చిత్రపరిశ్రమలో విషాదం.. దర్శకుడు కన్నుమూత | Tamil Director V Sekar Passed Away at 72 | Sakshi
Sakshi News home page

తమిళ దర్శకుడు కన్నుమూత

Nov 16 2025 8:15 AM | Updated on Nov 16 2025 8:44 AM

Tamil Director V Sekar Passed Away at 72

సాక్షి, చెన్నై: సీనియర్‌ దర్శకుడు వి.శేఖర్‌ (72) శుక్రవారం సాయంత్రం చైన్నెలో అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈయన స్వగ్రామం తిరువణ్ణామలై సమీపంలోని నెయ్‌ వానత్తం. మొదట్లో ప్రభుత్వ ఉద్యోగం చేసిన వి.శేఖర్‌ సినిమాలపై ఆసక్తితో ఎడిటర్‌ లెనిన్‌ వద్ద కొంత కాలం పని చేశారు. ఆ తరువాత కె.భాగ్యరాజ్‌ శిష్యుడు గోవిందరాజ్‌ వద్ద చేరి కన్ను తొలక్కనుమ్‌ సామి చిత్రానికి  సహాయ దర్శకుడిగా వ్యవహరించారు. ఆ తరువాత కె.భాగ్యరాజ్‌ వద్ద పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. 

సినిమా
1990లో నిళల్గళ్‌ రవి హీరోగా నటించిన 'నీంగళుమ్‌ హీరోదాన్‌' అనే మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. తరువాత అదే నిళల్గళ్‌ రవిని హీరోగా పెట్టి నాన్‌ పుడిచ్చ మాప్పిళై మూవీ తీశారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇది తెలుగులో మామగారు పేరుతో రీమేక్‌ అయింది. దాసరి నారాయణరావు, వినోద్‌ కుమార్‌, యమున ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఆ తరువాత పలు కుటుంబ కథా చిత్రాలను రూపొందించారు.

అవయవదానం
నిర్మాతగానూ కొన్ని హిట్‌ చిత్రాలను నిర్మించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన వీ.శేఖర్‌ స్థానిక పోరూర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం ఆస్పత్రిలోనే తుది శ్వాస విడిచారు. స్థానిక కోడంబాక్కమ్‌, సుబ్బరాయన్‌ నగర్‌లోని సామియార్‌ మఠంలో నివసిస్తున్న ఈయనకు భార్య తమిళ్‌ సెల్వి, కూతురు మలర్‌కొడి, కొడుకు కారల్‌ మార్క్స్‌ ఉన్నారు. దర్శకుడు వి.శేఖర్‌ అవయవ దానం చేశారు. ఆ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఆయన భౌతిక కాయాన్ని శనివారం ఇంటికి తీసుకు వచ్చారు. వి.శేఖర్‌ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.

చదవండి: కోర్టు హీరోయిన్‌కు తమిళ్‌లో మరో ఛాన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement