యంగ్‌ పొంగల్‌

sakshi special story on sankranthi 2021 year movies - Sakshi

పండగంటే ఎవరింటికి వాళ్లు చేరుకోవాలి. థియేటర్‌లోకి సినిమా రావాలి. కుటుంబమంతా కలసి ఆ సినిమాకు వెళ్లాలి. సినిమాకు సంక్రాంతి ముఖ్యం.  సంక్రాంతికి సినిమా ముఖ్యం. సంక్రాంతి బరిలో దిగడానికి భారీ సినిమాలు పోటీపడుతుంటాయి. స్టార్‌ హీరోలు ఇద్దరు ముగ్గురు పండగ పోటికీ సిద్ధమైతే, యంగ్‌ హీరోలకు ఛాన్స్‌ మిస్‌. కానీ వచ్చే సంక్రాంతి పూర్తిగా యంగ్‌ కాబోతోంది. ఈ పొంగల్‌ (సంక్రాంతి)కి వినోదం వడ్డించడానికి యంగ్‌ హీరోలు రెడీ అవుతున్నారు. ఆ వివరాలు చూద్దాం.

రంగ్‌ దే
25 సినిమాలు చేసిన నితిన్‌కు ఇప్పటివరకు ఒక్క సంక్రాంతి రిలీజ్‌ లేకపోవడం విశేషం. ‘రంగ్‌ దే’తో తొలిసారి పొంగల్‌కి తన సినిమాను విడుదల చేయబోతున్నారు నితిన్‌. అలాగే పెళ్లి తర్వాత నితిన్‌ నుంచి వస్తున్న తొలి సినిమా ఇదే. నితిన్, కీర్తీ సురేష్‌ జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగ్‌ దే’. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ నిర్మిస్తోంది. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడు.

శర్వాతో శ్రీకారం
శర్వానంద్‌కి సంక్రాంతి కలిసొస్తుంది. గతంలో ‘ఎక్స్‌ప్రెస్‌రాజా, శతమానం భవతి’ సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. శర్వానంద్‌ కెరీర్‌లో మంచి హిట్స్‌గా ఈ సినిమాలు నిలబడ్డాయి.
ఇప్పుడు ‘శ్రీకారం’తో మరోసారి సంక్రాంతికి థియేటర్స్‌లోకి రాబోతున్నారు. కొత్త దర్శకుడు కిశోర్‌రెడ్డి డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమాను 14 రీల్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో శర్వానంద్‌ రైతుగా కనిపించనున్నారు. ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ కథానాయిక. ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కావాల్సింది. కరోనా వల్ల సంక్రాంతికి వాయిదా వేశారని సమాచారం.
 

బ్యాచిలర్‌ వస్తున్నాడు
అఖిల్‌కి ఇది తొలి సంక్రాంతి.  హీరోగా అఖిల్‌ థియేటర్లో సందడి చేయబోతున్న తొలి సంక్రాంతి. అఖిల్, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ నిర్మిస్తోంది. ఈ సినిమా కూడా సమ్మర్‌లో విడుదల కావాల్సింది. కరోనా వల్ల పొంగల్‌కి పోస్ట్‌పోన్‌ అయింది. ఇందులో అఖిల్‌ పాత్ర పేరు నాగార్జున అని టాక్‌. ఇదో రొమాంటిక్‌ ఎంటెర్‌టైనర్‌ అని సమాచారం.


కరోనాతో సినిమాల పరిస్థితి అయోమయంగా మారింది. షూటింగులు ఆగిపోయాయి. సినిమాల విడుదలలు వాయిదా పడ్డాయి. సినిమా సందడి లేకపోవడం సినీ ప్రేమికులకు పెద్ద లోటు. త్వరలో థియేటర్లు ఆరంభం అయి, సందడి మొదలవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top