'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ | Sakshi
Sakshi News home page

Saptha Sagaralu Dhaati Review: 'సప్త సాగరాలు దాటి' రివ్యూ

Published Fri, Sep 22 2023 5:03 PM

Saptha Sagaralu Dhaati Movie Review And Rating Telugu - Sakshi

టైటిల్: సప్త సాగరాలు దాటి
నటీనటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, పవిత్రా లోకేష్, అచ్యుత్ తదితరులు
నిర్మాత: రక్షిత్ శెట్టి
దర్శకుడు: హేమంత్ ఎమ్.రావు
సంగీతం: చరణ్ రాజ్
సినిమాటోగ్రఫీ: అద్వైత్ గురుమూర్తి
విడుదల తేదీ: 22 సెప్టెంబరు 2023

మంచి సినిమాకు భాషతో సంబంధం లేదు. ప్రేమకథలకు అంతం లేదు. అలా ఈ మధ్య కాలంలో కన్నడలో రిలీజై సెన్సేషన్ సృష్టించిన మూవీ 'సప్త సాగర ఎల్లోదాచె'. 'చార్లి 777' చిత్రంతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్న రక్షిత్ శెట్టి ఇందులో హీరో. ఇప్పుడు ఈ సినిమాని 'సప్త సాగరాలు దాటి' పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. ఇంతకీ ఎలా ఉంది? టాక్ ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కథేంటి?
మను (రక్షిత్ శెట్టి) కారు డ్రైవర్. శంకర్ గౌడ (అవినాష్) అనే బిజినెస్‌మ్యాన్ దగ్గర పనిచేస్తుంటాడు. సింగర్‌ కమ్ స్టూడెంట్ ప్రియ(రుక్మిణి వసంత్)తో ప్రేమలో ఉంటాడు. త్వరలో పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనేది వీళ్లిద్దరి ప్లాన్. ఓ రోజు శంకర్ గౌడ కొడుకు కారుతో గుద్ది ఒకరిని చంపేస్తాడు. డబ్బు ఆశ, త్వరగా బెయిల్ ఇప్పిస్తానని చెప్పడంతో ఆ నేరాన్ని.. మను తనపై వేసుకుంటాడు. జైలుకి వెళ్తాడు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోతాయి. జైలులో మను, బయట ప్రియ ఎలాంటి కష్టాలు అనుభవించారు? చివరకు ఏమైందనేదే 'సప్త సాగరాలు దాటి' మెయిన్ స్టోరీ.

ఎలా ఉందంటే?
ఓ తప్పటడుగు లేదా ఓ తప్పు నిర్ణయం మను అనే కుర్రాడి జీవితాన్ని తలక్రిందులు చేయడమే 'సప్త సాగరాలు దాటి' సినిమా. ఒక్క ముక్కలో చెప్పాలంటే స్టోరీ లైన్ ఇదే. సాధారణంగా ప్రేమకథా సినిమాలు అనగానే ఎవరో తెలియని వ్యక్తులు చివరకు ఎలా ఒక్కటయ్యారు అనేది చూపిస్తుంటారు. కానీ ఇందులో కాస్త డిఫరెంట్. ఆల్రెడీ ప్రేమలో ఉన్న ఓ అబ్బాయి-అమ్మాయి.. జీవితంలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారనేది చక్కగా చూపించారు.

ఫస్టాఫ్ విషయానికొస్తే.. ఖరీదైన కారులో మను-ప్రియ. కట్ చేస్తే డ్రైవర్‌గా మను, మధ్య తరగతి అమ్మాయి ప్రియ జీవితం ఎలా ఉంటుందో చూపించారు. మరోవైపు ప్రేమలో ఉన్న మను-ప్రియ.. త్వరలో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవడం, కలిసి ఉండేందుకు ఓ ఇల్లు కోసం వెతుకులాట లాంటి సీన్స్‌తో సరదాగా వెళ్తుంటుంది. అయితే జీవితంలో సెటిల్ కావాలని కలలు కంటున్న మను.. డబ్బుకి ఆశపడి చేయని నేరాన్ని తనపై వేసుకోవడం, జైలుకెళ్లడంతో ఒక్కసారిగా స్టోరీ టర్న్ తీసుకుంటుంది. అయితే తనని ఎలాగైనా బయటకు తీసుకొస్తానని మాటిచ్చిన ఓనర్ హార్ట్ ఎటాక్‌తో చనిపోవడంతో పరిస్థితులన్నీ తారుమారు అవుతాయి. మరి మను.. జైలు నుంచి బయటకొచ్చాడా? ప్రియని పెళ్లి చేసుకున్నాడా? అనేది తెలియాలంటే థియేటర్లలో ఈ మూవీ చూడాల్సిందే.

'సప్త సాగరాలు దాటి' కొత్త కథేం కాదు. కానీ సినిమాగా చూస్తున్నప్పుడు మనకు అస్సలు ఆ ఫీలింగే రాదు. మరోవైపు హీరోహీరోయిన్ల యాక్టింగ్, సంగీతాన్ని వేరుచేసి చూడలేం. ఎందుకంటే పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతాయి. ఈ సినిమాలో సముద్రం చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేసింది. హీరోయిన్‌కి సముద్రం అంటే చాలా ఇష్టం. మను-ప్రియ.. ఇద్దరూ సముద్రం పక్కనే ఇల్లు కట్టుకుని సెటిల్ అవ్వాలని అనుకుంటారు. కానీ విధి మరోలా ఉంటుంది. సముద్రంలో తుపాన్‌లా వీళ్ల జీవితం కూడా అల్లకల్లోలం అయిపోతుంది.

ప్రేమంటే హగ్గులు, ముద్దులు లాంటివి ఇప్పుడు తీస్తున్న లవ్‌స్టోరీల్లో కామన్ పాయింట్. 'సప్త సాగరాలు దాటి' చిత్రంలో మాత్రం అలాంటివేం లేవు. ఓ మంచి పుస్తకం చదువుతున్నట్లో.. ఓ మంచి పాట వింటున్నంత హాయిగా ఉంది. ప్రేమకథా చిత్రం అన్నాను కదా అని మొత్తం లవ్ సీన్సే ఉంటాయని అనుకోవద్దు. ఎందుకంటే ఇందులో జైలు, అందులో ఖైదీల జీవితం ఎలా ఉంటుందనేది చాలా హృద్యంగా ఆవిష్కరించారు. కానీ ఆ సన్నివేశాలనే కొన్నిసార్లు బోర్ కొట్టిస్తాయి కూడా!

ఎవరెలా చేశారు?
మనుగా నటించిన రక్షిత్ శెట్టి.. ఈ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. ప్రేమికుడు, ఖైదీ, పరిణితి చెందిన మనిషిగా.. ఇలా డిఫరెంట్ షేడ్స్‌ని అద్భుతంగా ఎక్స్‌పోజ్ చేశాడు. ప్రియ పాత్రలో నటించిన రుక్మిణి వసంత్.. కేవలం తన కళ్లు, నవ్వుతో మాయ చేసింది. రక్షిత్ శెట్టితో ఈమె కెమిస్ట్రీ అయితే వేరే లెవల్. నిజంగా ప్రేమికులు అనేంతలా స్క్రీన్‌పై రెచ్చిపోయారు. ప్రేమ, విరహాం, తపన.. ఇలా డిఫరెంట్ ఎమోషన్స్‌ని అంతే అద్భుతంగా పండించారు. మిగిలిన పాత్రల్లో నటించిన పవిత్రా లోకేశ్, అచ్యుత్ తదితరులు తమ వంతుగా ఆకట్టుకునే యాక్టింగ్ చేశారు. 

టెక్నికల్ విషయాలకొస్తే.. 'సప్త సాగరాలు దాటి'లో హీరోహీరోయిన్ అద్భుతమైన ఫెర్పార్మెన్‌తో అదరగొడితే మరో ముగ్గురు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. వీళ్లలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ రాజ్. ప్రేమకథకు సంగీతమే ప్రాణం. ఈ సినిమాకు ఇతడిచ్చిన పాటలు కావొచ్చు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కావొచ్చు మూవీకి ప్రాణం పోశాయి. మొదటి నుంచి చివర వరకు మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్లిపోయాయి. సినిమాటోగ్రాఫర్ అద్వైత గురుమూర్తి.. తన కెమెరాతో ప్రతి ఫ్రేమ్‌కి రిచ్‌నెస్ తీసుకొచ్చాడు. దర్శకుడు విజన్‌ని స్క్రీన్‌పై అద్భుతంగా వచ్చేలా చేశాడు. చివరగా రచయిత, దర్శకుడు హేమంత్ ఎమ్.రావు గురించి చెప్పుకోవాలి. ఓ సాధారణ ప్రేమకథని అంతే నిజాయితీగా చెప్పాడు. అనవసరమైన సీన్ల జోలికి పోకుండా ఉన్నది ఉన్నట్లు ప్రెజెంట్ చేశాడు. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ కూడా రెడీగా ఉంది. అక్టోబరు 20న అది రిలీజ్ కానుంది.

-చందు డొంకాన, సాక్షి వెబ్‌డెస్క్

Rating:
Advertisement
 
Advertisement
 
Advertisement