
ఈ మధ్యే వచ్చిన 'కింగ్డమ్' సినిమాతో నటుడిగా మరోసారి ఆకట్టుకున్న సత్యదేవ్.. ఓ తెలుగు వెబ్ సిరీస్ చేశాడు. అదే 'అరేబియా కడలి'. ఆనంది హీరోయిన్. ప్రముఖ దర్శకుడు క్రిష్.. షో రన్నర్‌గా వ్యవహరించిన ఈ సిరీస్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో థియేటర్లలో రిలీజైన 'తండేల్' సినిమాతో ఈ సిరీస్‌ని పోల్చి చూస్తున్నారు. మరి రెండు ఒకే కథతో తీశారా? ఇంతకీ ఈ సిరీస్ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
విశాఖ భీమిలిపట్నంలో మత్స్యవాడ, చేపలవాడ గ్రామాల ప్రజలు చాన్నాళ్లుగా గొడవపడుతుంటారు. జెట్టీలు లేకపోవడంతో చేపల వేటకు సరైన సదుపాయాలు ఉండవు. దీంతో బతుకు దెరువు కోసం గుజరాత్ వలస వెళ్తుంటారు. చేపలవాడ గ్రామానికి చెందిన బద్రి(సత్యదేవ్).. మత్స్యవాడకు చెందిన గంగని ప్రేమిస్తుంటాడు. మరోవైపు గుజరాత్ వెళ్లిన బద్రి.. తన బృందంతో కలిసి అనుకోకుండా పాకిస్థాన్ జలాల్లోకి వెళ్తాడు. దీంతో ఆ దేశ ఆర్మీ.. వీళ్లని బంధిస్తుంది. మరి బద్రితో పాటు ఉన్నవాళ్లని తీసుకొచ్చేందుకు ఊరి ప్రజలు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
ఈ సిరీస్ చూస్తున్నంతసేపు నాగచైతన్య 'తండేల్' సినిమానే గుర్తొస్తుంది. ఆల్రెడీ తెలిసిన కథ అయినప్పటికీ.. బాగానే తీశారు. చూస్తున్నంతసేపు ఎంగేజ్ అయ్యేలా చేశారు. కాకపోతే సినిమా రెండు-రెండున్నర గంటల్లోనే చెప్పేయాల్సి ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల్ని అందులో సింపుల్‌గా చూపించేశారు. కానీ ఇది వెబ్ సిరీస్ కావడంతో చాలా డీటైల్డ్‌గా చూపించారు. అసలేం జరిగింది? జాలర్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది విడమరిచి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ప్రతి ఎమోషన్‌ని చూపించారు.
మొదట్లో చేపలవాడ, మత్స్యవాడ గ్రామాల మధ్య గొడవలు.. తర్వాత వేటకు వెళ్లడం, బద్రి-గంగ మధ్య లవ్ స్టోరీ. జాలర్ల కుటుంబాల్లోని బాధలు చూపిస్తూ కథని నిదానంగా తీసుకెళ్లారు. సహజత్వానికి దగ్గరగా సీన్లు చూపించారు. సముద్రంలోని జరిగే సన్నివేశాలు ఆసక్తి రేపుతూనే, ఉత్కంఠగానూ అనిపించాయి. పాక్ పోలీసులకు దొరికిపోయి అక్కడి జైల్లో మన జాలర్లు పడే ఇబ్బందులు ఎమోషనల్ అయ్యేలా చేశాయి.
'తండేల్'ని ప్రేమకథగా తీస్తే.. ఈ సిరీస్‌ని మాత్రం కాస్త డిఫరెంట్ యాంగిల్‌లో చూపించారు. ప్రేమించినవాడితో కలిసి ఊరికి మంచి చేయాలనుకోవడం, జెట్టీ వస్తే తమ ఊరిప్రజలు వలస వెళ్లాల్సిన అవసరం లేదని హీరో భావించడం.. ఇలా హీరోహీరోయిన్లకు ఓ కారణాన్ని చూపించడం.. సినిమాని ఈ సిరీస్‌ని వేరు చేసి చూపించిందని చెప్పొచ్చు.
ఎవరెలా చేశారు?
స్వతహాగా సత్యదేవ్ ఉత్తరాంధ్రకు చెందినవాడు కావడంతో బద్రి పాత్రలో విశాఖ యాసలో ఆకట్టుకున్నాడు. గంగ రోల్ చేసిన ఆనంది కూడా పూర్తి న్యాయం చేసింది. 'కోర్ట్' ఫేమ్ రోషన్, చింతకింది శ్రీనివాసరావు, నాజర్ తదితరులు తమ పాత్రల ఫరిది మేరకు నటించారు. ఇది సిరీస్ కావడంతో కమర్షియల్ హంగులు లేకుండానే తెరకెక్కించారు. స్టోరీ పరంగా కొత్తగా ఆశిస్తే మాత్రం అసంతృప్తికి గురయ్యే అవకాశముంది. టెక్నికల్ అంశాలు కూడా బాగున్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఈ సిరీస్ నచ్చేయొచ్చు.