
టైటిల్: తెలుసు కదా
నటీనటులు:సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష
నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
రచన, దర్శకత్వం: నీరజ కోన
సంగీతం: ఎస్. థమన్
సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్ విఎస్
ఎడిటర్: నవీన్ నూలి
విడుదల తేది: అక్టోబర్ 17, 2025
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకున్న స్టార్ బాయ్ సిద్ధుకి ‘జాక్’ భారీ షాక్ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు ‘తెలుసు కదా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజ కోన తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ (Telusu Kada Movie Review)లో చూద్దాం.

కథేంటంటే..
స్టార్ హోటల్ లో చీఫ్ చెఫ్‌గా పనిచేసే వరుణ్ కుమార్(సిద్దు) అనాథ. కాలేజీ డేస్‌లో లవ్ బ్రేకప్ అవ్వడంతో అమ్మాయిలను ఎంత వరకు ప్రేమించాలనే విషయంలో క్లారిటీతో ఉంటాడు. భార్య, పిల్లలతో కలిసి సంతోషంగా జీవించాలని కోరుకుంటాడు. మ్యాట్రిమొనీ ద్వారా అంజలి(రాశి ఖన్నా)ని పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరికి పిల్లలు అంటే చాలా ఇష్టం. కానీ పెళ్లి తర్వాత అంజలికి పిల్లలు పుట్టరనే విషయం తెలుస్తుంది. కొన్నాళ్ల తర్వాత డాక్టర్ రాగా(శ్రీనిధి శెట్టి) ద్వారా సరోగసీతో తల్లి కావొచ్చనే విషయం అంజలికి తెలుస్తుంది. బిడ్డను మోసేందుకు డాక్టర్ రాగా ముందుకు వస్తుంది.
కట్ చేస్తే.. కాలేజీ డేస్‌లో వరుణ్ ప్రేమించిన అమ్మాయినే డాక్టర్ రాగా. ఈ విషయం తెలిసి కూడా రాగా తన బిడ్డను మోసేందుకు ఒప్పుకుంటాడు వరుణ్. ఈ ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు రాగా-వరుణ్ బ్రేకప్‌కి కారణం ఏంటి? తనను వదిలేసి వెళ్లిపోయిన రాగా పట్ల ఎంతో కోపం పెంచుకున్న వరుణ్.. ఆమె తన బిడ్డను మోసేందుకు ఎందుకు ఒప్పుకున్నాడు? రాగా-వరుణ్‌ల విషయం అంజలికి తెలిసిందా లేదా? మాజీ ప్రేయసి ఒకవైపు.. కట్టుకున్న భార్య మరోవైపు.. ఇద్దరి మధ్య వరుణ్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? వరుణ్ కోరుకున్నట్లుగా చివరకు తండ్రి అయ్యాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
ఇదొక డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. పెళ్లి అయిన తర్వాత తల్లికాలేని భార్య.. ప్రియుడి బాధను అర్థం చేసుకొని బిడ్డను మోసేందుకు ముందుకు వచ్చిన ప్రియురాలు.. వీరిద్దరిని హీరో ఎలా డీల్ చేశాడనేదే సినిమా కథ. ప్రేమ, ఈగో, ఎమోషన్స్ చుట్టూ కథనం తిరుగుతుంది. దర్శకురాలు నీరజ కోన ఎంచుకున్న పాయింట్ కాస్త కొత్తగా ఉన్నా.. కొన్ని చోట్ల హీందీ చిత్రం చోరి చోరి చుప్‌కే చుప్‌కే పోలికలు కనిపిస్తాయి.
మెచ్యూర్డ్ లవ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించారు కానీ.. ప్రియురాలే బిడ్డను కనేందుకు ముందుకు రావడం అనే లైన్‌ని సినిమా చూసే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేదానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. కొన్ని సున్నితమైన విషయాలను కూడా కాస్త బోల్డ్‌గానే చూపించారు. ఈ విషయంలో దర్శకురాలిని అభినందించాల్సిందే. కానీ కథనాన్ని ఆసక్తికరంగా మలచడంలో మాత్రం కొంతవరకే సఫలం అయ్యారు. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది.
హీరో బ్రేకప్ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పెళ్లి గురించి ప్లాన్ చేయడం.. ఈ క్రమంలో అంజలిని కలవడం.. ఇద్దరి ఇష్టాలు ఒకేలా ఉండడంతో పెళ్లి చేసుకోవడం.. పిల్లలు పుట్టరనే విషయం తెలిసే వరకు కథనం సింపుల్‌గానే సాగుతుంది. రాగా ఎంట్రీ తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. బిడ్డను మోసేందుకు తనే ముందుకు రావడంతో తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. ఇక సెకండాఫ్ మొత్తం వరుణ్, రాగా, అంజలిల చుట్టే తిరుగుతుంది. వరుణ్, రాగాల గురించి అంజలికి తెలిసిన తర్వాత ఏం జరిగిందనేదే సెకండాఫ్ స్టోరీ. ఫస్టాప్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుంది. ముగ్గురి మధ్య వచ్చే సీన్లు రొటీన్‌గానే ఉంటాయి. కొన్ని చోట్ల సాగదీతగా అనిపిస్తాయి. అయితే సినిమాలోని డైలాగ్స్ అన్ని ఆకట్టుకోవడమే కాదు ఆలోచింపజేస్తాయి. క్లైమాక్స్‌లో ఇచ్చే సందేశం బాగుంటుంది.
ఎవరెలా చేశారంటే..
ఈగో, ఎమోషన్స్‌తో కూడిన వరుణ్ పాత్రలో సిద్దు ఒదిగిపోయాడు. శ్రీనిధి, రాశీ ఖన్నాలతో సిద్దు కెమిస్ట్రీ తెరపై బాగా పండింది. ప్రేమ, పెళ్లి వద్దు.. ఉన్నంత సేపు సంతోషంగా గడిపి తర్వాత ఎవరిదారి వారు చూసుకుందామనే అమ్మాయి రాగా పాత్రకి శ్రీనిధి న్యాయం చేసింది. హీరో భార్య అంజలిగా రాశీ ఖన్నా చక్కగా నటించింది. వైవా హర్ష తన కామెడీ ఇమేజ్‌కి భిన్నంగా, డిఫరెంట్ ఫ్రెండ్ పాత్రలో మెప్పించాడు. చిన్న చిన్న డైలాగ్స్‌తో నవ్వులు పూయించాడు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. తమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. అయితే ఆ బీజీఎం మొత్తం ఇటీవల వచ్చిన ఓజీ సినిమాను గుర్తు చేస్తుంది. జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ కి రిచ్ నెస్ తీసుకొచ్చింది. నవీన్ నూలి ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.