సంక్రాంతి స్పెష‌ల్‌: పోస్ట‌ర్లు, పాట‌ల‌తో సంద‌డే సంద‌డి | Sankranti 2022: Movie Poster, First Glimpse, Songs Released | Sakshi
Sakshi News home page

Tollywood: పాట‌లు, పోస్ట‌ర్లు, టైటిల్స్‌తో సంక్రాంతి జాత‌ర‌

Jan 17 2022 10:02 AM | Updated on Jan 17 2022 11:30 AM

Sankranti 2022: Movie Poster, First Glimpse, Songs Released - Sakshi

సంక్రాంతి పండగ సందర్భంగా పండగే పండగ అంటే కనువిందైన పోస్టర్లు, వీనుల విందైన పాటలు, టైటిల్స్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి... సినిమా ప్రియులకు పండగ తెచ్చాయి. కుటుంబసమేతంగా రామారావు వచ్చాడు. రవితేజ హీరోగా శరత్‌ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. మార్చి 25న థియేటర్లకి వస్తామని పేర్కొంటూ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రబృందం.

రవితేజ ఫ్యామిలీతో వస్తే... హాట్‌ హాట్‌గా దూసుకొచ్చారు తమన్నా. వరుణ్‌ తేజ్‌తో కలసి ‘గని’ చిత్రంలో ఈ బ్యూటీ స్టెప్పులేసిన ప్రత్యేక పాట ‘కొడితే..’ విడుదలైంది. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్‌ సాంగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మించిన ఈ చిత్రం మార్చి 18న విడుదల కానుంది. ఇక పందెం కోళ్లలా బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నట్లు ‘భీమ్లా నాయక్‌’ నుంచి పవన్‌ కల్యాణ్, రానా మాస్‌ లుక్‌ పోస్టర్‌ విడుదలైంది.

పవన్‌ కల్యాణ్‌ సరసన నిత్యా మీనన్‌, రానాకు జంటగా సంయుక్తా మీనన్‌ నటించిన ఈ చిత్రానికి సాగర్‌ కె. చంద్ర దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కావాల్సింది. అయితే ఫిబ్రవరి 25కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. మరోవైపు రోట్లో ఏదో నూరుతూ చిరునవ్వులు చిందిస్తూ సందడి చేసింది జయమ్మ. సుమ కనకాల టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న ‘జయమ్మ పంచాయతీ’ టైటిల్‌ సాంగ్‌ని పండగ సందర్భంగా వినిపించారు. ఈ పాటను దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ఆవిష్కరించారు. ఎం.ఎం. కీరవాణి స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా శ్రీకృష్ణ పాడారు. విజయ్‌ కుమార్‌ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాశ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇంకోవైపు యువహీరో నవీన్‌ పోలిశెట్టి నటించనున్న తాజా చిత్రానికి ‘అనగనగా ఒక రాజు’ అనే టైటిల్‌ ఖరారైంది. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్‌ త్వరలోనే ఆరంభం కానుంది. ఈ సినిమా టైటిల్‌ని ప్రకటిస్తూ, ఓ వీడియోను విడుదల చేశారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న మరో చిత్రం ‘స్వాతిముత్యం’ ప్రచార చిత్రం విడుదలైంది. ఈ చిత్రం ద్వారా గణేష్‌ బెల్లంకొండ హీరోగా పరిచయం అవుతున్నారు. లక్ష్మణ్‌.కె. కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

త్వరలో పూర్తి కానున్న ఈ చిత్రం వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇంకా కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తున్న ‘సమ్మతమే’ పోస్టర్‌ విడుదలైంది. గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వంలో కంకణాల ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చాందినీ చౌదరి హీరోయిన్‌. అలాగే వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ‘మన్మథలీల’ పోస్టర్‌ విడుదలైంది. అశోక్‌ సెల్వన్, సంయుక్తా హెగ్డే, స్మృతీ వెంకట్, రియా సుమన్‌ హీరో హీరోయిన్లుగా టి.మురుగానందం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పండగ సందర్భంగా ఇంకా పలు చిత్రాల లుక్స్, పాటలు తదితర అప్‌డేట్స్‌ వచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement