
ఇంటిల్లిపాదిని కడుపుబ్బా నవ్వించే చిత్రంగా బాక్సాఫీస్ వద్ద ‘సింగిల్’ సినిమా దుమ్మురేపుతుంది. శుక్రవారం(మే 9) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ రెండోరోజు కలెక్షన్స్‌ను మేకర్స్ ప్రకటించారు. ఇందులో శ్రీవిష్ణు (Sree Vishnu)తో కేతిక శర్మ, ఇవానా నటించారు. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంగా దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు.
సింగిల్ సినిమాలో శ్రీవిష్ణు వన్‌లైన్ పంచ్‌లతో పాటు వెన్నెల కిశోర్ కామెడీ టైమింగ్ అదిరిపోయిందని ప్రేక్షకులు చెబుతున్నారు. మొదటిరోజు మంచి టాక్ రావడంతో రెండోరోజు భారీగా కలెక్షన్స్ పెరిగాయి. డే1 రూ. 4.15 కోట్లు రాగా, రెండోరోజు రూ. 7.05 కోట్లు వచ్చాయి. మొత్తం రెండురోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ. 11.2 కోట్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీవిష్ణు కెరీర్‌లో మరో భారీ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. సింగిల్ సినిమా కథ, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతిని ఇస్తుందని నెటిజన్లు కామెంట్ల రూపంలో చెబుతున్నారు.

సామజవరగమన, ఓం భీమ్ బుష్ వరుస హిట్లు అందుకున్న శ్రీవిష్ణు శ్వాగ్ (Swag) సినిమాతో కాస్త నిరుత్సాహపరిచాడు. అయితే, ఇప్పుడు సింగిల్ సినిమాతో దుమ్మురేపాడని చెప్పొచ్చు. మూడు జనరేషన్‌ల మైండ్‌సెట్‌లను వినోదాత్మకంగా తెరపై చూపించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్దగా సినిమాలు ఏవీ లేవు. ఇది సింగిల్ సినిమాకు కలిసొచ్చే ఛాన్స్ ఉంది. దీంతో మరింతగా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, ఈ సినిమాకు వచ్చిన లాభాల్లో కొంతభాగం భారత సైనికులకు విరాళంగా ఇస్తామని నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించిన సంగతి తెలిసిందే.