
సిత్తరాల సిరపడు, దిమాక్ ఖరాబ్.. వంటి పాటలతో సెన్సేషన్ అయ్యాడు సింగర్ సాకేత్ (Singer Saketh Komanduri). ఎప్పుడూ చలాకీగా ఉంటూ, హుషారుగా పాటలు పాడే సాకేత్‌కు గతంలో పెద్ద యాక్సిడెంట్ జరిగింది. చావు అంచుల వరకు వెళ్లి వచ్చానంటూ ఆనాటి విషయాలు గుర్తు చేసుకున్నాడు. సింగర్ సాకేత్ మాట్లాడుతూ.. శ్రీరామనవమిరోజు భద్రాచలంలో ఓ షోకి వెళ్లినప్పుడు పట్టపగలే రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. ఓ ఆయిల్ ట్యాంకర్ ఇండికేటర్ వేయకుండా సడన్‌గా టర్న్ తీసుకుంది.
యాక్సిడెంట్
దాన్ని తప్పించుకోవడానికి మా కారుని కుడివైపు తిప్పాం. హమ్మయ్య అనుకునేలోపు ఎదురుగా మరో కారు వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చెల్లి కాలు ఫ్రాక్చర్ అయింది, నా వెన్నెముకకు బలమైన గాయం తగిలింది. అక్కడ దగ్గర్లో ఆస్పత్రికి వెళ్తే నా కండీషన్ చూసి హైదరాబాద్ తీసుకెళ్లమన్నారు. పక్షవాతం కూడా రావొచ్చేమోనని చెప్పారు. సింగర్ శ్రీకృష్ణ అన్నకు ఫోన్ చేసి.. మా ఇద్దరికీ యాక్సిడెంట్ అయింది, రాలేము. వేరే సింగర్స్‌ను షోకి పంపించమన్నాను.
తమన్ నా వెంటే ఉండి..
ఆయన ఉన్నచోట ఉండక తన పక్కనే ఉన్న తమన్‌కు విషయం చెప్పాడు. వెంటనే అతడు తన కంపోజింగ్ మధ్యలో ఆపేసి ఆస్పత్రికి వచ్చారు. హాస్పిటల్‌లో తనే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. ఎటువంటి సమస్యా లేదన్న తర్వాత రాత్రి 10.30 గంటలకు వెళ్లిపోయారు. డిశ్చార్జ్ అయ్యాక కూడా వారంరోజులపాటు బెడ్‌పైనే ఉన్నాను. లేచి నిలబడలేకపోయాను. అప్పుడు నాకు పెద్ద హోటల్ నుంచి కొన్నిరోజులపాటు కిచిడీ తెప్పించారు.
బిగ్‌బాస్‌కి వెళ్తా..
మనసు బాగోలేదని చెప్తే ఐదు నిమిషాల్లో గోవా టికెట్లు బుక్ చేశారు. వీల్‌చైర్‌లోనే గోవా వెళ్లాను. బీచ్ చూసుకుంటూ కొంత ప్రశాంతంగా గడిపాను. అందుకే తమన్ అంటే నాకు అభిమానం, ఇష్టం అని పేర్కొన్నాడు. ఇక బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్‌లో ఎంట్రీ ఇస్తున్నావా? అన్న ప్రశ్నకు ఇలా స్పందించాడు. వెళ్లను అని చెప్పను, వెళ్తున్నా అని కూడా చెప్పను. ప్రస్తుతానికైతే బిగ్‌బాస్ 9వ సీజన్‌కు వెళ్లడం లేదు. కానీ, ఎప్పుడో ఒకసారి తప్పకుండా వెళ్తా.. కెరీర్‌లో ఇంకో అడుగు ముందుకు వేశాక బిగ్‌బాస్ గురించి ఆలోచిస్తాను అని సింగర్ సాకేత్ చెప్పుకొచ్చాడు.
చదవండి: రైలు కింద పడేందుకు ట్రై చేసిన హీరోయిన్.. కాపాడిందెవరంటే?