
కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు, దర్శకుడు సుందర్ సి కలిసి నటించిన 'గ్యాంగర్స్' చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. సుమారు 15 ఏళ్ల తరువాత వీరిద్దరూ కలిసి నటించడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించేలా కలెక్షన్స్ రాబట్టింది. ఖుష్బు సుందర్ నిర్మించిన ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు.
'గ్యాంగర్స్' తమిళ యాక్షన్ కామెడీ మూవీ తాజాగా 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో సడెన్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీలోకి ఈ చిత్రం రావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా, మునిష్కాంత్, భగవతి పెరుమాల్ నటించగా వెంకట్ రాఘవన్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు.

వినోదభరిత కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో వడివేలు సింగారన్ అనే పాత్రలో నటించారు. ఒక చిన్న పట్టణంలో ఉండే పాఠశాలలో ఒక బాలిక తప్పిపోతుంది, ఉపాధ్యాయురాలు సుజిత (కేథరిన్ థ్రెసా) ఆమెను కనుగొనమని పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. ఈ కేసును పూర్తి చేసేందుకు ఓ పోలీసు అధికారి రహస్యంగా అదే స్కూల్లో పీటీగా అండర్ కవర్‌లో నియమించబడతారు. పోలీస్ అధికారి రాకతో అసలు పీటీ (వడివేలు) పరిస్థితి ఏంటి..? ఇన్వెస్టిగేషన్ సాగుతున్న క్రమంలోనే కథ మరో మలుపు తిరుగుతుంది. స్థానికంగా ఉండే ముగ్గురు రౌడీల వద్ద ఉన్న డబ్బును దోచుకోవడానికి కొందరు ప్రయత్నిస్తారు. వీరికి, తప్పిపోయిన బాలికకు ఉన్న లింక్ ఏంటి..? వంటి అంశాలు చాలా ఆసక్తిగా ఉంటాయి.