
మేజర్ కుల్దీప్ సింగ్‌గా బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్ వెండితెరపైకి మళ్లీ వస్తున్నారు. సన్నీ డియోల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బోర్డర్ 2’. వరుణ్ ధావన్, దిల్జీత్ సింగ్, అహన్ శెట్టి, మేధా రాణా, మోనా సింగ్, సోనమ్ బజ్వా ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో మేజర్ కుల్దీప్ సింగ్ పాత్రలో కనిపిస్తారు సన్నీ డియోల్. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘బోర్డర్ 2’ సినిమాలోని సన్నీ డియోల్ పాత్ర తాలూకు మోషన్‌పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.
‘హిందుస్తాన్... హిందుస్తాన్... మేరీ జాన్ హిందుస్తాన్’ అనే పాటతో ఈ మోషన్‌పోస్టర్ సాగుతుంది. అనురాగ్ సింగ్ దర్శకత్వంలో భూషణ్ కుమార్, క్రిషణ్‌కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 22న విడుదల కానుంది. అయితే ఈ సినిమాను తొలుత జనవరి 23న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఒకరోజు ముందుగా... జనవరి 22న విడుదల చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
ఇక 1971లో జరిగిన ఇండియా–పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో సన్నీ డియోల్ హీరోగా నటించిన ‘బోర్డర్’ (1997) సినిమాకు సీక్వెల్‌గా ‘బోర్డర్ 2’ రూపొందింది. ‘‘27 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఓ వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఓ సైనికుడు తిరిగి వస్తున్నాడు’’ అంటూ ఈ సినిమాను ప్రకటించిన సమయంలో ఈ చిత్రబృందం పేర్కొంది.