మన దేశంలో వ్యాపార, రాజకీయాల్లోనే కాదు సినిమా రంగంలోనూ కొన్ని కుటుంబాల ఆధిపత్యం కొనసాగుతుంది. చాలా వరకు నటుల నుంచి నిర్మాతల వరకు, తమ కుటుంబ సభ్యులను సినీ పరిశ్రమలోకి తీసుకువచ్చి, వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ మాత్రమే కాదు మరే ఇతర భాషా చిత్ర పరిశ్రమలో అయినా వారసుల హవా ఎప్పుటి నుంచో నడుస్తుంది. అయితే ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా ఏడుగురు హీరోయిన్స్ వచ్చిన విషయం మీకు తెలుసా.? అంతేకాదు అదే కుటుంబం నుంచి ఒక దర్శకుడు, ఒక కెమెరామెన్ వచ్చి.. కొన్నేళ్ల పాటు తమిళ చిత్ర పరిశ్రమను శాసించారంటే మీరు నమ్ముతారా? ఇది నిజం. తమిళ సినిమాకు 'తొలి డ్రీమ్ గర్ల్'గా పేరొందిన 'టీఆర్ రాజకుమారి' కుటుంబమే దీనికి సాక్ష్యం.
ఈ అరుదైన సినీ వంశం గురించి తెలుసుకోవాలంటే, ముందుగా రాజకుమారి నాయనమ్మ గుజ్జలాంబాళ్ నుంచి ప్రారంభించాలి. ఆమె ఒక ప్రసిద్ధ కర్ణాటక గాయని, సంగీత ప్రపంచంలో ఆమెకు గొప్ప పేరుంది. తంజావూరు వారి స్వస్థలం. ఈ కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి వచ్చిన మొదటి వ్యక్తి ‘ఎస్పీఎల్ ధనలక్ష్మి’. 1935లో 'నేషనల్ మూవీ టోన్' అనే నిర్మాణ సంస్థ నిర్మించిన మొదటి చిత్రం 'పార్వతి కళ్యాణం'లో ధనలక్ష్మి హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత ఆమె సోదరి తమయంతి కూడా 1930వ దశకంలో కొన్ని చిత్రాలలో హీరోయిన్‌గా పని చేసింది. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడో హీరోయినే టీఆర్ రాజకుమారి.ఆమె అసలు పేరు రాజయ.

1930లలోప్రముఖ దర్శకుడు కె.సుబ్రమణ్యం ఎస్పీఎల్ ధనలక్ష్మిని కలవడానికి వెళ్లాడు. ఆ సమయంలో ధనలక్ష్మి సోదరి కుమార్తె రాజయ కూడా అక్కడే ఉంది. ఆ అమ్మాయిని చూసి వెంటనే తన సినిమాలో హీరోయిన్‌గా చేయమని సుబ్రమణ్యం అడిగారట. రాజయ పేరును రాజకుమారిగా మార్చి, తన చిత్రం 'కచ్ఛ దేవయాని' (1941)లో ఆమెను నటింపజేశాడు. తొలి చిత్రంతోనే తనదైన నటనతో ఆకట్టుకుంటుంది. దీంతో వరుస అవకాశాలు వచ్చాయి. అలా రాజకుమారి తమిళ సినిమాకు 'డ్రీమ్ గర్ల్'గా తిరుగులేని విజయం సాధించింది.
రాజకుమారి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన తర్వాత ఆమె ఫ్యామిలీ నుంచి మరికొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చాయి.వారిలో అత్యంత ముఖ్యమైన వారు టీఆర్ రామన్న. టీఆర్ రామన్న తమిళ సినిమాకు ప్రముఖ దర్శకుడు, నిర్మాతగా పేరుగాంచారు. ఎం.జీ.ఆర్, శివాజీ వంటి దిగ్గజాలతో సినిమా తీసిన ఏకైక నిర్మాత ఆయనే కావడం విశేషం.

ఆ తర్వాత టీఆర్ రాజకుమారి కోడలు కుశల కుమారి కూడా 70వ దశకంలో చిత్రాలలో హీరోయిన్‌గా వెలుగొందింది. కొన్నాళ్ల తర్వాత ఎస్పీఎల్ ధనలక్ష్మి ఇద్దరు కూతుళ్లు కూడా సినిమాల్లోకి వచ్చింది. వాళ్లే జ్యోతి లక్ష్మి, జయమాలిని. ధనలక్ష్మికి మరో సోదరికి పిల్లలు లేకపోవడంతో జ్యోతి లక్ష్మిని వారికి దత్తత ఇచ్చారు. జ్యోతి లక్ష్మి, జయమాలిని ఇద్దరూ తమ గ్లామరస్ పాటలలో నృత్యం చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. జ్యోతి లక్ష్మి సుమారు 300 చిత్రాలలో నటించగా, జయమాలిని 500 చిత్రాలలో నటించి రికార్డు సృష్టించింది.

ఈ కుటుంబానికి చెందిన తదుపరి, చివరి తరం జ్యోతి మీనా. 'ఉళ్ళత్తై అళ్లిత' చిత్రంలో కౌండమణి పక్కన నటించిన జ్యోతి మీనా విజయ్, అజిత్ వంటి ప్రముఖ నటులతో కూడా డ్యాన్స్ చేసింది. ఆమె కొన్ని సినిమాలకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ చేసింది. జ్యోతి మీనా తండ్రి ఒక కెమెరామెన్ కావడంతో, ఈ కుటుంబం నుండి సాంకేతిక రంగంలోకి కూడా ఒక వ్యక్తి వచ్చారు. ఇలా ఒకే కుటుంబం నంచి మొత్తంగా ఏడుగురు హీరోయిన్లు, ఒక దర్శకుడు, ఒక కెమెరామెన్ వచ్చి.. కొన్నేళ్ల పాటు తమిళ ఇండస్ట్రీని శాసించారు.


