అందుకే ‘లక్ష్మీ’ అని పిలుస్తా : రాజా

Sakshi Interview With Sirivennela Sitaramasastri Son Raja

పండగ సిరి

తండ్రి ‘సిరివెన్నెల’ స్టార్‌ రైటర్‌. తనయుడు రాజా మంచి నటుడు. ఇటీవలే వెంకటలక్ష్మీ హిమబిందుతో ఏడడుగులు నడిచారు రాజా. దీపావళి సందర్భంగా సతీసమేతంగా ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు పంచుకున్నారు.

► పెళ్లికాకముందు తనను అందరూ బిందు అని పిలిచేవారట. నాకు ఆ విషయం తెలియక లక్ష్మీ అని పిలుస్తుంటే ఎవర్నో పిలుస్తున్నట్లు వెళ్లిపోయేది. అప్పుడు నేను ‘నీ పేరు లక్ష్మీ హిమబిందు కదా, అందుకే లక్ష్మీ’ అని పిలుస్తాను అన్నాను. మా ఇంట్లో అందరూ లక్ష్మీ అనే పిలవటంతో ఇప్పుడు అలవాటు అయ్యింది.

► లక్ష్మీలో నాకు బాగా నచ్చింది ఆమె కలుపుగోలుతనం అని రాజా అంటే , ‘ఏ చిన్న పని చేసినా క్రిస్టల్‌ క్లియర్‌గా చేస్తారు. అలాగే ఆయన క్రమశిక్షణ చాలా నచ్చుతుంది’ అని లక్ష్మీ అన్నారు.

► మా అమ్మగారికి కోడల్ని తెద్దామనుకుంటే, అత్తగారికి కూతురయ్యింది. మమ్మల్ని ఎవరు చూసినా కొత్తగా పెళ్లయినవాళ్లలా లేరు అంటున్నారు. అలాగే మా బావ త్రివిక్రమ్‌గారు ‘ఎన్నో ఏళ్లుగా ఒకరికొకరు తెలిసినవాళ్లులా ఉన్నారు మీ ఇద్దరూ’ అన్నారు. మా ఫ్యామిలీ అందరికీ లక్ష్మి నచ్చేసింది. అది అన్నిటికన్నా ఆనందం. త్రివిక్రమ్‌గారు తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్‌సైక్లోపీడియా. అందుకే నేను ఏదైనా విషయంలో డైలమాలో ఉంటే బావ సలహా తీసుకుంటాను. ప్రస్తుతం ఉన్న టాప్‌టెన్‌ డైరెక్టర్స్‌తో పని చేయటంతో పాటు కొత్తగా ఏదైనా చేసి నటునిగా నిరూపించుకోవాలనుకుంటున్నా.

► డబ్బు కోసం నేను నటునిగా ప్రయాణం మొదలుపెట్టలేదు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా బాగానే సంపాదించేవాణ్ని. కానీ, అక్కడ తృప్తిగా అనిపించకపోవటంతో జాబ్‌ క్విట్‌ చేశాను.

► నాన్న ఏ సినిమాకైనా పాట రాస్తున్నప్పుడు ఒక వెర్షన్‌ రాసి దర్శకునికి వినిపిస్తే, చాలా బావుంది పాట ఇచ్చేయండి అంటారు. అప్పుడు నాన్నగారు ‘మీకు నచ్చింది కానీ నాకు కావాల్సింది ఇంకా ఏదో మిస్సయింది. అది రాగానే ఇస్తాను’ అంటారు. నేను వ్యక్తిగతంగా నాన్న దగ్గర నుండి కమిట్‌మెంట్, వృత్తిపట్ల ప్యాషన్‌ నేర్చుకుంటే అమ్మదగ్గర క్రమశిక్షణ నేర్చుకున్నాను.

► నాకు యాక్టింగ్‌ తర్వాత ఫిట్‌నెస్‌ ఎంతో ఇష్టం. నాకిష్టమైన పనే చేస్తాను కాబట్టి ఎప్పుడూ సెలక్టివ్‌ గా ఉంటాను. నేను ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ కాబట్టి ఇలా ఉండాలి, అలా తినాలి అని చెప్తాను. వాటివల్ల ఇంట్లో డిబేట్‌లు, గొడవలు అన్నీ జరుగుతాయి.  

► మా నాన్న లక్ష్మీని వంకాయకూర చేయటం వచ్చా అని అడిగితే వచ్చు అని చెప్పింది. వండటం కాదు, మా అమ్మ వండినట్లు వండాలి అని తనను ఆట పట్టిస్తుంటాను

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top