
బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. విద్య, వైద్యం, ఇతర అవసరాల కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు ఆయన తరచూ సాయం చేస్తుంటారనే విషయం తెలిసిందే. 'సూద్ ఛారిటీ ఫౌండేషన్' పేరుతో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం వంటి ఎన్నో మంచి పనులు ఆయన చేస్తుంటారు. రైతులు, విద్యార్థులు, వైద్యం, దుస్తులు, ఆహారం ఇలా ఒక్కటేంటి లెక్కలేనన్ని సామాజిక సాయం చేయడంలో ఆయన ముందుంటారు. అయితే, తాజాగా వృద్ధులకు ఆశ్రయం కల్పించేందుకు సోనూ గొప్ప మనసు చాటుకున్నారు.
జులై 30న సోనూసూద్ 52వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ఏదో ఒకటి చేయాలని ఆయన ముందుకు వచ్చారు. 500 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తూ వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తన సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి రాష్ట్రంలో వృద్ధాశ్రమంతో పాటు ఉచిత పాఠశాలలు ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని పెట్టకున్నట్లు ప్రకటించారు.
వృద్ధులు ఒంటరిగా ఉండకుండా, ప్రేమతో, గౌరవంతో జీవించేందుకు వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఆశ్రమాల్లో ఆరోగ్య సంరక్షణతో పాటు మంచి ఆహారం ఆపై చివరి రోజుల్లో వారికి మానసిక శాంతి కల్పించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. అందుకు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. అయితే, ఎక్కడ నిర్మించనున్నారనేది ఆయన తెలుపలేదు. తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాశ్రమం నిర్మించనున్నట్లు గతంలో ఆయన ఒకసారి ప్రకటించారు.