హ్యపీ బర్త్‌డే రియల్‌ హీరో ‘సోనూ సూద్‌’..

Special Article On Sonu Sood Birthday - Sakshi

సాయం చేయాలన్న తపన, మంచి మనసు ఉంటే చాలు.. ఎలాగైనా సాయం చేయవచ్చని నిరూపించాడు బాలీవుడ్‌ రియల్‌ హీరో సోనూ సూద్‌. చేసేది విలన్‌ పాత్రలైనప్పటికీ ప్రజల్లో రియల్‌ హీరోగా నిలిచాడు. లాక్‌డౌన్‌లో వేలాదిమంది వలస కూలీలకు ప్రత్యేక బస్సులు, రైళ్లు ఏర్పాటు చేసి ఇళ్లకు చేర్చి ఆపద్భాందవుడయ్యాడు. నిజానికి సాయం కావాలి అని అర్థించిన ప్రతి ఒక్కరికి సోనూ సూద్‌ సహాయం అందిస్తున్నాడు. దీంతో లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ తన దాన సేవలను ఇంకా కొనసాగిస్తున్నాడు. అందరి మన్ననలు పొందుతున్న సోనూ సూద్‌ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ రోజుతో ఆయన 47వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా సోనూ సూద్‌కు అశేష అభిమానులు, సెలబ్రిటీల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. (సోనూ సూద్‌ క్రేజ్‌; చిరు సినిమాలో ముఖ్యపాత్ర)

కాగా సోనూ సూద్‌ జూలై 30,1973లో పంజాబ్‌లో జన్మించారు. తండ్రి శక్తి సాగర్‌ సూద్‌ వ్యాపారవేత్త. తల్లి ఉపాద్యాయిని. సోనూ సోదరి మోనికా ప్రస్తుతం సైంటిస్టుగా పనిచేస్తున్నారు. సోనాలిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. 1999లో కలాగర్ అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మూడు సంవత్సరాలకు బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. తెలుగులో అరుంధతి సినిమాలో సోనూ సూద్ నటన ఆయనకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. తన పాత్రలతో మనందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని రియల్‌ లైఫ్‌ హీరో అనిపించుకున్నారు. కేవలం అభినయంతోనే కాకుండా గొప్ప నటన నైపుణ్యాలతో అందరిని అకట్టుకున్న సోనూ సూద్‌ నటించిన కొన్ని బాలీవుడ్‌ చిత్రాలను ఇప్పుడు చూద్ధాం. (ఆస్పత్రిలో నటుడు.. ఆర్థిక సాయం కావాలంటూ..)

1. ఎంటర్‌టైన్‌మెంట్‌: ఈ సినిమాలో సౌత్‌, బాలీవుడ్ ఫేమ్ ప్రకాష్ రాజ్, అక్షయ్‌ కుమార్‌ నటించినప్పటికీ.. సోనూ తన డైలాగ్స్‌తో స్క్రీన్ మీద తన మార్కును క్రియోట్‌ చేశారు.

2. దబాంగ్ : ‘దబాంగ్' చిత్రంలో విలన్ పాత్రకు మంచి ఆదరణ లభించింది. అతని బాడీబిల్డింగ్ చాలా చర్చనీయాంశమైంది. ఈ చిత్రంలో చెడి సింగ్ పాత్రకు వందశాతం న్యాయం చేశారు సోనూసూద్‌.

3. సింగ్ ఈజ్ కింగ్ : సింగ్ ఈజ్ కింగ్ చిత్రానికి బలవంతుడైన విలన్ అయిన లఖన్ సింగ్‌ పాత్రలో మెప్పించారు. ఈ చిత్రంలో కామెడీ చేయడంలో కూడా సోను తన ప్రతిభను కనబర్చారు.

4. ఆర్ రాజ్‌కుమార్: ఆర్ రాజ్‌కుమార్‌లో షాహిద్ కపూర్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో కనిపించారు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోనూ సూద్‌ విలన్ శివరాజ్ గుజ్జర్ పాత్రలో అద్భుతంగా మెప్పించారు

5. సింబా: విలన్ పాత్రలో సోను సూద్ చివరిగా విడుదలైనది రణవీర్ సింగ్‌తో చేసిన సింబా. ఇందులో ధ్రువ్ రనాడే పాత్రను పోషించాడు, అతని ప్రశాంతమైన ముఖం, స్వరంతో  వెన్నెముకలో వణుకు పుట్టించేలా పాత్ర పోషించాడు.

కాగా గురువారం (జులై 30) తన పుట్టినరోజు సందర్భంగా తన జీవితంలో ఒక ప్రత్యేక రోజుగా మార్చుకోవాలని సోనూ సూద్ చూస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ హెల్త్ క్యాంప్‌ల ద్వారా 50 వేల మందికి సేవలు అందించనున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ వైద్య శిబిరాలను నిర్వహించేందుకు గ్రామ సర్పంచ్‌లు, కార్యదర్శులతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి ప్రణాళికతో ముందుకు కదులుతున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించబోతున్నట్లుగా, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, ఒడియా రాష్ట్రాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడానికి అక్కడి డాక్టర్లతో మాట్లాడుతున్నట్లు సోను సూద్ తెలిపారు. (సోనూ సూద్ వెనుక సోనాలి పాత్ర)
 

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top