సినిమా హిట్టవగానే రెమ్యునరేషన్ అమాంతం పెంచేస్తుంటారు హీరోలు. కానీ శర్వానంద్ మాత్రం ఇకపై ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోనంటున్నాడు. కాకపోతే అన్ని సినిమాలకు కాదు! నిర్మాత అనిల్ సుంకరతో చేసే సినిమాలకు నయాపైసా వద్దని కరాఖండిగా తేల్చి చెప్పేశాడు.
హిట్టు కొట్టిన శర్వానంద్
శర్వానంద్-అనిల్ సుంకర కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం నారీ నారీ నడుమ మురారి. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలైంది. పెద్ద సినిమాల పోటీని తట్టుకుని మరీ సక్సెస్ సాధించింది. దీంతో గురువారం నాడు సంక్రాంతి విన్నర్ బ్లాక్‌బస్టర్ ఈవెంట్ పేరిట వేడుకలు జరిపారు.
రాసిపెట్టుకోండి
ఈ కార్యక్రమంలో శర్వానంద్ మాట్లాడుతూ.. శ్రీవిష్ణుగారు మంచితనంతో మా మూవీలో అతిథి పాత్ర చేశారు. మా ఇద్దరికీ మంచి కథ రాస్తే కలిసి సినిమా చేస్తాం. హిట్టు వచ్చింది కదా.. ఎలా ఫీలవుతున్నారు? అని అందరూ అడుగుతున్నారు. నాకు ఎలా ఫీల్ అవ్వాలో కూడా తెలియడం లేదు. కానీ, అందరూ నవ్వుతూ ఉంటే బాగుంది. ఈ సినిమా ఇక్కడితో ఆగిపోదు, ఇంకో నాలుగు వారాలు ఆడుతుంది. ఇది నా మాట.. రాసిపెట్టుకోండి. ఇప్పుడు థియేటర్లు పెంచాం. దీనంతటికి కారణమైన వ్యక్తి నిర్మాత అనిల్‌గారు.
ఒక్క రూపాయి తీసుకోను
థాంక్స్ చాలా చిన్న విషయం. కృతజ్ఞతలు చెప్పి మీ రుణం తీర్చుకోవాలనుకోవడం లేదు. హీరో- నిర్మాత కలిసుంటే ఏమవుతుందనేది మేము చూపిస్తాం. నెక్స్ట్ సినిమాకు అనిల్‌ను రూపాయి కూడా అడగనని మాటిస్తున్నా.. మా అనిల్‌గారు పెద్ద సినిమాలు చేసేవరకు ఒక్క రూపాయి కూడా ఆయన దగ్గర తీసుకోను. ఏడేళ్ల నుంచి కష్టపడుతున్నాం. హిట్టు విలువ ఏంటో మాకు బాగా తెలుసు. అలాంటి విజయాన్ని మీరు నాకిచ్చారు అని సంతోషం వ్యక్తం చేశాడు.
చదవండి: కుక్కలు, పిల్లులు, కోతులు పోతాయ్.. : రేణూ దేశాయ్ ఆవేదన


