
బాలీవుడ్‌లో మరో జంట గుడ్ న్యూస్ చెప్పేశారు. తెలుగులో 'భరత్ అను నేను', 'వినయ విధేయ రామ', 'గేమ్ ఛేంజర్' సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన కియారా అడ్వాణీకి ఆడపిల్ల పుట్టింది. మంగళవారం రాత్రి బిడ్డకు జన్మనివ్వగా.. బుధవారం కియారా-సిద్ధార్థ్ జంట తమకు ఆడపిల్ల పుట్టిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే నెటిజన్లు ఓ ఆసక్తికర విషయాన్ని కనిపెట్టారు. ఇప్పుడు అదికాస్త వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: హీరోతో 'బ్రహ్మముడి' సీరియల్ నటి నిశ్చితార్థం)
2012లో 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' సినిమాతో ఆలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ పరిచయమయ్యారు. వీళ్లు ముగ్గురు ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆలియా భట్ ఇప్పటికే స్టార్ హీరోయిన్ అయిపోయింది. 2022లో హీరో రణ్‌బీర్ కపూర్‌ని పెళ్లి చేసుకోగా అదే ఏడాది కూతురు రహాకి జన్మనిచ్చింది. కూతురితో ఆలియా ఎప్పటికప్పుడు మీడియా కంట పడుతూనే ఉంటుంది. ఈమె కూతురికి సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.
వరుణ్ ధావన్ విషయానికొస్తే నటాషా దలాల్ అనే అమ్మాయిని 2021లో పెళ్లి చేసుకున్నాడు. గతేడాది జూన్‌లో ఇతడికి కూడా కూతురు పుట్టింది. ఇప్పుడు సిద్ధార్థ్ మల్హోత్రాకు కూడా కూతురే పుట్టంది. దీంతో 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్'లో హీరోహీరోయిన్లు అయిన ముగ్గురికీ ఆడపిల్లనే పుట్టిందని నెటిజన్లు అంటున్నారు.
(ఇదీ చదవండి: ఆ హాలీవుడ్ మూవీ చూస్తుంటే 'జెర్సీ' గుర్తొచ్చింది: నాగవంశీ)