పండుగ నిండుగ

Tamil Nadu Government approves full occupancy in theaters  - Sakshi

థియేటర్‌ నిండితే సినిమా వాళ్లకు కడుపు నిండినంత ఆనందం. కోవిడ్‌ అన్‌లాక్‌ వల్ల అర్ధాకలితో నడుస్తున్నాయి థియేటర్స్‌. తాజాగా తమిళనాడు ప్రభుత్వం థియేటర్స్‌కు ఫుల్‌ మీల్స్‌ టికెట్‌ ఇచ్చింది. 100 శాతం సీటింగ్‌ కెపాసిటీతో థియేటర్స్‌లో సినిమా ప్రదర్శించుకోవచ్చంది. ఇనియ పొంగల్‌ నల్‌ వాళ్తుగళ్‌ చెప్పింది. తియ్యని సంక్రాంతి శుభాకాంక్షలన్న మాట. పొంగల్‌ పండుగ నిండుగా జరుపుకోమంది. మరి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్‌కీ 100 శాతం సీటింగ్‌ అనుమతి వస్తుందా? మన సంక్రాంతి కూడా నిండుగా జరుగుతుందా?

కోలీవుడ్‌ ఖుషీ ఖుషీ
సోమవారం కోలీవుడ్‌ ఇండస్ట్రీ ఖుషీ ఖుషీగా ఉంది. ‘థియేటర్స్‌ సిస్టమ్‌ తిరిగి పుంజుకోవాలంటే వంద శాతం సీటింగ్‌ కెపాసిటీతో సినిమాల ప్రదర్శనకు అనుమతివ్వాలి’ అని తమిళనాడు ప్రభుత్వాన్ని ఇండస్ట్రీ కోరింది. ఈ విషయమై తమిళనాడు సీయం పళని స్వామిని స్వయంగా కలిశారు తమిళ స్టార్‌ విజయ్‌. ఆయన నటించిన ‘మాస్టర్‌’, శింబు ‘ఈశ్వరన్‌’ సినిమాలు పొంగల్‌కి విడుదలవుతున్నాయి. తాజా ప్రకటనపై ఈ రెండు చిత్రబృందాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. తమిళ ఇండస్ట్రీ హర్షం వ్యక్తం చేసింది. అయితే థియేటర్స్‌ ఫుల్‌ కెపాసిటీతో ఓపెన్‌ చేయడం కరెక్ట్‌ కాదేమో? అని కొందరు అభిప్రాయపడుతున్నారు. అన్నింటిని అన్‌లాక్‌ చేసినప్పుడు థియేటర్స్‌ సగం సీటింగ్‌తో నడపడమెందుకు? అనేది ఇంకొందరి అభిప్రాయం. ఏది ఏమైనా తొమ్మిది నెలల తర్వాత థియేటర్స్‌ నిండుగా కనపడబోతున్నాయి.
 
మనకూ 100శాతం సీటింగ్‌ ఉంటుందా?
50 శాతం సీటింగ్‌ ఉన్నా కూడా సంక్రాంతికి తెలుగులో పలు సినిమాలు బరిలో ఉన్నాయి. రవితేజ ‘క్రాక్‌’, రామ్‌ ‘రెడ్‌’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ‘అల్లుడు అదుర్స్‌’, విజయ్‌ ‘మాస్టర్‌’ (డబ్బింగ్‌), దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ‘జాంబి రెడ్డి’, ‘క్రేజీ అంకుల్స్‌’ విడుదలకు సిద్ధం అయ్యాయి. మరి మన నిర్మాతలు కూడా ప్రభుత్వాన్ని ఫుల్‌ కెపాసిటీతో ఓపెన్‌ చేసేందుకు అనుమతి కోరతారా? నిర్మాతల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

► మన దగ్గర కూడా థియేటర్లు నిండుగా ఉంటే బాగుంటుంది. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను ఈ విషయమై సంప్రదించాలనుకుంటున్నాం. సంక్రాంతి రిలీజ్‌కు చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. 100 శాతం సీటింగ్‌కి అనుమతి లభిస్తే బాగుంటుంది.
– సి. కల్యాణ్, తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు

► యాభై శాతం సీటింగ్‌ కెపాసిటీ విషయమై ఎంహెచ్‌ఎ (హోమ్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ) నుంచి ఓ లేఖ అందింది. తమిళనాడు ప్రభుత్వాన్ని దాన్ని ఉపయోగించుకుని వంద శాతం సీటింగ్‌ కెపాసిటీకి జీవో పాస్‌ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సీటింగ్‌ గురించి రెండు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి.
– నిర్మాత డి. సురేశ్‌బాబు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top