టాలీవుడ్ సినిమాల్లో ఒకప్పుడు దాదాపుగా తెలుగు నటీనటులు మాత్రమే కనిపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాన్ ఇండియా కల్చర్ పెరిగిపోయిన తర్వాత భాషతో సంబంధం లేకుండా ఎక్కడెక్కడి వాళ్లో తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. గత కొన్నేళ్లలో చూసుకుంటే కీలకమైన సహాయ పాత్రల్లో ఎక్కువగా తమిళ, మలయాళ యాక్టర్స్ దర్శనమిస్తున్నారు. అందులో జయరామ్ ఒకరు. ఈయన అల్లు అర్జున్‌తో కలిసి 'అల వైకుంఠపురములో' మూవీలో నటిస్తున్నప్పుడు జరిగిన ఓ సరదా అనుభవం గురించి ఇన్నాళ్లకు బయటపెట్టారు. అది ఆసక్తికరంగా అనిపించింది.
'నాకు తెలుగు తెలియదు. డైలాగ్ ఎన్నిసార్లు చదివినా సరే గుర్తుండట్లేదు. చివరకు డైలాగ్‌ని ఓ కాగితంపై రాసి ఎదురుగా ఉన్న అల్లు అర్జున్ నుదురు, ఛాతీపై అంటించి, దాన్ని చూస్తూ డైలాగ్ చెప్పేశాను' అని జయరామ్.. తాజాగా మలయాళ ఎఫ్ఎమ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్వతహాగా మలయాళ నటుడు అయిన జయరామ్.. 2018లో అనుష్క 'భాగమతి'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత అల వైకుంఠపురములో, రాధేశ్యామ్, ధమాకా, ఖుషీ, హాయ్ నాన్న, గుంటూరు కారం, గేమ్ ఛేంజర్, మిరాయ్ సినిమాల్లో కీలక పాత్రలు చేశారు. తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. సాధారణంగా డైలాగ్స్ విషయంలో నంబర్స్ చదువుతారు, లేదంటే పక్కనున్న వ్యక్తులు ప్రాంప్ట్ ఇస్తుంటారు. కానీ జయరామ్ మాత్రం అలా కాకుండా ఏకంగా బన్నీ నుదురుపైనే డైలాగ్ పేపర్ పెట్టి చెప్పడం అంటే కాస్త విశేషమే అని చెప్పొచ్చు.


