బోయపాటిని వెంటాడుతున్న సెంటిమెంట్‌.. ‘స్కంద’పరీక్షలో పాస్‌ అవుతాడా?

Skanda Movie Director Boyapati Srinu To Faces These Sentiment - Sakshi

టాలీవుడ్‌లో ఊరమాస్‌ డైరెక్టర్‌ అనగానే అందరికి గుర్తొచ్చే పేరు బోయపాటి శ్రీను. నేల టికెట్‌ ఆడియన్స్‌కి నచ్చేలా.. వాళ్లను మెప్పించేలా భారీ మాస్‌ మూవీస్‌ని తెరకెక్కిస్తున్న ఏకైక తెలుగు దర్శకుడు. బోయపాటి కెరీర్‌లో ఇప్పటికి వరకు 9 సినిమాలు తెరకెక్కిస్తే.. అందులో 6 బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచాయి. ఇది ఆషామాషీ విషయం కాదు. కెరీర్‌ ప్రారంభంలోనే హ్యాట్రిక్‌ విక్టరీ సాధించిన అతికొద్ది మంది దర్శకుల్లో బోయపాటి ఒకరు. అయితే బోయపాటిని మాత్రం ఒక సెంటిమెంట్‌ బాగా పట్టి పీడిస్తోంది. 

ఆరు విక్టరీలు కానీ.. 
బోయపాటి కెరీర్‌లో ఇప్పటి వరకు తొమ్మిది సినిమాలు తెరకెక్కిస్తే.. వాటిలో ఆరు సీనియర్‌ హీరోలు నటించినవే. అవి మాత్రమే బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించాయి. బోయపాటి తొలి చిత్రం భద్ర. రవితేజ హీరోగా నటించాడు. 2005 రిలీజైన ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత వెంకటేశ్‌తో తులసి(2007) చిత్రం తెరకెక్కించాడు. అది బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. 2010లో బాలయ్యతో సింహా తెరకెక్కించగా.. అది రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టింది. ఇలా వరుస హ్యాట్రిక్‌ విజయాలు అందుకున్న బోయపాటి.. తన నాలుగో చిత్రం ‘దమ్ము’ని ఎన్టీఆర్‌తో చేశాడు. 2012లో వచ్చిన ఆ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌గా నిలిచింది.

 రెండేళ్ల గ్యాప్‌ తర్వాత మళ్లీ బాలయ్యతో ‘లెజెండ్‌’ తీస్తే.. అది సూపర్‌ హిట్‌గా నిలిచింది. అదే జోష్‌లో అల్లు అర్జున్‌తో ‘సరైనోడు’ తెరకెక్కించాడు. 2016లో రిలీజ్‌ అయిన ఈ చిత్రం అల్లు అర్జున్‌ని రూ. 100 కోట్ల క్లబ్‌లో చేర్చింది. ఇక 2017లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో జయ జానకి నాయక చిత్రాన్ని తెరకెక్కించగా.. అది బాక్సాపీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడింది. రెండేళ్ల గ్యాప్‌ తర్వాత రామ్‌ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ చిత్రం చేయగా.. అది కూడా ఫ్లాప్‌ అయింది. దీంతో మళ్లీ బాలయ్యతో మూవీ చేశాడు. 2021లో రిలీజైన అఖండ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. 

స్కంద పరీక్షలో పాస్ అవుతాడా ?
బోయపాటి కెరీర్‌లో హిట్‌ అయిన చిత్రాలన్నీ సీనియర్‌ హీరోలవే. బాలయ్యకు మూడు(సింహా, లెజెండ్‌, అఖండ), రవితేజ, వెంకటేశ్‌లకు ఒక్కొక్క(భద్ర, తులసి) హిట్‌ అందించాడు. అలాగే సరైనోడుతో అల్లు అర్జున్‌కి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందించాడు. బన్నీ మినహా యంగ్‌ హీరోలతో చేసిన సినిమాలేవి విజయం సాధించలేదు. రామ్‌ చరణ్‌తో వినయ విధేయ రామ తెరకెక్కిస్తే..అది డిజాస్టర్‌ అయింది.

అలాగే మరో యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘జయ జానకి నాయక’ తీస్తే..అది కూడా దారుణంగా బోల్తా పడింది. చాలా కాలం తర్వాత మరో యంగ్‌ హీరో రామ్‌ పోతినేనితో బోయపాటి సినిమా తీశాడు. మరి ఈ సారి అయినా బోయపాటి ఆ సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేస్తాడా? స్కంద పరీక్షలో పాస్‌ అయి..తనపై పడిన ముద్రను తొలగింటాడో..లేదో  ఈ నెల 28న తెలుస్తుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top