
పెద్ద అడిశర్లపల్లి(నల్గొండ): ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి ట్రావెలింగ్, ఫొటోగ్రఫీపై తనకున్న ఆసక్తితో అంచలంచెలుగా ఎదుగుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నాడు నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలంలోని మేడారం గ్రామానికి చెందిన మేడారం వెంకటయ్య, అంజమ్మ దంపతుల కుమారుడు మేడారం అరవింద్. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర సినిమాకు అరవింద్ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
అరవింద్ తల్లిదండ్రులు అతడి చిన్నతనంలో బతుకుదెరువు కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లగా.. వారితో పాటు అతడు కూడా వెళ్తూ సంక్షేమ హాస్టల్‌లో ఉంటూ చదువుకున్నారు. ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు పేపర్‌బాయ్‌గా, క్యాటరింగ్ బాయ్‌గా, రైస్‌మిల్లు నైట్ షిఫ్ట్ చేస్తూ సొంత ఖర్చులు సమకూర్చుకున్నారు. అంతేకాకుండా తనకు సాహిత్యంపై ఉన్న మక్కువతో కవితలు, వ్యాసాలు రాస్తుండేవాడు. ట్రావెలింగ్, ఫొటోగ్రఫీ అభిరుచి ఏర్పర్చుకొని సినిమాల్లో ప్రవేశం దొరకబుచ్చుకున్నారు.
చదువుకునే రోజుల్లోనే సాహిత్యంపై ఆసక్తి..
తెలుగు యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీల్లో అరవింద్ చదువు కొనసాగింది. తమ గ్రామం నుంచి యూనివర్సిటీకి వచ్చిన మొదటితరం విద్యార్థి అరవిందే కావడం విశేషం. మాస్ కమ్యూనికేషన్ చదువుతూనే వార, మాస పత్రికలు నడిపారు. చిన్నతనంలో పేపర్‌బాయ్‌గా పనిచేయడం వల్ల సాహిత్య పఠనం అలవడింది. అనేక సామాజిక, సాహిత్య అంశాలను స్పృశిస్తూ కవితలు, వ్యాసాలు రాశారు.
సాహిత్య ప్రచారం..
కథ, కవిత్వం, నవలలు విరివిగా చదవటం.. చదివిన పుస్తకాలను నలుగురికీ పంచడం అవసరమని భావించిన అరవింద్ ‘ఆలోచనా’ అనే సంస్థ ద్వారా గ్రామీణ, పట్టణ విద్యార్థులకు చిట్టిపొట్టి జానపద కథల నుంచి దేశభక్తుల జీవితచరిత్ర వరకు పరిచయం చేయడం, చదివించడం చేశారు. హైదరాబాద్ నగరంలోని యూనివర్సిటీల్లో స్టడీ సర్కిల్స్ నిర్వహణ, పుస్తకాలు, సినిమాలు, ఆర్ట్స్ పై సదస్సులు, సభలు నిర్వహించేవారు. దక్షిణ భారతదేశం మొత్తం యాత్రలు చేయడంతో ఫొటోగ్రఫీపై అభిరుచి ఏర్పడింది. ఆయా ప్రాంతాల సంస్కృతి, వైవిధ్యం, ఆర్కిటెక్చర్‌ను కెమెరాల్లో బంధించి వాటిని యూనివర్సిటీల్లో, పట్టణాల్లో ప్రదర్శించారు.
జాతిరత్నాలు డైరెక్టర్‌తో సినిమా రంగంలోకి...
జాతిరత్నాలు సినిమా డైరెక్టర్ అనుదీప్ కేవీతో అరవింద్‌కు ఏర్పడిన పరిచయం స్నేహం మారడంతో ఆయనకు సినిమాల్లోకి ప్రవేశం దొరికింది. ఆయన కథలను చర్చిస్తుండటం.. రాస్తుండటంతో అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ప్రిన్స్ సినిమాకు రచన విభాగంలో పనిచేయడం వలన రచన నైపుణ్యాన్ని అరవింద్ నేర్చుకున్నారు.
కుబేర విజయాన్ని ఆస్వాదిస్తున్నా
కుబేర సినిమా మొదలవుతుంది అనుకున్న రెండు నెలల ముందు శేఖర్ కమ్ముల గారు నన్ను పిలిచారు. మొదట ఇంటర్న్‌షిప్‌గా జాయిన్ అయ్యాను. నాకు ట్రావెలింగ్ చేసిన అనుభవం ఉండడంతో ఈ సినిమా కథకు ముంబై దగ్గర్లలో లొకేషన్స్ వెతికి పెట్టే పని అప్పగించారు. ఈ క్రమంలో ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌కి ఇన్‌చార్జిగా నియమించారు. తోట తరణి వంటి ఆర్ట్ డైరెక్టర్‌తో శేఖర్ కమ్ముల నేతృత్వంలో పనిచేయడం జీవితంలో మరిచిపోలేని మైలురాయి. డైరెక్టర్ విజన్, ప్రొడక్షన్ డిజైనర్ విజువల్ సెట్‌లో ప్రతిబింబించడానికి నిద్రాహారాలు పక్కనపెట్టి పనిచేశా. అయినా కష్టం అనిపించలేదు. ఆర్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంద్రాణితో సమన్వయంలో ఉండటం వలన టీంతో రాత్రి, పగలు ఆడుతూ పాడుతూ షూటింగ్ కంప్లీట్ చేశాం. కుబేర సినిమా విజయాన్ని నేను, మా టీం సభ్యులు ఆస్వాదిస్తున్నాం.
– మేడారం అరవింద్, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్