మనసున్న మాస్‌ హీరో | Sakshi
Sakshi News home page

మనసున్న మాస్‌ హీరో

Published Fri, Dec 29 2023 12:02 AM

Tamil Nadu Politician and Former Actor Vijayakanth No More - Sakshi

తమిళ ప్రేక్షకులకు విజయ్‌కాంత్‌ ఓ ‘పురట్చి కలైజ్ఞర్‌’ (విప్లవ కళాకారుడు)... నల్ల ఎంజీఆర్‌... అభిమానులకు మంచి మాస్‌ హీరో... కెప్టెన్ ...  ఇవే కాదు..  ధైర్యం, తెగువకు చిరునామా అనే పేరు కూడా ఉంది.. మంచి మానవతావాది కూడా. ఇలా ఎన్నో రకాల రూపాల్లో నటుడిగా, వ్యక్తిగా తమిళ ప్రజల మనసుల్లో ‘మనసున్న మాస్‌ హీరో’గా చెరగని ముద్ర వేసుకున్న విజయ్‌కాంత్‌ ఇక లేరు. 

విజయ్‌కాంత్‌ తమిళంలో తప్ప ఇతర భాషల్లో సినిమాలు చేయలేదు. కానీ ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ‘ఛాలెంజ్‌ రౌడీ, రౌడీలకు రౌడీ, పోలీస్‌ అధికారం, కెప్టెన్, కెప్టెన్‌ ప్రభాకరన్, మా బావ బంగారం, నేటి రాక్షసులు, సింధూరపువ్వు, అమ్మను చూడాలి, బొబ్బిలి రాయుడు, మరణ మృదంగం’.. ఇలా ఆయన నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో అను వాదమై, ఇక్కడి ప్రేక్షకులకు విజయ్‌కాంత్‌ని దగ్గర చేశాయి. 

తెలుగు హీరోలు పలువురు విజయ్‌కాంత్‌ తమిళ సినిమాలను తెలుగులో రీమేక్‌ చేసి బ్లాక్‌బస్టర్స్‌ కొట్టారు. చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఠాగూర్‌’ (2003) విజయ్‌కాంత్‌ హీరోగా వచ్చిన తమిళ సినిమా ‘రమణ’ (2002)కు రీమేక్‌. అలాగే విజయ్‌కాంత్‌ హీరోగా నటించిన ‘సట్టమ్‌ ఒరు ఇరుట్టరై’ (1981), ‘వెట్రి’ (1984), ‘అమ్మన్‌ కోయిల్‌ కిళక్కాలే’ (1986) సినిమాలు తెలుగులో ‘చట్టానికి కళ్ళు లేవు’ (1981) ‘దేవాంతకుడు’ (1984), ‘ఖైదీ నంబరు 786’ (1988)గా రీమేక్‌ కాగా, ఈ చిత్రాల్లో చిరంజీవి హీరోగా నటించారు.

విజయ్‌కాంత్‌ ‘చిన్న గౌండర్‌’ (1992) తెలుగు రీమేక్‌ ‘చినరాయుడు’ (1992)లో వెంకటేశ్, ‘నానే రాజా నానే మంత్రి’ (1985) రీమేక్‌ ‘నేనే రాజు నేనే మంత్రి (1987)’, ‘ఎన్‌ పురుషన్‌దాన్‌ ఎనక్కు మట్టుమ్‌దాన్‌’ (1989) రీమేక్‌ ‘నా మొగుడు నాకే సొంతం’ (1989) చిత్రాల్లో మోహన్‌బాబు హీరోగా నటించారు. విజయ్‌కాంత్‌ ‘వానత్తై పోల’ (2000) సినిమాను తెలుగులో ‘మా అన్నయ్య’గా రీమేక్‌ చేసి హిట్‌ అందుకున్నారు రాజశేఖర్‌. కాగా కొందరు తెలుగు హీరోల సినిమాల తమిళ రీమేక్‌లో నటించి హిట్స్‌ అందుకున్నారు విజయ్‌కాంత్‌.

బాలకృష్ణ హీరోగా నటించిన ‘భానుమతిగారి మొగుడు’ (1987) సినిమా తమిళ రీమేక్‌ ‘తెర్కత్తి  కళ్లన్‌’ (1988)లో, ఎన్టీఆర్‌ బ్లాక్‌బస్టర్‌ ఫిల్మ్‌ ‘సింహాద్రి’ (2003) రీమేక్‌ ‘గజేంద్ర’ (2004)లో విజయ్‌కాంత్‌ హీరోగా నటించి, బ్లాక్‌బస్టర్స్‌ అందుకున్నారు. ఇలా ఆయన కెరీర్‌లో మరికొన్ని సినిమాలు ఉన్నాయి.  

విజయ్‌కాంత్‌ అసలు పేరు నారాయణన్  విజయ్‌రాజ్‌ అళగర్‌సామి. కేఎన్  అళగర్‌సామి, ఆండాళ్‌ అళగర్‌సామి దంపతులకు 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో జన్మించారాయన. కాగా అళగర్‌సామి కుటుంబానికి తెలుగు మూలాలు ఉన్నాయి. పదో తరగతి వరకు చదివిన విజయ్‌రాజ్‌ తండ్రికి సహాయంగా రైస్‌ మిల్లు బాధ్యతలను చూసుకునేవాడు. అయితే చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి ఉండటంతో 1979లో చెన్నై చేరుకున్నాడు విజయ్‌రాజ్‌. సినీ అవకాశాల కోసం ప్రయత్నించిన ఆయనకు ఎంఏ రాజా దర్శకత్వం వహించిన ‘ఇనిక్కుమ్‌  ఇళమై’ (1979) చిత్రంలో ప్రతినాయకుడిగా తొలి అవకాశం వచ్చింది.

ఆ చిత్ర దర్శక–నిర్మాత ఎంఏ కాజానే విజయ్‌రాజ్‌ పేరుని విజయ్‌కాంత్‌గా మార్చారు. ‘ఇనిక్కుమ్‌ ఇళమై’ తర్వాత ‘అగల్‌ విళక్కు, నీరోట్టం, చామంతి పూ’ తదితర చిత్రాల్లో ఆయన నటించినా ఆశించిన విజయాలు అందుకోలేకపోయారు. ఆ తర్వాత ఎస్‌ఏ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహించిన ‘దూరత్తు ఇడి ముళక్కమ్‌’ (1980) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు విజయ్‌కాంత్‌. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఎస్‌ఏ చంద్రశేఖర్‌ దర్శకత్వంలో నటించిన ద్వితీయ చిత్రం ‘చట్టం ఒరు ఇరుట్టరై’ (1981) సినిమా సంచలన విజయం సాధించడంతో పాటు విజయ్‌కాంత్‌కు మాస్‌ ఇమేజ్‌ తెచ్చిపెట్టింది.  

హీరోగా చాలా బిజీ అయిపోవడంతో రోజుకు మూడు షిఫ్టులుగా పని చేశారాయన. ఎంత బిజీ హీరో అంటే 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదలవడం విశేషం. విజయ్‌కాంత్‌ సినిమాల్లో ఎక్కువగా సామాజిక నేపథ్యం ఉంటుంది. వీరోచితం, విప్లవ భావాలు, ప్రజలను ఉత్తేజపరచే అంశాలు ఉంటాయి. అలాగే ఆయన యాక్షన్ కు ప్రత్యేక అభిమానులున్నారు. ‘అమ్మన్  కోయిల్‌ కిళక్కాలే, వైదేహి కాత్తిరిందాళ్, చిన్న గౌండర్, వానతై ్త పోల’ వంటి పలు కుటుంబ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రాల్లోనూ తనదైన నటనతో అలరించారాయన. పోలీస్‌ పాత్రలకు వన్నె తెచ్చిన విజయ్‌కాంత్‌కు ‘కెప్టెన్‌ ప్రభాకరన్‌’ సంచలన హీరోగా పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం తర్వాత ఫ్యాన్స్‌ ఆయన్ను 
‘కెప్టెన్‌’  అని ప్రేమగా పిల వడం మొదలు పెట్టారు. 

కొందరు ఫ్యాన్స్‌  విప్లవ కళా
కారుడు అంటూ గౌరవంతో పిలుచుకుంటారు. అయితే విజయ్‌కాంత్‌ సినీ కెరీర్‌ అంత సాఫీగా సాగలేదు. ఆదిలో ఎన్నో కష్టాలు, అవమానాలను ఎదుర్కొన్నారు. విజయ్‌కాంత్‌ నలుపు రంగులో ఉండటంతో మొదట్లో పలువురు ప్రముఖ నటీమణులు ఆయన సరసన నటించడానికి నిరాకరించారట. అయినా తనను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్‌కాంత్‌. అటు సందేశాత్మక చిత్రాలు, ఇటు వాణిజ్య సినిమాలు ఏకకాలంలో చేశారాయన. సినిమా ప్రారంభంలో కాకుండా విడుదల ముందు పారితోషికాన్ని అందుకుని నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్నారు.

ఒకవేళ ఆ సినిమా నిర్మాత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకునేవారు కాదట. ఎంజీఆర్‌ అభిమాని అయిన విజయ్‌కాంత్‌.. తన అభిమాన హీరోలాగా ప్రజల ఆకలి తీర్చేవారు. ఆయన కార్యాలయంలో నిత్యాన్నదానం చేస్తూ.. కరుప్పు (నలుపు) ఎంజీఆర్‌గా కొనియాడబడ్డారు విజయ్‌కాంత్‌. ఆర్‌కే సెల్వమణి దర్శకత్వం వహించిన ‘కెప్టెన్  ప్రభాకరన్ ’ విజయ్‌కాంత్‌కు నూరవ చిత్రం. ఆయన కెరీర్‌లో 150కిపైగా సినిమాల్లో నటిస్తే.. అందులో 20కిపైగా పోలీస్‌ ఆఫీసర్‌గా నటించిన సినిమాలే ఉండడం విశేషం.

చివరగా తన కొడుకు షణ్ముగ పాండియన్ ను హీరోగా పరిచయం చేసిన ‘సహాబ్దం’ (1993) చిత్రంలో ముఖ్య పాత్రను పోషించారాయన. ‘విరుదగిరి’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు విజయ్‌కాంత్‌. బావ ఎల్‌.కె. సుధీశ్‌తో కలిసి మూడు సినిమాలు నిర్మించారు విజయ్‌కాంత్‌. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం అధ్యక్షుడిగానూ విశేష సేవలందించారాయన. సినీ పరిశ్రమలో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న విజయ్‌కాంత్‌ మృతికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కూడా ఆయనకు మృతి పట్ల విచారం వ్యక్తం చేశాయి. విజయ్‌కాంత్‌కుభార్య ప్రేమలత, కుమారులు విజయ ప్రభాకరన్, షణ్ముగ పాండియన్  ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement