తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘గాయపడ్డ సింహం’ అనే టైటిల్ ఖరారైంది. ‘డోన్ట్ లాఫ్... ఇట్స్ ఏ సీరియస్ మేటర్’ (నవ్వొద్దు... ఇది సీరియస్ మేటర్) అనేది ఈ సినిమా క్యాప్షన్. ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
దర్శకుడు పవన్ సాధినేని సమర్పణలో కాశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో కల్యాణ చక్రవర్తి మంతిన, భానుకిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఒక పాట మినహా ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తయిందని యూనిట్ పేర్కొంది. శుక్రవారం ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసి, టీజర్‌ను ఈ నెల 9న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ‘‘పొలిటికల్ సెటైర్, క్రైమ్, కామెడీ వంటి అంశాల మేళవింపుతో ఈ సినిమా సాగుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం స్వీకర్ అగస్తీ.


