Drugs Case: ఈడీ ముందుకు సినీ ప్రముఖులు

Tollywood Celebrities May Attend Ed Investigation From Today - Sakshi

డ్రగ్స్‌ కేసులో నేడు విచారణకు హాజరుకానున్న పూరి జగన్నాథ్

సాక్షి, హైదరాబాద్‌: మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మంగళవారం నుంచి సినీ ప్రముఖులను విచారించనుంది. పూరి జగన్నాథ్, ఛార్మి, రకుల్‌ప్రీత్‌ సింగ్, రాణా దగ్గుబాటి, రవితేజ సహా మొత్తం 12 మంది ఈడీ ముందు హాజరుకానున్నారు. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్‌ 22వ తేదీ వరకు విచారణ కొనసాగనుంది. దర్శకుడు పూరి జగన్నాథ్‌ తొలిరోజు విచారణకు హాజరుకానున్నారు. పూరి సహా అందరికీ ఇప్పటికే నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే. 2017లో ప్రభుత్వం నియమిం చిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారి శ్రీనివాస్‌ వద్ద.. గతంలో జరిగిన దర్యాప్తు వివరాలను, ఆ సందర్భంగా వెలుగు చూసిన సమాచారాన్ని ఈడీ అధికారులు సేకరించారు. పలువురు సినీ ప్రముఖులకు మాదక ద్రవ్యాలు సరఫరా చేసినట్టుగా అనుమానిస్తున్న కెల్విన్, కమింగాలను ఇంతకుముందే విచారిం చిన ఈడీ.. వారి స్టేట్‌మెంట్‌లను రికార్డు చేసుకుంది. వాటి ఆధారంగానే ఇప్పుడు సినీ ప్రముఖులను విచారించనుంది. కెల్విన్‌ మైక్‌ కమింగాలను 2017లో  ఎక్సైజ్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు.

 ఆస్తుల జప్తు .. ఫెమా చట్టం కింద కేసులు!
డ్రగ్స్‌ వ్యవహారంలో మనీలాండరింగ్‌ సైతం జరిగిందన్న ఆధారాలతో లబ్ధిదారుల అస్తులను జప్తు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం సెక్షన్‌ 3, 4 కింద ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఈసీఐఆర్‌) కోర్టులో దాఖలు అయ్యింది. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేసుల ఆధారంగా విదేశీ అక్రమ లావాదేవీల గుట్టు విప్పే పనిలో ఈడీ ఉంది. తాజా విచారణలో అక్రమాలు నిజమేనని తేలితే ఫెమా చట్టం కింద కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో నిందితులకు అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాలతో ఉన్న సంబంధాలపై ఈడీ దృష్టి సారించనుంది. అమెరికా, ఆస్ట్రియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఉన్న డ్రగ్స్‌ ముఠాల బ్యాంక్‌ ఖాతాల వివరాలను సేకరించేందుకు ఇంటర్‌పోల్‌ సహకారం తీసుకోనుంది. ప్రస్తుతం నోటీసులు జారీ చేసిన సినీ ప్రముఖుల్నే కాకుండా గతంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారించిన 62 మందిలో మరికొందరిని కూడా ఈడీ విచారించే అవకాశం ఉంది. 

ఈడీ విచారణకు హాజరుకానున్న ప్రముఖులు, విచారణ తేదీ
1.పూరి జగన్నాథ్‌ – ఆగస్టు 31
2.ఛార్మి – సెప్టెంబర్‌ 2
3.రకుల్‌ప్రీత్‌ సింగ్‌ – సెప్టెంబర్‌ 6
4.రాణా దగ్గుబాటి – సెప్టెంబర్‌ 8
5.రవితేజ – సెప్టెంబర్‌ 9
6.శ్రీనివాస్‌ – సెప్టెంబర్‌ 9
7.నవదీప్‌ – సెప్టెంబర్‌ 13
8 ఎఫ్‌ క్లబ్‌ జీఎం – సెప్టెంబర్‌ 13 
9.ముమైత్‌ ఖాన్‌ – సెప్టెంబర్‌ 15
10.తనీష్‌ – సెప్టెంబర్‌ 17
11.నందు – సెప్టెంబర్‌ 20
12.తరుణ్‌ – సెప్టెంబర్‌ 22  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top