
టాలీవుడ్‌లోకి ఎప్పటికప్పుడు పదుల సంఖ్యలో హీరోయిన్లు వస్తూనే ఉంటారు. తమదైన యాక్టింగ్‌తో అలరిస్తూ ఉంటారు. ఈమె కూడా అలానే అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడేమో సీరియల్స్ చేస్తోంది. మరి ఈ హింట్స్ బట్టి ఈ నటి ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?
పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు నిరోషా. ఇప్పటి జనరేషన్‌కి అయితే అస్సలు తెలియకపోవచ్చు. కానీ 90ల్లో తెలుగు సినిమాలు చూసిన వాళ్లు మాత్రం ఈమెని ఇట్టే గుర్తుపట్టేస్తారు. తెలుగులో ముద్దుల మామయ్య, నారీనారీ నడుమ మురారి, సింధూర పువ్వు, స్టూవర్టుపూరం పోలీస్ స్టేషన్ తదితర చిత్రాలతో ఆకట్టుకుంది. తర్వాత తర్వాత మూవీస్ చేసింది గానీ హిట్స్ అందుకోలేకపోయింది. తెలుగులో చివరగా 2019లో వచ్చిన 'నువ్వు తోపు రా' అనే మూవీలో కనిపించింది.
(ఇదీ చదవండి: ఎన్టీఆర్‌కే ఎక్కువ.. 'వార్ 2'కి రెమ్యునరేషన్ ఎంత?)
ఈమె వ్యక్తిగత విషయాలకొస్తే.. శ్రీలంకలోని కొలంబోలో పుట్టి పెరిగింది. కానీ తమిళ సినిమాలతో నటిగా మారింది. 1988 నుంచి ఇప్పటివరకు నటిస్తూనే ఉంది. కాకపోతే సినిమాలు చాలావరకు తగ్గించేసింది. గతేడాది రిలీజైన రజినీకాంత్ 'లాల్ సలామ్'లోనూ ఈమె నటించింది. గతంలో తెలుగులో పలు సీరియల్స్ కూడా ఈమె చేసింది. ప్రస్తుతం తమిళంలో సీరియల్స్ చేస్తోంది.
1995లో నటుడు రాంకీని ఈమె పెళ్లి చేసుకుంది. అతడు కూడా తెలుగుతో పాటు దక్షిణాది సినిమాల్లో కనిపించాడు. గతేడాది రిలీజైన 'లక్కీ భాస్కర్'లో హీరో సహాయపడే ఆంటోని పాత్ర చేసింది ఈయనే. ఇక నిరోషాకు ఒకప్పటి హీరోయిన్, నటి రాధిక బంధువు అవుతుంది. తాజాగా ఈమె శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈమె ఒకప్పటి హీరయిన్ నిరోషా కదా అని నెటిజన్లు అనుకుంటున్నారు.
(ఇదీ చదవండి: 'హరి హర వీరమల్లు'.. రెండోరోజు భారీగా తగ్గిన కలెక్షన్స్)