
‘ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్...’ (మురళీ శర్మ), ‘ఇవ్వలా... వచ్చింది...’ (అల్లు అర్జున్) అనే డైలాగులు ‘అల వైకుంఠపురములో...’ సినిమాలో బాగా పాపులర్ అయ్యాయి. కొందరు కథానాయికల కెరీర్ విషయంలో ఈ డైలాగులు కరెక్టుగా సరి పోయాయనిపిస్తోంది. తెలుగులో ఒకప్పుడు వరుస సినిమాలు, ఫుల్ క్రేజ్‌తో బిజీ బిజీగా దూసుకెళ్లిన పలువురు హీరోయిన్లకు ప్రస్తుతం టాలీవుడ్‌లో గ్యాప్ వచ్చింది. అయితే ఆ గ్యాప్ కావాలని ఇచ్చింది కాదు... ఇతర భాషల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, ఇక్కడ సరైన కథ, పాత్ర కుదరక పోవడం కూడా ఈ గ్యాప్‌కి కారణం అని చె పొ్పచ్చు. తమ అభిమాన హీరోయిన్ల సినిమా ఎప్పుడొస్తుందా అని టాలీవుడ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తెలుగులో గ్యాప్ వచ్చిన కథానాయికలెవరో ఓ లుక్కేద్దాం.
పచ్చజెండా ఊపుతారా?
తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు రెండు దశాబ్దాల ప్రయాణం కాజల్ అగర్వాల్‌ది. తేజ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమయ్యారామె. 2007 ఫిబ్రవరి 15న ఈ సినిమా విడుదలైంది. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘చందమామ’ చిత్రంలో నటించారు కాజల్. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో కాజల్‌కి వరుస అవకాశాలు వచ్చాయి.
‘ఆర్య 2, మగధీర, గోవిందుడు అందరివాడేలే, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, బిజినెస్ మేన్, బ్రహ్మోత్సవం, బృందావనం, టెంపర్, బాద్ షా, వీర, నేనే రాజు నేనే మంత్రి, సీత, ఖైదీ నంబర్ 150, భగవంత్ కేసరి’... ఇలా తెలుగులో వరుసగా సినిమాలు చేశారు కాజల్. స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీకి తెలుగులో గ్యాప్ వస్తోంది. ‘భగవంత్ కేసరి’ సినిమా తర్వాత ఆమె లీడ్ రోల్‌లో నటించిన లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘సత్యభామ’ 2024 జూన్ 7న విడుదలైంది.
ఆ చిత్రం తర్వాత తెలుగులో అటు హీరోయిన్‌గా కానీ ఇటు లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ కానీ చేయలేదు కాజల్. అయితే మంచు విష్ణు హీరోగా రూ పొందిన ‘కన్నప్ప’ చిత్రంలో పార్వతీ దేవి పాత్రలో కనిపించారామె. జూన్ 27న ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆమె చేతిలో ఏ సినిమా లేనప్పటికీ తమిళ్, హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరి... టాలీవుడ్‌కి ఆమె పచ్చజెండా ఊపుతారా? వేచి చూడాలి.
కొత్త కబురు ఎప్పుడు?
ఓ వైపు హీరోయిన్‌గా, మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా దూసుకెళుతున్నారు తమన్నా. అంతేకాదు... ప్రత్యేక పాటల్లోనూ సందడి చేసి, అభిమానులను అలరిస్తుంటారామె. తెలుగులో ఆమె లీడ్ రోల్‌లో నటించిన ‘ఓదెల 2’ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 17న విడుదలైంది. ఆ సినిమా విడుదలై దాదాపు ఆర్నెల్లు కావస్తున్నా ఆమె మరో తెలుగు చిత్రానికి పచ్చజెండా ఊపలేదు. ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళ్లిన ఈ బ్యూటీకి ప్రస్తుతం మాత్రం గ్యాప్ వస్తోంది.
ఆ మాటకొస్తే చిరంజీవి హీరోగా నటించిన ‘భోళా శంకర్’ (2023) చిత్రం తర్వాత ఆమె నటించిన ఒకే ఒక్క తెలుగు చిత్రం ‘ఓదెల 2’. అంటే... ఈ రెండేళ్లలో ఆమె కేవలం రెండు తెలుగు సినిమాల్లో మాత్రమే నటించారు. ఈ మిల్కీ బ్యూటీకి టాలీవుడ్‌లో గ్యాప్ వస్తున్నప్పటికీ బాలీవుడ్‌లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ‘రోమియో, రేంజర్, వి వన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ సినిమాలతో పాటు రోహిత్ శెట్టి చిత్రంలో నటిస్తున్నారు.
ఈ నాలుగు సినిమాల్లో ‘వి వన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారామె. అరుణభ్ కుమార్, దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా కీలక పాత్ర పోషిస్తున్నారు. మైథలాజికల్ హారర్, థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని బాలాజీ మోషన్ పిక్చర్స్, ది వైరల్ ఫీవర్ మోషన్ పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా 2026 మే 15న విడుదల కానుంది. మరి... తమన్నా తెలుగుకి సంబంధించి కొత్త కబురు ఎప్పుడు వినిపిస్తారు? అన్నది వేచి చూడాలి.
రెండేళ్లు దాటినా...
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు సమంత. పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, నాగచైతన్య, నాని, నితిన్, విజయ్ దేవరకొండ... ఇలా పలువురు హీరోలకి జోడీగా నటించారామె. అంతేకాదు.. తెలుగులో ‘యశోద, శాకుంతలం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా నటించిన ‘ఖుషి’ (2023) చిత్రం తర్వాత సమంత మరో తెలుగు చిత్రంలో నటించలేదు. కాగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌ని స్థాపించి, సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’.
ఈ ఏడాది మే 9న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాధించి, నిర్మాతగా సమంతకు మంచి పేరు, లాభాలు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో ఆమె అతిథి పాత్రలో కనిపించారు. ఇక ‘ఖుషి’ సినిమా 2023 సెప్టెంబరు 1న విడుదలై, హిట్‌గా నిలిచింది. ఈ మూవీ రిలీజై రెండేళ్లు దాటి పోయినా ఇప్పటికీ తెలుగులో మరో సినిమాకి పచ్చజెండా ఊపలేదు సమంత.
అయితే తన సొంత ్ర పొడక్షన్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించనున్న ‘మా ఇంటి బంగారం’ అనే లేడీ ఓరియంటెండ్ మూవీలో నటించనున్నట్లు ప్రకటించారు సమంత. అంతేకాదు... తన బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమా గురించి ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఇదిలా ఉంటే... సమంత ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ అనే హిందీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.
నో అప్‌డేట్
టాలీవుడ్‌లో శ్రుతీహాసన్‌ది దాదాపు పదిహేనేళ్ల ప్రయాణం. దర్శకుడు కె. రాఘవేంద్ర రావు తనయుడు కె. ప్రకాశ్ తెరకెక్కించిన చిత్రం ‘అనగనగా ఒక ధీరుడు’ ద్వారా తెలుగుకి పరిచయం అయ్యారు శ్రుతీహాసన్. 2011 జనవరి 14న విడుదలైంది ఈ చిత్రం. ఆ తర్వాత ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాలో నటించారు శ్రుతి. అయితే ఈ రెండు సినిమాలు పరాజయం కావడంతో ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది.
ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించడంతో ఐరన్ లెగ్ అన్నవాళ్లే గోల్డెన్ లెగ్ అన్నారు. ‘బలుపు, రామయ్యా వస్తావయ్యా, ఎవడు, రేసుగుర్రం, ఆగడు, శ్రీమంతుడు, ప్రేమమ్, కాటమరాయుడు, క్రాక్, వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ పార్ట్ 1: సీజ్‌ఫైర్’ వంటి సినిమాల్లో నటించి, ప్రేక్షకుల మెప్పు పొందారు శ్రుతీహాసన్. ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్ పార్ట్ 1: సీజ్‌ఫైర్’ చిత్రం 2023 డిసెంబరు 22న విడుదలైంది.
ఆ సినిమా హిట్ అయినప్పటికీ ఆ తర్వాత శ్రుతీహాసన్ నటించనున్న మరో తెలుగు చిత్రంపై ఇప్పటికీ ఎలాంటి అప్‌డేట్ లేదు. ‘సలార్’ విడుదలై దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఆమె నుంచి మరో తెలుగు సినిమా అనౌన్స్‌మెంట్ లేదు. అయితే ‘సలార్ పార్ట్ 1: సీజ్‌ఫైర్’కి సీక్వెల్‌గా రూ పొందనున్న ‘సలార్ పార్ట్ 2: శౌర్యాంగపర్వం’లో ఆమె పాత్ర ఉంటుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలుగులో సినిమాలేవీ లేకున్నప్పటికీ తమిళ చిత్రాలు చేస్తున్నారు శ్రుతి. మరి... ఆమె నుంచి టాలీవుడ్‌లో కొత్త చిత్రం అప్‌డేట్ ఎప్పుడొస్తుందో చూడాలి.
మూడేళ్లు అయినప్పటికీ...
తెలుగు చిత్ర పరిశ్రమలో ‘అలా మొదలైంది’ చిత్రంతో ఆరంభమైంది మలయాళ కుట్టి నిత్యామీనన్ కెరీర్. నాని హీరోగా నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ‘అలా మొదలైంది’ చిత్రం 2011 జనవరి 21న విడుదలై, ఘన విజయం సాధించింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నిత్య. ఆ తర్వాత తెలుగు–తమిళ ద్విభాషా చిత్రం ‘180’లో నటించారామె. అనంతరం పలు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తెలుగులో నితిన్ హీరోగా నటించిన ‘ఇష్క్’ మూవీలో నటించి, మరో హిట్ అందుకున్నారు.
ఆ తర్వాత ‘ఒక్కడినే, జబర్‌దస్త్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, ఒక్క అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్, భీమ్లా నాయక్’ వంటి తెలుగు సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారామె. అయితే ‘భీమ్లా నాయక్’ చిత్రం రిలీజై మూడేళ్లు దాటి పోయినప్పటికీ మరో తెలుగు చిత్రంలో నటించలేదు నిత్య. ఆ సినిమా తర్వాత వరుసగా మలయాళ, తమిళ చిత్రాలకే పరిమితం అయ్యారామె. విజయ్ సేతుపతి–నిత్యామీనన్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘తలైవన్ తలైవి’. ఈ చిత్రం తెలుగులో ‘సార్.. మేడమ్’ పేరుతో విడుదలైంది.
ఈ మూవీ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన నిత్య తెలుగులో గ్యాప్ రావడంపై స్పందిస్తూ.. ‘‘తెలుగు ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమ, అభిమానం మరచి పోలేను. తెలుగులో నేను కావాలని గ్యాప్ ఇవ్వలేదు... వచ్చిందంతే. సరైన కథ, పాత్ర కుదిరితే నటించడానికి ఎప్పుడూ సిద్ధమే’’ అన్నారు. మరి రచయితలు, దర్శకులు ఆమెను దృష్టిలో పెట్టుకుని సరైన పాత్రలు రాస్తారేమో చూడాలి. ఏది ఏమైనప్పటికీ నిత్యామీనన్ తెలుగులో నటించే కొత్త సినిమా ప్రకటన కోసం వేచి చూడక తప్పదు.
రెండేళ్లయినా....
టాలీవుడ్‌కి కెరటంలా దూసుకొచ్చారు రకుల్ ప్రీత్‌సింగ్. 2011 ఆగస్టు 26న విడుదలైన ‘కెరటం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు రకుల్. ఆ చిత్రం తర్వాత తెలుగులో రెండేళ్లు గ్యాప్ వచ్చింది ఆమెకి. ఈ గ్యాప్‌లో తమిళంలో మూడు సినిమాలు చేసిన ఈ బ్యూటీ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో తిరిగి టాలీవుడ్‌కి వచ్చారు. సందీప్ కిషన్ హీరోగా మేర్ల పాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2013 నవంబరు 29న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు సొంతం చేసుకున్నారీ బ్యూటీ.
‘లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, కిక్ 2, బ్రూస్‌లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయకి, స్పైడర్, మన్మథుడు 2, చెక్, కొండ పొలం, బూ’ వంటి సినిమాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారు రకుల్. ‘బూ’ చిత్రం 2023 మే 27న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ చిత్రం విడుదలై రెండేళ్లు దాటి పోయినప్పటికీ ఆమె నటించనున్న మరో తెలుగు సినిమాపై ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన లేదు. తెలుగులో రకుల్‌కి గ్యాప్ వచ్చినప్పటికీ తమిళ, హిందీ సినిమాలు చేస్తున్నారు. మరి... రకుల్ ప్రీత్‌సింగ్ తెలుగులో కొత్త సినిమా ప్రకటన ఎప్పుడు? అంటే కాలమే సమాధానం చె΄్పాలి.
గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
‘అమ్మాయిలు కాదు... అమ్మాయి... భానుమతి... ఒక్కటే పీస్... రెండు కులాలు... రెండు మతాలు... హైబ్రీడ్ పిల్ల’ అంటూ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేశారు సాయిపల్లవి. వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘ఫిదా’ సినిమాతో తెలుగుకి హీరోయిన్‌గా పరిచయం అయ్యారామె. తొలి చిత్రంతోనే తనదైన నటన, డ్యాన్సులతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత ‘మిడిల్ క్లాస్ అబ్బాయ్, పడి పడి లేచె మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం, తండేల్’ వంటి సినిమాల్లో నటించి, ఆడియన్స్‌ని అలరించారు.
నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వం వహించిన చిత్రం ‘తండేల్’. ఈ ఏడాది ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రత్యేకించి సాయిపల్లవి, నాగచైతన్య నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సాధారణంగా ఓ సినిమా హిట్ అయిందంటే హీరో, హీరోయిన్లకు, డైరెక్టర్స్‌కి వరుస అవకాశాలు వస్తుంటాయి. ‘తండేల్’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత తెలుగులో మరో కొత్త సినిమా ఏదీ అంగీకరించలేదు సాయిపల్లవి.
అయితే తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో నటించిన ఆమె ‘మేరే రాహో’ అనే చిత్రం ద్వారా తొలిసారి హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. అలాగే రణ్‌బీర్ కపూర్ రాముడిగా రూ పొందుతోన్న ‘రామాయణ : పార్ట్ 1, పార్ట్ 2’ సినిమాల్లో సీతగా నటిస్తున్నారు. ఈ సినిమాలు ఎంతో ప్రతిష్ఠాత్మకమైనవి కావడంతో ప్రస్తుతం పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితం అయ్యారామె. మరి... సాయిపల్లవి తెలుగులో కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? వెయిట్ అండ్ సీ.
ఏడాది దాటి పోయినా...
తెలుగు ప్రేక్షకుల మనసుల్లో బేబమ్మగా అభిమానం సొంతం చేసుకున్నారు కృతీ శెట్టి. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారామె. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా 2021 ఫిబ్రవరి 12న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత ‘శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, కస్టడీ, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చె΄్పాలి, మనమే’ వంటి చిత్రాల్లో యువ హీరోలకి జోడీగా నటించారు కృతీ శెట్టి. ‘మనమే’ సినిమా 2024 జూన్ 7న రిలీజైంది.
ఆ సినిమా విడుదలై ఏడాది దాటి పోయినా టాలీవుడ్‌లో ఇప్పటికీ మరో సినిమాకి పచ్చజెండా ఊపలేదు కృతి. అయితే తెలుగులో ఒక్క సినిమా చేతిలో లేక పోయినా తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రం బిజీ బిజీగా ఉన్నారు ఈ బేబమ్మ. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, వా వాతియార్, జెనీ’ వంటి సినిమాల్లో నటిస్తున్నారీ బ్యూటీ. మరి... కృతీ శెట్టి తెలుగులో కొత్త సినిమాకి ఎప్పుడు పచ్చజెండా ఊపుతారు? అన్నది వేచి చూడాలి.
పైన పేర్కొన్న కథానాయికలే కాదు... అంజలి, డింపుల్ హయతి, శ్రద్ధా శ్రీనాథ్, రీతూ వర్మ వంటి మరికొందరు హీరోయిన్లకు కూడా తెలుగులో గ్యాప్ వచ్చింది. వారు నటించనున్న తర్వాతి తెలుగు సినిమాలపై ఇప్పటివరకూ ఎలాంటి అప్‌డేట్ లేదు. మరి... వీరి నుంచి కొత్త కబురు ఎప్పుడొస్తుందో వేచి చూడాలి. – డేరంగుల జగన్ మోహన్