ఆస్పత్రిలో భార్య.. షూటింగ్‌ ఆపేయమన్న షారుక్‌: అట్లీ | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో భార్య.. షూటింగ్‌ ఆపేయమన్న షారుక్‌ ..ఎమోషనల్‌ అయిన అట్లీ

Published Thu, Aug 31 2023 5:19 PM

Shah Rukh Khan React To Atlee and Wife Priya - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా షారుక్‌ ఖాన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం జవాన్. ఈ సినిమాను తమిళ హిట్‌ దర్శకుడు అట్లీ కుమార్‌ తెరకెక్కించాడు. దీంతో ఈ సినిమా కోసం బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. జవాన్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అని ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని లుక్‌లో ఈ సినిమాలో షారుక్‌ కనిపించనున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రంలో కథానాయిక. విజయ్ సేతుపతి విలన్ రోల్ పోషిస్తుండగా, దీపికా పదుకొణె కూడా ఈ సినిమాలో అతిధి పాత్రలో నటిస్తోంది. 

(ఇదీ చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతార ఎంట్రీ.. ఫాలో అయ్యేది ఆ ఐదుగురిని మాత్రమే)

దర్శకుడు శంకర్‌తో కో-డైరెక్టర్‌గా సినీ రంగ ప్రవేశం చేసిన అట్లీకి జవాన్‌  ఐదవ చిత్రం కానున్నడం విశేషం. 'రాజా రాణి'తో అట్లీ  దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాక దళపతి విజయ్‌తో వరుసగా మూడు చిత్రాలు థెరి, మెర్సల్, బిగిల్ భారీ విజయాలు సాధించాయి. దీని తర్వాత అట్లీ జవాన్‌ను ప్రకటించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో సెప్టెంబర్ 7న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో వేదికపై అట్లీ ప్రసంగం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.  

నటి ప్రియను వివాహం చేసుకున్న అట్లీ సుమారు ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. జవాన్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానున్న సమయంలో తన భార్య గర్భం దాల్చిన విషయాన్ని షారుక్ ఖాన్‌కు తెలిపినప్పుడు ఆయన ఎలా స్పందించాడో తాజాగ అట్లీ గుర్తుచేసుకున్నాడు.  'జవాన్ షూటింగ్‌ కోసం నేను అమెరికాకు చేరుకున్నాను. ఈలోపు తాను  గర్భం దాల్చినట్లు ప్రియా ఫోన్‌ చేసి తెలిపింది. ఎనిమిదేళ్ల తర్వాత గర్భం దాల్చినందున మూడు నెలల పాటు ప్రయాణం చేయవద్దని వైద్యులు సూచించారు. పూర్తిగా బెడ్‌ రెస్ట్‌ అన్నారు. అప్పటికి  ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి  మూడు రోజులే అయింది.

దీంతో ప్రియాను అమెరికాకు రమ్మని చెప్పలేకపోయాను ఏం చేయ్యాలో తెలియక ఈ విషయాన్ని షారుఖ్ ఖాన్‌కి చెప్పగా, వెంటనే షూటింగ్ ఆపేయమని, కొద్దిరోజులు వెయిట్ చేస్తానని చెప్పాడు. షారుక్‌ చెప్పిన మాటను ప్రియతో తెలుపగా.. షూటింగ్ ఆపవద్దని చెప్పడమే కాకుండా తన పనులు తానే చూసుకుంటానని చెప్పింది. అలాంటి కష్ట సమయంలో  కూడా సినిమా పనులపై దృష్టి పెట్టమని ఆమె నన్ను ప్రోత్సహించింది. ప్రియా అందించిన ఆ సహకారమే నా విజయ రహస్యం' అని వేదికపై అట్లీ అన్నారు.

తన కష్ట సమయంలో షారుక్‌ ఏంతో ధైర్యాన్ని ఇచ్చాడని, తండ్రి స్థానంలో షారుక్‌ ఎప్పుడూ తనవెంటే ఉన్నారని ఆట్లీ ఎమోషనల్‌ అయ్యాడు. సినిమా సక్సెస్‌, ఫెయిల్యూర్‌ గురించి ఆందోళన చెందనని అట్లీ తెలిపాడు. కాగా, గత జనవరిలో వీరికి మగబిడ్డ జన్మించాడు. అట్లీ, ప్రియా నవంబర్ 2014 లో వివాహం చేసుకున్నారు. ఇక అట్లీ భార్య  ప్రియా కొన్ని  తమిళ సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రియా నటించి తెలుగులో డబ్బింగ్ అయిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. నా పేరు శివ, యముడు లాంటి సినిమాల్లో ప్రియా నటించింది. 

Advertisement
 
Advertisement