ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తస్కరి–ది స్మగ్లర్స్ వెబ్ అనే సిరీస్ ఒకటి. ఈ వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాం
మనకు తెలిసిన 64 కళలలో చోర కళ అనేది చతురత, నైపుణ్యంతో కూడుకున్నది. ఆ చోర కళలో ఓ విభాగమే ఈ స్మగ్లింగ్. ఇప్పటిదాకా అడపా దడపా వార్తలలో వినపడినట్టు లేక అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో చూపించడం ద్వారానే స్మగ్లింగ్ అనేది సామాన్యులకు కాస్త పరిచయం. ఈ స్మగ్లింగ్ నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా ‘తస్కరి–ది స్మగ్లర్స్ వెబ్’ సిరీస్ రూపొందింది. నీరజ్ పాండే ఈ సిరీస్‌కి కథ అందించి, స్వీయదర్శకత్వంలో రూపొందించారు. ఏడు భాగాలతో తెలుగు డబ్బింగ్ వెర్షన్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ స్మగ్లింగ్ జరిగే విధానాన్ని, కస్టమ్స్ ఆ స్మగ్లింగ్‌ని అరికట్టే పద్ధతులను సామాన్య ప్రేక్షకులకు కూడా అర్థమయ్యే విధంగా దాదాపు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో ఈ సిరీస్‌కు ప్రాణం పోశారు. ఈ సిరీస్ కథ మొత్తం ముంబై శివాజీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నేపథ్యంలో నడుస్తుంది. ఈ ఎయిర్‌పోర్టులో కథానాయకుడు అర్జున్ మీనా కస్టమ్స్ ఆఫీసరుగా పని చేస్తుంటాడు. తాను పని చేస్తున్న ఎయిర్‌పోర్టులో ఇతర దేశాల నుండి కొన్ని కోట్ల రూపాయల విలువ గల స్మగ్లింగ్ జరుగుతోందని, అది కూడా అరబ్ దేశాలలో ఉన్న బడా చౌదరి వల్ల జరుగుతోందని తెలుసుకుంటాడు అర్జున్.
ఇదే సమయంలో కొత్తగా తమకు వచ్చిన బాస్ ప్రకాశ్‌తో కలిసి ఓ ప్లాన్ వేస్తాడు. కానీ బడా చౌదరి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కస్టమ్స్ వాళ్ళని ముప్పుతిప్పలు పెడుతుంటాడు. మరి... బడా చౌదరి స్మగ్లింగ్ బండారాన్ని అర్జున్ బయటపెడతాడా? లేదా అన్నది మాత్రం ‘తస్కరి–ది స్మగ్లర్స్ వెబ్’ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సిరీస్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. కాకపోతే క్లైమాక్స్ కాస్త పేలవంగా అనిపించినా సిరీస్ మొత్తం చూసినవారికి స్మగ్లింగ్ సీక్రెట్స్ బాగానే తెలుస్తాయి. ఈ వీకెండ్‌కి ‘తస్కరి–ది స్మగ్లర్స్ వెబ్’ సిరీస్ మంచి కాలక్షేపం.
– హరికృష్ణ ఇంటూరు


