
ప్రతి ఉదయం కొత్త రోజుకి ప్రారంభం. కొత్త ఆలోచనలకు, ప్రయాణాలకు, కథలకు కూడా ప్రారంభమే. ఇప్పుడు సరికొత్త ఉదయంలో అంటూ కథలు చెప్పడానికి సిద్ధమయ్యారు పలువురు దర్శకులు. గౌతమ్ మీనన్, రాజీవ్ మీనన్, సుహాసిని, సుధా కొంగర, కార్తీక్ సుబ్బరాజ్ కలసి అమేజాన్ ప్రైమ్ కోసం ఓ యాంథాలజీ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ‘పుత్తమ్ పుదు కాలై’ (సరికొత్త ఉదయం) టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐదు చిన్న కథలు ఉంటాయి. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న భాగంలో మలయాళ నటి కళ్యాణీ ప్రియదర్శన్, కాళిదాస్ జయరామ్ నటిస్తారు. సుహాసిని కథలో అనూహాసన్, శ్రుతీహాసన్ కనిపించనున్నారు. గౌతమ్ మీనన్ కథలో రీతూ వర్మ, రాజీవ్ మీనన్ కథలో ఆండ్రియా, కార్తీక్ సుబ్బరాజ్ కథలో బాబీ సింహా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 16 నుంచి అమేజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం ప్రసారం కానుంది.