
సాక్షి, విజయనగరం: సప్తస్వర మాంత్రికుడు ఇకలేరన్న విషయం సాహితీలోకానికి తీరనిశోకాన్ని మిగిల్చింది. విద్యలనగరమైన విజయనగరం వచ్చినప్పుడల్లా సాంస్కృతిక నగరంలో అడుగుపెట్టడం తన అదృష్టమంటూనే మాటలను ప్రారంభించేవారు. గురజాడ నడయాడిన నేలపై, వందల ఏళ్లనాటి చరిత్ర కలిగిన సంగీత, నృత్య కళాశాలలో విద్యనేర్చుకున్న ఘంటసాల, సుశీలమ్మలను గుర్తుచేసుకుంటూనే తన ప్రసంగాన్ని జిల్లా వాసులకు అందించేవారు.
ఆయన సాహిత్యం నుంచి జాలువారే ప్రతీ పాట ఓ అద్భుతమే. అటువంటి సాహితీ దిగ్గజాన్ని కోల్పోవడం విజయనగర సాహిత్యాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో గడిపిన క్షణాలను నెమరువేసుకుంటూ ఆయన మృతికి నివాళులర్పిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నారు. యాదృచ్ఛికంగా మహాకవి వర్ధంతిరోజునే పాటలబాటసారి అస్తమయం కావడం సాహిత్యలోకాన్ని విషాదంలో ముంచింది.
విజయనగరమంటే అమితమైన ప్రేమ..
విశాఖ జిల్లా అనకాపల్లిలో జన్మించిన సిరివెన్నెలకు విద్యలనగరమైన విజయనగరమంటే ఎంతో ఇష్టం. సరిగ్గా నేటికి మూడేళ్ల కిందట 2018లో గురజాడ వర్ధంతిని పురస్కరించుకుని ఆనందగజపతి ఆడిటోరియంలో గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో దర్శకులు క్రిష్‌కు గురజాడ పురస్కారాన్ని సమర్పించే సందర్భంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రధానవక్తగా పాల్గొని అద్భుతమైన ప్రసంగంతో ఆహుతులను ఆకట్టుకున్నారు. 2017లో ఎస్.కన్వెన్షన్‌లో జరిగిన రోటరీ 60 వసంతాల వేడుకలో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.
బాధాకరం
సాహితీ సౌరభం నేలరాలింది. ఆయన రచనలు అజరామరం. ఏ నోట విన్నా ఆయన రాసిన పాటలే. మంచి మనిషిగా, పాటల మాంత్రికునిగా పేరుగాంచి ఎన్నో అవార్డులు పొందిన వెన్నెల అస్తమయం అయిందన్న విషయం బాధాకరం. ఆయన కుమార్తె వివాహానికి విజయనగరంలో పరిచయమున్న బుచ్చిబాబు, ఉసిరికల చంద్రశేఖర్, కాపుగంటి ప్రకాష్, అశోక్ మందాకిని, గంటి మురళీ తదితరులను స్వయంగా ఆహ్వానించారు. గురజాడ సమాఖ్య తరఫున ఆయనకు అంజలిఘటిస్తున్నాం.
– కాపుగంటి ప్రకాష్, ప్రధాన కార్యదర్శి, గురజాడ సాంస్కృతిక సమాఖ్య,విజయనగరం