ఈ మధ్య సంగీత కచేరీకి ప్రాధాన్యత పెరిగింది. స్టార్ సింగర్స్ అంతా.. మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహిస్తుండడంతో.. మ్యూజిక్ లవర్స్ ఆ ఈవెంట్ కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం లైవ్ కాన్సర్ట్ అని చెప్పి..రికార్డింగ్ పాటను ప్లే చేయడం ఇప్పుడు సంగీత ప్రియులను ఆగ్రహానికి గురి చేస్తుంది. తాజాగా ధురంధర్ సింగర్ జాస్మిన్ సాండ్లాస్ కూడా బ్యాగ్రౌండ్‌లో ప్లే అవుతున్న పాటకు లిప్ సింక్ ఇచ్చి.. లైవ్‌లో పాడుతున్నట్లుగా మోసం చేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటుంది.
లైవ్ కాన్సర్ట్ కానీ..
ధురంధర్ సినిమా రిలీజ్ తర్వాత సింగర్ జాస్మిన్ సాండ్లాస్ మరింత ఫేమస్ అయ్యాడు. ఆ సినిమాలో ఆమె ఆలపించిన షరారత్, మై ఔర్ తూ, ఆరీ ఆరీ పాటలు సూపర్ హిట్ అవ్వడం.. సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడంతో జాస్మిన్ పేరు మారుమోగిపోయింది. ఆ ఫేమ్‌ని సొమ్ము చేసుకునేందుకు జాస్మిన్ రెడీ అయింది. అందులో భాగంగా ఏప్రిల్ 19న గుజరాత్‌లోని ఆహ్మదాబాద్‌లో సంగీత కచేరి నిర్వహించింది. ధురంధర్ సింగర్ మ్యూజిక్ కాన్సర్ట్ అని తెలియడంతో వందలాది మంది సంగీత ప్రియులు వేలాది రూపాయలు ఖర్చు చేసి ఈవెంట్‌కి వెళ్లారు. జాస్మిన్ కూడా వారిని నిరాశపరచకుండా తన పాటలతో మంత్రముగ్ధుల్ని చేసింది.
పాడడం కోసమా లేదా యాక్టింగ్ కోసమా?
ఈవెంట్‌కి వచ్చినవారిని మరింత ఉత్సాహపరిచేందుకు ధురంధర్ పాటను ఆలపిస్తూ..తలపై నీళ్లు పోసుకుంది. అంతేకాదు పాటతో పాటు డ్యాన్స్ కూడా చేసి అలరించింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అయింది. అయితే ఆ వీడియో క్లిప్ పరిశీలిస్తే.. జాస్మిన్ పాట పాడలేదు. బ్యాగ్రౌండ్‌లో ప్లే అవుతున్న పాటకి పెదాలను కదిపారు అంతే. ఇది గమనించిన నెటిజన్స్ ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. దీంతో పాటు తలపై నీళ్లు పోసుకోవడాన్ని కూడా తప్పుపడుతున్నారు. ‘లైవ్ కాన్సర్ట్ అని చెబుతారు.. కానీ లైవ్‌లో పాట పాడరు’, ‘ఆమెను పాట పాడడానికి పిలిపించారా లేదా నటించడానికి పిలిపించారా?’, ‘తలపై పోసుకున్న నీళ్లు సరిపోలేదు..ఇంకో బకెట్ నీళ్లు పోసుకోవాల్సింది’అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.


