అప్పుడు బ్లేడు..ఇప్పుడు దుప్పటి..‘భజన’ గణేష్‌

Telangana Assembly Elections 2023: Bandla Ganesh Interesting Comments On Congress Party - Sakshi

పవన్‌ అభిమానినే ..అయినా మద్దతు ఇవ్వను: బండ్ల గణేశ్‌

బండ్ల గణేశ్‌ గురించి తెలుగు ప్రజలకు తెలిసిందే. కమెడియన్‌గా కెరీర్‌ ప్రారంభించి.. తక్కువ సమయంలోనే అగ్ర నిర్మాతగా ఎదిగాడు. కానీ తన నోటి దురుసుతో తన కెరీర్‌ని తానే నాశనం చేసుకున్నాడు. ప్రస్తుతం అతనితో సినిమాలు చేయడానికి ఏ హీరో కూడా ముందుకు రావడం లేదు. దీంతో చిత్ర పరిశ్రమను పక్కన పెటి​.. రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు. అయితే అక్కడ కూడా రోజుకో పార్టీ.. పూటకో మాట మారుస్తూ.. బండ్ల గణేశ్‌ కమెడియన్‌గానే మిగిలిపోయాడు. మొన్నటికి మొన్న టీడీపీకి జై కొడుతూ.. చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తిన బండ్లన్న.. ఇప్పుడు కాంగ్రెస్ భజన చేస్తున్నాడు. తన బ్లడ్‌లోనే కాంగ్రెస్‌ పార్టీ ఉందని.. గాంధీభవన్‌ తన పుట్టిల్లు అంటున్నాడు. 

భనజ గణేశ్‌..
భజన చేయడంలో గణేశ్‌ని మించిన వాడు లేడు. స్టేజ్‌పై మైక్‌ దొరికితే చాలు.. ఊగిపోతుంటాడు. అయితే ఆ భజన అనేది ఒక పార్టీకో లేదా ఒక వ్యక్తికో చేస్తే బాగుండేది. కానీ బండ్లన్న మాత్రం  పూటకో పార్టీని, రోజుకో నాయకుడిని పొగిడేస్తుంటాడు. ఒకసారి పవన్‌ కల్యాణ్‌ కోసం ప్రాణాలు ఇస్తా అంటాడు.. మరోసారి చంద్రబాబు కోసం జైలుకు వెళ్తా అంటాడు. ఇప్పుడేమో తుదిశ్వాస వరకు కాంగ్రెస్‌తోనే ఉంటానంటున్నాడు. అంతేకాదు తెలంగాణలో కచ్చితంగా కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఏర్పడుతుందని జోస్యం చెబుతున్నాడు. 

అప్పుడు బ్లేడు..ఇప్పుడు దుప్పటి
బండ్ల గణేశ్‌ రాజకీయ ఎంట్రీ గత అంసెబ్లీ ఎన్నికల్లోనే జరిగింది. ఢిల్లీకి వెళ్లి రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. పార్టీ కండువా కప్పుకోవడమే ఆలస్యం.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, లేకపోతే తాను 7 O’clock బ్లేడుతో గొంతు కోసుకుంటానని చెప్పి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. చివరకు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాజయం ఎదురవ్వడంతో సైలెంట్‌ అయ్యాడు.

అంతేకాదు తనకు రాజకీయాలు పడవని.. ఇక నుంచి పాలిటిక్స్‌కు దూరంగా ఉంటానని ప్రకటించాడు. కానీ మన బండ్లన్నకు మాటలు మార్చడం ఎంతసేపు?  ఎన్నికల ప్రకటన రాగానే.. మళ్లీ రాజకీయల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. తను పక్కా కాంగ్రెస్‌వాదినని.. గాంధీ భవన్‌ తన పుట్టినిల్లు అంటున్నాడు. అంతేకాదు ఈ సారి తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని జోస్యం చెబుతున్నాడు.

డిసెంబర్‌ 9న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని.. 7వ తేదినే తాను ఎల్బీ స్టేడియంకి వెళ్లి దుప్పటి కప్పుకొని పడుకుంటానని అంటున్నాడు. మరి మీ దేవుడు పవన్‌ కల్యాణ్‌ పార్టీ కూడా పోటీ చేస్తుంది కదా? మద్దతు ఇవ్వరా అంటే.. అస్సలు ఇవ్వనని చెబుతున్నాడు. పవన్‌ అభిమానినే అయినా.. ఆయన పార్టీకి మాత్రం తాను మద్దతు ఇచ్చేదే లేదు అని తెగేసి చెబుతున్నాడు. బండ్ల గణేశ్‌ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అవి చూసి.. బండ్ల.. ఓ పొలిటికల్‌ కమెడియన్‌ అని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top