కలలో కూడా ఊహించలేని అదృష్టం అది: గోపరాజు రమణ | Sakshi
Sakshi News home page

Goparaju Ramana: రెండున్నరేళ్లలో 40 సినిమాలు.. కలలో కూడా ఊహించలేదు

Published Wed, May 10 2023 12:45 PM

Sakshi Special Interview About Middle Class Melodies Fame Goparaju Ramana

సాక్షి, గుంటూరు(తెనాలి): ‘ఒక్క ఛాన్స్‌’.. సినీప్రపంచంలో ఎందరో కోరుకునే అవకాశం. ఛాన్స్‌ వచ్చి నిరూపించుకున్న నటీనటులకు తిరుగుండదు. అవకాశాలు క్యూ కడతాయి. బిజీ ఆర్టిస్టును చేసేస్తాయి. రంగస్థలం, రేడియో, టీవీ, సినిమా నటుడు గోపరాజు రమణ ఇందుకో నిదర్శనం. ‘మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌’లో హీరో తండ్రి కొండలరావు పాత్రలో ఆ సినిమాకు ప్రాణం పోశారు రమణ. ఆ ఛాన్స్‌ ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. కరోనా సమయంలో ఓటీటీలో రిలీజైన ఆ సినిమాతో దాదాపు రెండున్నరేళ్లలో నలభై సినిమాల్లో నటించేంత బిజీ అయ్యారు. 69 ఏళ్ల వయసులో నిత్యం సినిమా షూటింగులతో తీరికలేకుండా గడుపుతున్న రమణ, ఎన్టీఆర్‌ శతాబ్ది రంగస్థల పురస్కారాన్ని తెనాలిలో స్వీకరించారు. ఈ సందర్భంగా సొంతూరు కొలకలూరులో ‘సాక్షి’కిచ్చిన ఇంటర్వ్యూ...

ఎన్టీఆర్‌ పురస్కారంతో..
ఎన్టీఆర్‌ పేరుతో రంగస్థల పురస్కారం నా జీవితానికో గొప్ప వరం... అదృష్టం. ఆ మహానటుడి శతజయంతి ఉత్సవాల్లో నన్నూ భాగస్వామిని చేసినందుకు సంతోషం. పాత సినిమాలు గైడ్‌లాంటివి. ఎన్టీఆర్‌ సినిమాలు మరీ ప్రత్యేకం. ఆయన వాయిస్‌ కల్చర్‌ గొప్పది. పాత్రలో పరకాయ ప్రవేశం చేసేలా డైలాగ్‌ మాడ్యులేషన్‌ ఉంటుంది. ‘దానవీరశూర కర్ణ’లో దుర్యోధనుడు, కర్ణుడు, శ్రీకృష్ణుడు పాత్రల్లో, వైరుధ్యమైన డైలాగ్‌ డెలివరీ ఆయనకే చెల్లింది. ఆయన ప్రభావం నాపైనే కాదు... చాలామందిపై ఉంటుంది.

ఎన్ని సినిమాల్లో నటించారు..
రంగస్థల నాటకాలు, రేడియో, టీవీ సీరియల్స్‌ చేస్తూ ఏడాదికి ఒకటో రెండో సినిమాలు చేస్తున్నా. ‘ఓ పనైపోతుంది బాబూ’ నా తొలి సినిమా. 15 సినిమాల్లో నటించాను. ఇంద్రగంటి మోహనకృష్ణ ‘గ్రహణం’తో పేరొచ్చినా, పెద్దగా అవకాశాలు రాలేదు. కరోనా రోజుల్లో ఇక నాటకాలు, టీవీ షూటింగులు తగ్గించుకుంటూ రిలాక్సయిపోయి, నాటకాల్లో మాత్రమే చేద్దామని అనుకున్నాను. అప్పుడే ఓ మంచి అవకాశం తలుపు తట్టింది.

‘మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌’ హిట్‌..
సాఫ్ట్‌వేర్‌ నుంచి షార్ట్‌ ఫిల్మ్‌స్‌ మీదుగా సినిమాల్లోకి వచ్చిన దర్శకుడు వినోద్‌ అనంతోజు తొలి ప్రయోగం ‘మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌’. ఈ గుంటూరు కుర్రోడి నుంచి ఓ రోజు నాకు ఫోనొచ్చింది...‘మేం చేసే సినిమాలో ఒక పాత్రకు మిమ్మల్ని అనుకున్నాం’ అని. ఆయన కథ చెప్పిన విధానం, శ్రద్ధ నచ్చింది. భవ్య క్రియేషన్స్‌ అన్నే రవికుమార్‌ ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత. కొత్త నటుల కోసం చేసిన అన్వేషణలో రవీంద్రభారతిలో జరుగుతున్న పరిషత్‌ పోటీలను చూశారు.‘తలుపులు తెరిచేఉన్నాయి’ నాటికలో నన్ను చూసి పిలిపించారు. మా అబ్బాయి సలహాపై మా సొంతూరులో పరిషత్‌ నాటకాలను కూడా చూడమన్న సూచనతో కొలకలూరు వచ్చారు. నాటకాలు చూశారు. నాతో పాటు ప్రభావతి, ఆంటోనీ వంటి కళాకారులను తీసుకున్నారు.

మీ స్టైల్‌ మారిపోతుందన్నారు..
ఆ సినిమాను కొలకలూరు, గుంటూరులోనే తీశారు. అప్పట్లో ‘సినిమా రిలీజయ్యాక మీ స్టైల్‌ మారిపోతుంది... మాకు దొరకరు’ అనేవారు రవికుమార్‌, 2020 నవంబరులో ఓటీటీలో సినిమా రిలీజైంది. పది రోజుల్లోనే సినిమా హాట్‌ టాపిక్కయింది. నాటకం నేర్పిన దర్శకులు, టీవీ, సినిమాల్లో అవకాశాలు ఇచ్చినవారు అభినందించారు. కొండలరావు పాత్రలో సొంత తండ్రినో, బాబాయినో చూసినట్టుగా ఉన్నారని ఎవరెవరో ఫోన్లు చేస్తుంటే ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోయాను.

‘ఆహా’ నా డేట్స్‌ కోసం..
కట్‌చేస్తే, ఆ సినిమా తర్వాత 40 సినిమాలు చేశానంటే ఆశ్యర్యం వేస్తోంది. కొన్ని వేరియేషన్స్‌తో ఇంచుమించు అలాంటి పాత్రలే వచ్చాయి. రిటైరవాలని అనుకున్న నేను, నిత్యం షూటింగులు, ప్రయాణాలతో తీరికలేకుండా ఉంటానని కలలో కూడా ఊహించలేదు. దర్శకుడికి నా పాత్రపై ఉన్న ఆలోచనను తెలుసుకుని, అందుకనుగుణంగా నటిస్తున్నాను. ఈ క్రమంలో ఆహా వారి ‘త్రీ రోజెస్‌’, కోనా ఫిలింస్‌ ‘పులిమేక’ వంటి వెబ్‌సిరీస్‌లోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నాను. ‘ఆహా’ వాళ్లు నా డేట్స్‌ కోసం కొన్నాళ్లు ఆగి మరీ అవకాశం ఇచ్చారు.

నాటకం నాకు అమ్మలాంటిది. నాటకం ఆడే పరిస్థితి వస్తుందా? లేదా? అనేది ఇప్పుడు చెప్పలేను. చేస్తున్న సినిమాల్లో సక్సెస్‌ ఎలాగనేదే తపన మినహా వెనక్కు వెళ్లాలని లేదు. మనసు సహకరిస్తోంది... ఉత్సాహం పెరుగుతోంది. సినిమాలకు విరామం వచ్చిన రోజున నాటకాలు తప్పకుండా ఆడతాను. సినిమా రంగంలోనివారు పరిషత్‌ నాటకాలను చూస్తే బాగుంటుంది. అక్కడ మంచి నటీనటులను ఎంచుకోవచ్చు. కొత్తవారికి అవకాశాలు ఇచ్చినట్టూ ఉంటుంది.

Advertisement
Advertisement