చిరంజీవితో సినిమా ఛాన్స్‌.. ఎందుకు నో చెప్పానంటే: సిద్ధు జొన్నలగడ్డ | Siddu Jonnalagadda Rejected Chiranjeevi Movie Due To This Reason | Sakshi
Sakshi News home page

చిరంజీవితో సినిమా ఛాన్స్‌.. ఎందుకు కాదన్నాడో తొలిసారి చెప్పిన సిద్ధు

Published Mon, Apr 1 2024 11:47 AM | Last Updated on Mon, Apr 1 2024 12:03 PM

Siddu Jonnalagadda Rejected Chiranjeevi Movie This Reason - Sakshi

సిద్ధు జొన్నలగడ్డ , అనుపమ పరమేశ్వరన్‌  జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’. ‘డీజే టిల్లు’ చిత్రానిక సీక్వెల్‌గా మార్చి 29న విడుదలైంది. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కథ, మాటలు సిద్ధు జొన్నలగడ్డ అందించడం విశేషం. కేవలం రెండు రోజుల్లోనే రూ. 45 కోట్ల గ్రాస్‌ను రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. హిట్‌ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం అని చెప్పవచ్చు.

యూత్‌లో మంచి క్రేజ్‌ ఉన్న సిద్ధూకు మెగాస్టార్‌ చిరంజివితో కలిసి నటించే ఛాన్స్‌ వచ్చింది. కానీ దానిని సిద్ధూనే వద్దనుకున్నాడని గతంలో చాలానే వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఆయన ఎక్కడా ఇప్పటి వరకు రియాక్ట్‌ కాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తొలిసారి ఈ విషయంపై ఇలా స్పందించాడు. 'తెలుగు ఇండస్ట్రీలో నాకు బాగా నచ్చిన హీరో విక్టరీ వెంకటేష్‌ గారు.. ఆయనే నాకు ఆల్‌టైమ్ ఫేవరెట్‌. నా సినిమా కెరియర్‌పై ఆయన ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంది. ఇండస్ట్రీలో చిరంజీవి గారు, అమితాబ్‌ బచ్చన్‌ గారు, రజనీకాంత్‌ గారు ఇలా టాప్‌ లెజండరీ హీరోలతో కలిసి పని చేయాలని కోరిక నాకు కూడా ఉంది.

ఈ క్రమంలో చిరంజీవి గారితో కలిసి నటించే ఛాన్స్‌ వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల అది సెట్‌ కాలేదు. తెలుగు సినిమా పరిశ్రమ అంటే మొదటగా ఎవరికైనా గుర్తుకువచ్చే పేరు చిరంజీవి.. ఆయనొక సూపర్‌ హ్యూమన్‌ అలాంటి హీరోతో కలిసి నటించే అవకాశం వస్తే.. అది బెస్ట్‌ ప్రాజెక్ట్ కావాలనేది నా అభిప్రాయం. ఆ సినిమా మరో ప్రపంచాన్ని చూపించాలి. చిరంజీవిగారితో కలిసి పనిచేశానని భవిష్యత్‌లో నా పిల్లలకు గర్వంగా చెప్పుకునేలా ఉండాలి. అలాంటి ప్రాజెక్ట్‌ కోసం ఎదురుచూస్తున్నాను.

దేవుడి దయ ఉంటే చిరంజీవి గారితో అలాంటి అవకాశం వస్తుంది. ఈ క్రమంలో ఎవరో ఒకరు అందుకు తగిన కథను ఆయనకు తప్పకుండా అందిస్తారు. ఆ రోజు వస్తుంది అనుకుంటున్నాను. మెగాస్టార్‌ స్టార్‌డమ్‌కు సమానంగా సినిమా తీయడం అంత సులభమైన విషయం కాదు. అలాంటి ఛాన్స్‌ వస్తుందని ఎదురుచూస్తున్నాను.' అని ఆయన చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement