బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, హీరోయిన్ రష్మికా మందన్నా జోడీ రిపీట్ కానుందని సమాచారం. హోమీ అడజానియా దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘కాక్‌టెయిల్ 2’లో షాహిద్ కపూర్, రష్మికా మందన్నా తొలిసారి కలిసి నటించారు. ఈ చిత్రంలో కృతీ సనన్ మరో హీరోయిన్‌గా చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. అయితే తాజాగా మరో రొమాంటిక్ కామెడీ మూవీలో షాహిద్ కపూర్, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటించనున్నారనే టాక్ బాలీవుడ్‌లో వినిపిస్తోంది.
హిందీలో ‘బదాయి హో, మైదాన్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన అమిత్ శర్మ ఓ రొమాంటిక్ కామెడీ కథను రెడీ చేసి, షాహిద్ కపూర్‌కు వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట షాహిద్. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మికా మందన్నా నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. ఇదే నిజమైతే షాహిద్, రష్మికల జోడీ సిల్వర్ స్క్రీన్‌పై రిపీట్ అవుతుంది. జియో స్టూడియోస్‌తో కలిసి సునీల్ ఖేతర్ పాల్ ఈ సినిమాను నిర్మించనున్నారట.
మరోవైపు ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చిత్రీకరణతో రష్మికా మందన్నా బిజీగా ఉన్నారు. ఇంకా విజయ్ దేవరకొండ ‘రణబాలి’, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘మైసా’ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు రష్మికా మందన్నా. ఇలా వరుస చిత్రాలతో రష్మిక బిజీ బిజీగా ఉన్నారు.


