌లో సినిమా తీస్తున్న సత్యారెడ్డి చరిత్రలో నిలిచిపోతారు" అని పేర్కొన్నారు.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన శైలర్ మాట్లాడుతూ.. గతంలో సత్యారెడ్డి దర్శకత్వం వహించిన 'ఉక్కు సత్యాగ్రహం' సినిమాలో గద్దర్ నటించారు. షూటింగ్ సమయంలో గద్దర్ బుద్దుడి శాంతి ప్రవచనాలు చూసి ఆకర్షితులైనట్లు పేర్కొన్నారు. ఆ సినిమాను చూసినప్పుడే సత్యారెడ్డి డైరెక్షన్‌లో ప్రపంచ శాంతి కోసం అంతర్జాతీయ స్థాయిలో 'కింగ్ బుద్ధ'ను పూర్తిస్థాయిలో హాలీవుడ్‌లో నిర్మించాలని నిర్ణయించుకున్నాము. డైరెక్టర్ సత్యారెడ్డి చెప్పిన స్టోరీతో ఇప్పుడు ఆ కల నెరవేరబోతోంది అన్నారు
నటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా, రచయితగా, గాయకుడుగా 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న నేను, ప్రపంచ శాంతి కోసం 'కింగ్ బుద్ధ' కాన్సెప్ట్‌ను నా నిర్మాతలకు చెప్పగానే వారు భారీ బడ్జెట్‌తో హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులతో ఈ చిత్రాన్ని నిర్మించడానికి అంగీకరించి, పూర్తి స్వేచ్ఛ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అతి త్వరలో ఇండియాలోని ఒక ప్రముఖ బౌద్ధారామంలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తాం’ అని సత్యారెడ్డి అన్నారు.