ఈ ఏడాదిలో తొలి సినిమాతోనే హిట్‌ కొట్టిన కొత్త డైరెక్టర్లు | Sakshi
Sakshi News home page

ఈ ఏడాదిలో తొలి సినిమాతోనే హిట్‌ కొట్టిన కొత్త డైరెక్టర్లు

Published Sun, Dec 10 2023 1:57 PM

 South Indian Debutant Directors And Their Must Watch Movies In 2023 - Sakshi

ఈ ఏడాది సినిమా డైరీ చివరి పేజీలకు చేరుకుంది. ప్రతి ఏడాది మాదిరే ఈసారి కూడా కొత్త దర్శకులు బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపారు.  ఈ ఏడాదలో ఎక్కువగా  చిన్న చిత్రాలే మెప్పించాయి.  ఏడాది తెరపై తొలి సినిమాతోనే విజయం సాధించిన డైరెక్టర్లు ఉన్నారు. నేడు ఓటీటీలు యుగం నడుస్తోంది. దీంతో తెలుగు సినిమాలతో పాటు పర భాష చిత్రాలను కూడా ప్రేక్షకులు చూస్తున్నారు.

అలా సౌత్‌ ఇండియా చిత్ర పరిశ్రమలో 2023లో పరిచయం అయిన కొత్త కెప్టెన్లు ఎవరో తెలుసుకుందాం పదండి. మారుతున్న సినీప్రియుల అభిరుచికి తగ్గట్లుగా వైవిధ్యమైన కథలతో వినోదాలు వడ్డించడంలో కొత్త దర్శకులు ఎప్పుడూ ముందే ఉంటారు. అందుకే కొత్త ప్రతిభ తెరపై మెరుస్తుందంటే చాలు.. సినీప్రియులంతా వారి వైపు ఓ కన్నేస్తుంటారు. అలా ఈ ఏడాది మొదటి సినిమాతో హిట్‌ కొట్టిన దర్శకులు ఎవరో తెలుసుకోండి.

దసరా- శ్రీకాంత్‌ ఓదెల
నేచురల్‌ స్టార్‌ నాని- కీర్తి సురేష్‌ జోడిగా నటించిన చిత్రం దసరా... శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 2023 మార్చి 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలంగాణలోని ఓ పల్లెలో జరిగిన కథతో రూపొందిన ఈ సినిమా మార్చి 30న థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నాని కెరీర్‌లోని హిట్‌ సినిమాల లిస్ట్‌లో చేరింది.

నాన్నకు ప్రేమతో, రంగస్థలం చిత్రాలకు డైరెక్టర్‌ సుకుమార్‌ టీమ్‌లో శ్రీకాంత్‌ ఓదెల పనిచేశాడు. అదే సమయంలో దసరా కథను రెడీ చేసిన శ్రీకాంత్‌.. నిర్మాత సుధాకర్‌ చెరుకూరికి వినిపించడం ఆపై అది కాస్త నానికి నచ్చడం చకచక పనులు జరిగిపోయాయి. అలా మొదటి చిత్రంతోనే పాన్‌ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేశాడు శ్రీకాంత్‌. దసరా చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. 

హాయ్‌ నాన్న- శౌర్యువ్‌ 
నాని సినిమాలతో కొత్త దర్శకులు వెలుగులోకి వస్తుంటారు. ఇదే ఏడాది రెండోసారి కూడా కొత్త డైరెక్టర్‌ శౌర్యువ్‌కు నాని అవకాశాన్ని కల్పించాడు. అలా భారీ అంచనాలతో నాని హీరోగా శౌర్యువ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. మృణాల్‌ ఠాకూర్‌ ఇందులో హీరోయిన్‌గా నటించగా శ్రుతి హాసన్‌ , బేబీ కియారా కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్‌ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం దూసుకుపోతుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌కు చెందిన శౌర్యువ్‌.. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు. రాజమౌళి సినిమాలు చూస్తూనే డైరెక్షన్‌ విభాగంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఆయన  చెప్పాడు. హాయ్‌ నాన్న కథ విషయానికొస్తే.. సాధారణంగా పిల్లల బాధ్యతలు తల్లిదండ్రులు ఇద్దరూ చూసుకుంటారు.

కానీ, సింగిల్ పెరెంట్‌ అయితే పూర్తి బాధ్యత ఒకరే చూసుకోవాలి. ఇందులో నాని పాత్ర అలానే ఉంటుంది. ఎక్కడ ఉన్నా సమయానికి కూతురు దగ్గర ఉంటాడు. కథ అంతా ఇలానే సాగుతుంది. శౌర్యువ్‌ వద్ద  ప్రస్తుతం కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయని. త్వరలో వాటి గురించి చెబుతానని ఆయన ప్రకటించాడు.

రోమాంచమ్‌-  జీతూ మాధవన్‌ (మలయాళం,తెలుగు)
కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కువగా మలయాళంలో వస్తుంటాయి. ఈ మధ్య తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా మలయాళం, తమిళ చిత్రాలను ఆదరిస్తున్నారు. ఓటీటీల పుణ్యామాని భాషతో సంబంధం లేకుండా మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే రోమాంచమ్‌ సినిమా కూడా హిట్‌ కొట్టింది. ఈ చిత్రం ద్వారానే జీతూ మాధవన్‌ డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే ఆయన పేరు దేశ వ్యాప్తంగా తెలిసేలా చేసింది. ఫిబ్రవరి 3న మలయాళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టయింది.

కామెడీ, హారర్‌.. రెండూ పూర్తి భిన్నమైన నేపథ్యాలతో  మంచి వినోదాన్ని  పండించాడు డైరెక్టర్‌ జీతూ..  ఓయిజా బోర్డుతో ఆట ఆడడం వల్ల 2007లో బెంగళూరులోని ఓ ఇంట్లో ఉన్న ఏడుగురు స్నేహితులు ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నారనేదే ఈ సినిమా సారాంశం. ప్రస్తుతం డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. 

దాదా- గణేష్ కె. బాబు (తమిళ్‌)
కోలీవుడ్‌లో కెవిన్ హీరోగా న‌టించిన త‌మిళ మూవీ దాదా.. ఈ సినిమా బిగ్ హిట్‌గా నిలిచింది. దాదాపు మూడు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 22 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఇదే ఏడాదిలో ఫిబ్రవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గణేష్ కె. బాబు డైరెక్టర్‌గా దాదా చిత్రం ద్వారానే పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఇద్దరు ప్రేమికులు పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకుని ఆపై వారిద్దరి మధ్య జరిగిన సంఘర్షణలో వారికి జన్మించిన బిడ్డ తండ్రి వద్దే ఉండిపోతాడు. సుమారు కొన్నేళ్ల తర్వాత ఆ బిడ్డ తల్లి వద్దకు ఎలా చేరిందనేది ఈ చిత్రం.

తండ్రి గొప్ప‌త‌నంతో రూపొందిన రొమాంటిక్ ఎమోష‌న‌ల్ డ్రామాగా దీనికి మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాను డైరెక్టర్‌ గ‌ణేష్ కే బాబు చాలా చక్కగా తెరకెక్కించాడు. చిన్న సినిమా అయినా దాదా కథ నచ్చి త‌మిళంలో ఉధ‌య‌నిధి స్టాలిన్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అప‌ర్ణ దాస్ హీరోయిన్‌గా న‌టించింది. అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తెలుగు వెర్ష‌న్‌కు పా..పా అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు మేకర్స్‌. త్వరలో విడుదల కానుంది.

బాయ్స్‌ హాస్టల్‌-  నితిన్‌ కృష్ణమూర్తి (కన్నడ,తెలుగు)
కన్నడలో ఘనవిజయం సాధించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘హాస్టల్‌ హుడుగారు బేకగిద్దరే’. తెలుగులో ‘బాయ్స్‌ హాస్టల్‌’ పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్‌, చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌ సంస్థలు విడుదల చేశాయి. నితిన్‌ కృష్ణమూర్తి దర్శకుడిగా ఈ చిత్రంతో ఇండస్ట్రీకి  పరిచయం అయ్యాడు. ప్రజ్వల్‌, మంజునాథ్‌ నాయక, రాకేష్‌ రాజ్‌కుమార్‌, శ్రీవత్స, తేజస్‌ జయన్న ప్రధాన పాత్రలు పోషించగా.. రిషబ్‌ శెట్టి, రష్మీ గౌతమ్‌, తరుణ్‌భాస్కర్‌ అతిధి పాత్రల్లో నటించారు.

ఆగస్టు 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  చాలా సరదాగా, అల్లరిచిల్లరగా గడిపే ఓ బాయ్స్‌ హాస్టల్‌లోని కుర్రాళ్లకు ఆ హాస్టల్‌ వార్డెన్‌ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడంతో పెద్ద సమస్య ఎదురవుతుంది. ఆ చావును కుర్రాళ్లు యాక్సిడెంట్‌గా మార్చే క్రమంలో ఎదురైన సంఘటనలు ఎంతో సరదాగా ఉంటాయి.

 
Advertisement
 
Advertisement